ఒడిసా (పట్) "నాయక్"  | Naveen Patnaik History of Biju Leader | Sakshi
Sakshi News home page

ఒడిసా (పట్) "నాయక్" 

Published Wed, Mar 13 2019 8:39 PM | Last Updated on Fri, Mar 15 2019 9:20 PM

Naveen Patnaik History of Biju Leader - Sakshi

సాక్షి వెబ్ ప్రత్యేకం : సాదాసీదా ఆహార్యం, సాత్వికాహారం, నిరాడంబర జీవనం, రాజీలేని పనితీరు ఒడిషాలో వరుసగా నాలుగు పర్యాయాలు అధికారాన్ని నిలుపుకున్న నవీన్‌ పట్నాయక్‌ వ్యవహార శైలి. రాష్ట్రానికి చాలాకాలం దూరంగా ఉండటంతో మాతృభాష ఒడియాపై పట్టులేకున్నా కష్టించి పనిచేయడంపై మమకారమే ఆయనను ప్రజలకు చేరువ చేసింది. ఐదేళ్ల పరిపాలనతోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న నేతలకు నవీన్‌ పట్నాయక్‌ నిరంతరాయంగా ఎలా నెగ్గుకొస్తున్నారన్నది ఓ పట్టాన అంతుపట్టదు. అధికారులతో వారి సామర్ధ్యానికి అనుగుణంగా పనిచేయించడమే అభివృద్ధికి బాటలు వేస్తుందని నవీన్‌ పట్నాయక్‌ చెబుతుంటారు.



కవి, రచయితగా..
ఒడిషా సీఎం నవీన్‌ పట్నాయక్‌ గత నాలుగు పర్యాయాలుగా బిజూ జనతాదళ్‌ను రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టే దిశగా నడిపించడంలో విజయవంతమై దేశ రాజకీయాల్లోనే అరుదైన ఘనత సాధించారు. కవి, రచయితగానూ పేరొందిన నవీన్‌ పట్నాయక్‌ నాలుగు పుస్తకాలను ప్రచురించారు. కుటుంబ సభ్యులు, బాల్యస్నేహితులు పప్పూగా పిలుచుకునే నవీన్‌ పట్నాయక్‌ 1946 అక్టోబర్‌ 16న కటక్‌లో ఒడిషా మాజీ సీఎం బిజూ పట్నాయక్‌, గ్యాన్‌ పట్నాయక్‌ దంపతులకు జన్మించారు. డెహ్రాడూన్‌లో వెల్హాం బాయ్స్‌ స్కూల్‌, ది డూన్‌ స్కూల్‌లో ఆయన విద్యాభ్యాసం సాగింది. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన కిరోరి మాల్‌ కలేజ్‌ నుంచి నవీన్‌ పట్నాయక్‌ బీఏ డిగ్రీ పొందారు. పాఠశాల స్ధాయి నుంచే నవీన్‌ పట్నాయక్‌ చరిత్ర, ఆయిల్‌ పెయింటింగ్‌, అథ్లెటిక్స్‌పై మక్కువ పెంచుకున్నారు. డూన్‌ స్కూల్‌లో మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీకి నవీన్‌ పట్నాయక్‌ మూడేళ్ల జూనియర్‌. పట్నాయక్‌ ఇండియన్‌ నేషనల్‌ ట్రస్ట్‌ ఫర్‌ ఆర్ట్‌ అండ్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ (ఇంటాక్‌) వ్యవస్ధాపక సభ్యుడిగానూ వ్యవహరిస్తున్నారు.

తండ్రి మరణంతో రాజకీయ అరంగేట్రం..
ఒడిషా రాష్ట్రానికి, రాజకీయాలకు చాలాకాలం దూరంగా ఉన్న పట్నాయక్‌ తండ్రి బిజూ పట్నాయక్‌ మరణంతో అమెరికా నుంచి తిరిగివచ్చి1997లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత బీజేడీ పేరుతో పార్టీని స్ధాపించి బీజేపీ తోడ్పాటుతో 1998లో ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. ఒడిషా సీఎంగా నవీన్‌ పట్నాయక్‌ తనదైన పేదల అనుకూల విధానాలు, అభివృద్ధి రాజకీయాలతో రాష్ట్ర రాజకీయాల్లో కుదురుకున్నారు. ఆ తర్వాత వరుసగా నాలుగు పర్యాయాలు ఒడిషాలో అధికారాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు. తండ్రి బిజూ పట్నాయక్‌ మరణానంతరం ఒడిషాలోని అస్కా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికలో నవీన్‌ పట్నాయక్‌ పోటీచేసి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. అటల్‌ బిహారి వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయన కేంద్ర గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. 

ఒడిషా సీఎంగా..
2000 సంవత్సరంలో జరిగిన ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో బీజేడీ అధికారంలోకి రావడంతో నవీన్‌ పట్నాయక్‌ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఒడిషా సీఎం పగ్గాలు చేపట్టారు. ఇక 2004, 2009, 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒడిషాలో నవీన్‌ పట్నాయక్‌ సారథ్యంలోని బీజేడీ తిరుగులేని విజయాలు సాధించి అధికారాన్ని నిలుపుకుంది. తండ్రి తరహాలోనే అధికార యంత్రాంగంపై గట్టి పట్టుకలిగిన పట్నాయక్‌ వారిని అభివృద్ధి పనుల్లో నిరంతరం శ్రమించేలా పర్యవేక్షించడంలో విజయం సాధించారు. పట్నాయక్‌ తన బాల్య, యవ్వన దశలు ఎక్కువగా ఒడిషాకు దూరంగా గడపడంతో ఒడియా భాష రాయడంలో, పలకడంలో ఆయన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశంలోనే తమ ప్రాంతీయ భాష మాట్లాడటం రాని తొలి సీఎం నవీన్‌ పట్నాయక్‌ కావడం గమనార్హం. ఒడియా మాట్లాడటం రాని సీఎంగా ఆయన విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. పట్నాయక్‌కు హిందీ, ఫ్రెంచ్‌, ఆంగ్ల భాషల్లో మంచి నైపుణ్యం ఉంది. ఇక ర్యాలీలు, బహిరంగ సమావేశాల్లో రోమన్‌ అల్ఫాబెట్‌లో ఆయన ఒడియా ప్రసంగాలు సాగుతాయి. 

హాబీలు : పుస్తక పఠనం, సాంస్కృతిక, చారిత్రక, పర్యావరణ కార్యక్రమాలు వీక్షించడం, రచనా వ్యాసంగం
ఇష్టమైన ఆహారం : మసాలా కూర్చిన బెండకాయ ఫ్రై,  వైట్‌సాస్‌తో ఫ్రైడ్‌ చికెన్‌
-మురళి

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/4

2
2/4

3
3/4

4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement