న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బోల్తా పడ్డాయి. జాతీయ సర్వే సంస్థలు ఏకపక్షంగా ఎన్డీయేకు మెజారిటీ కట్టబెడితే.. ఫలితాల్లో మాత్రం ఇండియా కూటమి గట్టి పోటీ ఇస్తోంది. ఇక.. ఫలితాల లెక్కింపు ముగింపు దశకు చేరుకుంటున్న వేళ పార్టీల సరళిలు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి కూడా ఒక మాస్టర్‌ప్లాన్ రూపొందించుకుని దాన్నే అనుసరించే ప్ర యత్నాల్లో ఉన్నట్లు సమాచారం.
లోక్‌సభ ఎన్నికల్లో కీలక రాష్ట్రాల్లో ఫలితాలు తారుమారవుతున్నాయి. '400 సీట్లకు పైనే' అనే నినాదంతో లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే జస్ట్ మెజారిటీకే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రలో ఈసారి చతికిలపడింది. రెండు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్ష ఇండియా కూటమి ఆధిక్య స్థానాల్లో దూసుకుపోతుంది.
ఇదిలా ఉండగా ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య సీట్ల వ్యత్యాసం ఎక్కువగా లేకపోవడంతో ఇరు కూటమిలు ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పటికే చర్చలు ప్రారంభించింది. నేటి సాయంత్రం మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి సమావేశం కానుండగా.. రేపు ఎన్డీయే మిత్రపక్షాలు భేటీ కానున్నాయి. ఎన్టీయే కూటమి తన మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్నాయి.
ఇక.. ఇండియా కూటమి మరో అడుగు ముందుకు వేసింది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు పుంజుకోవడంతో ఎన్డీయే కూటమిలోని బీజేపీ భాగస్వామ్య పక్షాలకు గాలం వేయడాన్ని ప్రారంభించాయి. ఈ క్రమంలో బిహార్ సీఎం నితీష్ కుమార్‌పై ఇండియా కూటమి కన్నేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఎన్డీయే కూటమిలో ఉన్న నితిష్‌ను ఇండియా కూటమి తమ వైపు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. నితీష్‌కు ఉప ప్రధాని పదవిని కూడా ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అదే విధంగా ఏపీలో చంద్రబాబు నాయుడిని ఇండియా కూటమిలోకి ఆహ్వానించినట్లు భోగట్టా. బాబు తమ కూటమిలో చేరితో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఆశచూపెట్టబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడితో మాట్లాడినట్లు తెలుస్తోంది. అలాగే.. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేతోనూ ఇండియా కూటమి ప్రతినిధులు సంప్రదింపులు జరపుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా లోక్‌సభ ఎన్నికల ముందే జేడీయూ, టీడీపీలు ఎన్డీయే కూటమితో కలిశాయి
కాగా బిహార్‌లో 16 లోక్‌సభ స్థానాలకు గానూ నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ 14 స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇటు టీడీపీ కూడా 14 స్థానాల్లో ముందంజలో ఉంది. జేడీయూ, టీడీపీ దాదాపు 28 లోక్‌సభ స్థానాలను కలిగి ఉండటంతో.. వీరు ఇండియా కూటమికి మారితే కింగ్‌మేకర్‌లుగా మారే అవకాశం ఉంది. ఈ లెక్కన మున్ముందు ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment