ముంబై: కేంద్రమంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్‌పీఐ) అధినేత రామ్‌దాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల ఐక్యతలో కీలక పాత్ర పోషించిన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తమవాడేనని, ఏ క్షణమైనా ఎన్డీయే కూటమిలోకి తిరిగి వచ్చేస్తారని వ్యాఖ్యానించారు.
కాగా గతేడాది వరకు ఎన్డీయే కూటమిలోనే కొనసాగిన నితీష్ కుమార్.. 2022 ఆగస్టులో బీజేపీతో తెగదెంపులు చేసుకొని లాలు ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీతో (మహాఘట్‌బంధన్) చేతులు కలిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకమవుతున్న విషయం తెలిసిందే. మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకు రావడంతో బిహార్ సీఎం కీలకపాత్ర పోషించారు. ఈ క్రమంలో 26 విపక్షాలు కలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడ్డాయి.
తాజాగా రామ్‌దాస్ అథవాలే ముంబైలో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో బిహార్‌లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ నితీష్ సీఎంగా ఎంపిక చేసినట్లు తెలిపారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే ఎన్డీయే లక్ష్యమైతే.. కేవలం ప్రధానమంత్రి నరేంద్రమోదీని అధికారం నుంచి తొలగించడమే ఏకైక ఎజెండాగా ప్రతిపక్షాలు ఏకమయ్యాయని ‘ఇండియా’ కూటమిపై విరుచుకుపడ్డారు. కూటమికి కన్వీనర్, ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరు అనే విషయంలో కూడా విపక్షాల మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పారు.
చదవండి: జై షా బీసీసీఐ సెక్రటరీ ఎలా అయ్యాడు?.. అమిత్ షాకు ఉదయనిధి స్టాలిన్ కౌంటర్
‘నేను నిన్న(శనివారం) పాట్నాలో ఉన్నాను. బెంగుళూరులో జరిగిన ప్రతిపక్షాలు భేటీపై నితీష్ అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఇండియా పేరుపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశాడు. అతను సంతోషంగా లేకపోతే త్వరలో ముంబయిలో నిర్వహించబోయే సమావేశానికి కూడా హాజరు కావొద్దని కోరాను. నితీష్ అంతకుముందు ఎన్డీయేలో సభ్యుడు, ఆయన ఎప్పుడైనా సొంతగూటికి తిరిగి రావొచ్చు’ అని అథవాలే పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీకి శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అదే విధంగా మహారాష్ట్రలో ప్రతిపక్షాలకు మమతా వల్ల ఉపయోగం లేదని కేంద్రమంత్రి పేర్కొన్నారు. అయితే రామ్‌దాస్ అథవాలే వ్యాఖ్యలపై జేడీయూగానీ, నీతీష్‌గానీ స్పందించలేదు. కానీ ‘ఇండియా’ పేరుపై నీతీష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో అథవాలే వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment