బరిలో కూతురు మీసా భారతి
ఆమె విజయం కోసం చెమటోడుస్తున్న వైనం
పాటలీపుత్ర లోక్‌సభ స్థానం బీజేపీ, ఆర్జేడీ మధ్య హోరాహోరీ పోరుకు వేదికైంది. బీజేపీ సిట్టింగ్ ఎంపీ రామ్ కృపాల్ యాదవ్ హ్యాట్రిక్‌పై గురిపెట్టారు. ఆయన చేతిలో రెండుసార్లు ఓడిన ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి ముచ్చటగా మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కూతురిని ఎలాగైనా గెలిపించుకోవాలని లాలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు...
బిహార్‌లోని పాటలీపుత్ర లోక్‌సభ స్థానం 2008లో డీలిమిటేషన్ తర్వాత ఏర్పాటైంది. 2009లో లాలు కూడా ఇక్కడ ఓటమి చవిచూడటం విశేషం. అది కూడా ఒకప్పటి తన శిష్యుడు జేడీ(యూ) నేత రంజన్ ప్రసాద్ యాదవ్ చేతిలో! తర్వాత మీసా భారతిని బరిలో దింపారు. తనను కాదని కూతురికి టికెటివ్వడంతో లాలుతో విభేదించిన రామ్‌కృపాల్ 2014లో ఆర్జేడీని వీడి బీజేపీలో చేరారు. 2014, 2019ల్లో రెండుసార్లు మీసా భారతిని ఓడించారు.
విద్యార్థి సంఘాల నుంచి ఎదిగిన రామ్ కృపాల్ 1993లో ఆర్జేడీ టికెట్‌పై తొలిసారి ఎంపీగా గెలిచారు. తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. 1996లో, 2004లో కూడా లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఐదుసార్లు ఎంపీగా చేసిన ఆయనకు బిహార్‌లో గట్టి రాజకీయ బలం ఉంది. పాటలీపుత్ర నియోజకవర్గ ప్రజలతో మంచి అనుబంధముంది. పిలిస్తే పలికే నాయకునిగా పేరు తెచ్చుకున్నారు. నియోజకవర్గమంతా కలియదిరుగుతూ ఓటర్లను ప్రత్యక్షంగా కలుస్తున్నారు. రామమందిర నిర్మాణ ప్రభావం కూడా ఇక్కడి ఓటర్లపై బాగా ఉండటం ఆయనకు మరింత కలిసి రానుంది.
మీసా... మూడోసారి
పాటలీపుత్రలో ఆర్జేడీ ఓటమి పరంపరకు ఈసారి ఎలాగైనా బ్రేక్ వేయడానికి మీసా ప్రయతి్నస్తున్నారు. లాలు, భార్య రబ్రీ, కుమారుడు తేజస్వీ యాదవ్‌తో సహా కుటుంబమంతా ఆమె గెలుపు కోసం పని చేస్తోంది. 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం 2019లో మీసాకు బాగా మైనస్‌గా మారింది. ప్రజలకు అందుబాటులో ఉండరన్న అపప్రథను కూడగట్టుకున్నారు.
ఈసారి కూడా ఎన్నికలవగానే మాయమవుతారా, గెలుపోటములతో నిమిత్తం లేకుండా నియోజకవర్గంలో ఉండి పని చేస్తారా అంటూ ప్రచారం పొడవునా ప్రజలు ఆమెను నిలదీస్తున్న పరిస్థితి! అయితే ఇక్కడ మోదీ ఫ్యాక్టర్ 2019లో ఉన్నంత బలంగా లేకపోవడం మీసాకు కాస్త ఊరట. పైగా పాటలీపుత్ర లోక్‌సభ స్థానం పరిధిలోని 6 అసెంబ్లీ స్థానాలూ ఆర్జేడీ, దాని మిత్రపక్షాల చేతిలోనే ఉన్నాయి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తదితరాలను ప్రచారా్రస్తాలుగా సంధిస్తున్నారామె.
కుల సమీకరణాలు...
బీజేపీకి మద్దతిచ్చే బ్రాహ్మణులతో సహా అగ్రవర్ణాల ఓట్లు పాటలీపుత్రలో లక్షకు పైగా ఉన్నాయి. దాదాపు 4 లక్షల ఓట్లున్న భూమిహార్ ఓటర్లలోనూ ఆ పార్టీకి బలముంది. 5 లక్షల యాదవ, 1.7 లక్షల కుర్మీ, 3 లక్షల దళిత ఓట్లు రామ్ కృపాల్, మీసా మధ్య చీలనున్నాయి. యాదవులతో పాటు 1.5 లక్షల ముస్లిం ఓట్లను మీసా నమ్ముకున్నారు. కాకపోతే మజ్లిస్ బరిలో ఉండటంతో ముస్లిం ఓట్లు చీలి ఆర్జేడీకి గట్టి నష్టమే చేసేలా కన్పిస్తోంది. హోరాహోరీ పోరు లో ఈసారి పాటలీపుత్రలో లాంతరు వెలుగుతుందో, ముచ్చటగా మూడోసారీ కమలమే వికసిస్తుందో చూడాలి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment