biju janata dal
-
Naveen Patnaik: రాజకీయ పర్యాటకుల ప్రభావం సున్నా
భువనేశ్వర్: ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి రాజకీయ పర్యాటకులు తమ రాష్ట్రానికి తరలివస్తున్నారని, తమపై వ్యక్తిగత దూషణలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ మండిపడ్డారు. తమ ప్రజలపై ఈ రాజకీయ పర్యాటకుల ప్రభావం ఏమాత్రం ఉండదని తేలి్చచెప్పారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు పొలిటికల్ టూరిస్టులుగా మారిపోయారని, కేవలం ఎన్నికల సమయంలోనే వారు ఒడిశాలో కనిపిస్తారని, ఆ తర్వాత మటుమాయం అవుతారని ఎద్దేవా చేశారు. నవీన్ పటా్నయక్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాజకీయ పర్యాటకులు అనుచితమైన భాష ఉపయోగిస్తున్నారని, అది తమ రాష్ట్ర ప్రజలు సహించబోరని హెచ్చరించారు. -
కరోనాతో బీజేడీ ఎమ్మెల్యే మృతి
సాక్షి, భువనేశ్వర్: కరోనా వైరస్‌తో బిజు జనతా దళ్ (బీజేడీ) ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రదీప్ మహరతి ఆదివారం మృతిచెందారు. సెప్టెంబర్ 14న ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండడంతో వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. 64 ఏళ్ల ప్రదీప్ మహరతి ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో కీలక మంత్రి పదవులు చేపట్టారు. 1985లో జనతా పార్టీ తరపున పిప్లీ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఒడిశా శాసనసభకు ఎన్నికయ్యారు. మొత్తం ఏడు సార్లు ఆ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించగా అందులో ఐదు సార్లు జీజేడీ తరుపున ( 2000-2019) కావడం విశేషం. వ్యవసాయ, పంచాయతీరాజ్, త్రాగునీటి సరఫరా, మత్స్య శాఖల మంత్రి పదవుల్లో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. వ్యవసాయ రంగానికి ఆయన చేసిన కృషికి గాను 2016లో 'గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్షిప్' అవార్డు, 2014-2015లో 'కృషి కర్మన్' అవార్డు దక్కించుకున్నారు. -
ఐదోసారి సీఎంగా నవీన్
భువనేశ్వర్: ఒడిశా శాసనసభ ఎన్నికల్లో వరుసగా ఐదోసారి విజయఢంకా మోగించిన బిజు జనతా దళ్ అధినేత నవీన్ పట్నాయక్ మే 29వ తేదీన నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భువనేశ్వర్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఆయన వరుసగా ఐదోసారి ఒడిశా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనున్నారు. అంతకుముందు బీజేడీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం సుమారు 45 నిమిషాలు జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా నవీన్ పట్నాయక్‌ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ గణేషి లాల్‌ను కలసిన నవీన్ పట్నాయక్.. ఎమ్మెల్యేలు తనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న తీర్మాన ప్రతిని ఆయనకు అందజేశారు. అనంతరం ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ గణేషి లాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా నవీన్ పట్నాయక్‌ను ఆహ్వానించారు. ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో బీజేడీ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 146 శాసనసభ స్థానాలకు గాను 112 సీట్లలో బీజేడీ విజయం సాధించింది. బీజేపీ 23 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఇక కాంగ్రెస్ 9 సీట్లకే పరిమితమైంది. పాట్కూరా శాసనసభ స్థానంలో అభ్యర్థి మరణం, ఫోణి తుపాను కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. దేశంలో మోదీ గాలి వీస్తున్పప్పటికీ రాష్ట్రంలో మాత్రం 23 సీట్లకే బీజేపీ పరిమితమైంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ అదనంగా 13 స్థానాల్ని గెలుచుకొని ప్రతిపక్ష స్థానాన్ని అందుకుంది. నిరాడంబర వ్యక్తిత్వం నిరాడంబర జీవనశైలి, సాదాసీదా ఆహార్యం, సాత్వికాహారం రాజీలేని పనితీరు ఒడిశాలో వరుసగా అయిదు పర్యాయాలు అధికారాన్ని నిలుపుకున్న నవీన్ పట్నాయక్ వ్యవహార శైలి. రాష్ట్రానికి చాలాకాలం దూరంగా ఉండటంతో మాతృభాష ఒడియాపై పట్టులేకున్నా కష్టించి పని చేయడంపై మమకారమే ఆయనను ప్రజలకు చేరువ చేసింది. ఐదేళ్లు పాటు పాలించిన నేతలు తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొం టున్న ప్రస్తుత రాజకీయాల్లో సుమారు 19 ఏళ్ల పాటు అధికారాన్ని నిలుపుకుని.. మరోసారి సీఎంగా గెలిచిన ఘనత ఆయన సొంతం. ఈ నేపథ్యంలో నవీన్ పట్నాయక్ జీవితంలోని ముఖ్య ఘట్టాలు.. జననం.. విద్యాభ్యాసం.. ఒడిశా దివంగత ముఖ్యమంత్రి, జనతా దళ్ నేత బిజు పట్నాయక్, గ్యాన్ పట్నాయక్ దంపతుల కుమారుడైన నవీన్ పట్నాయక్ ఒడిశాలోని కటక్ ప్రాంతంలో అక్టోబర్ 16, 1946లో జన్మించారు. డెహ్రాడూన్‌లోని వెల్హం బాలుర పాఠశాల, డూన్ పాఠశాలల్లో ఆయన ప్రాథమిక విద్య నభ్యసించారు. అనంతరం ఢిల్లీ విశ్వవిద్యాల యానికి చెందిన సెయింట్ స్టీఫెన్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. పాఠశాల స్థాయి నుంచే ఆయన చరిత్ర, ఆయిల్ పెయింటింగ్, అథ్లెటిక్స్‌పై మక్కువ పెంచుకున్నారు. డూన్ స్కూల్లో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీకి నవీన్ మూడేళ్ల జూనియర్. ఒడిశా రాష్ట్రానికి, రాజకీయాలకు దూరంగా ఉన్న నవీన్ .. తండ్రి మరణంతో అమెరికా నుంచి తిరిగివచ్చి 1996లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. -
ఒడిసా (పట్) "నాయక్"
సాక్షి వెబ్ ప్రత్యేకం : సాదాసీదా ఆహార్యం, సాత్వికాహారం, నిరాడంబర జీవనం, రాజీలేని పనితీరు ఒడిషాలో వరుసగా నాలుగు పర్యాయాలు అధికారాన్ని నిలుపుకున్న నవీన్ పట్నాయక్ వ్యవహార శైలి. రాష్ట్రానికి చాలాకాలం దూరంగా ఉండటంతో మాతృభాష ఒడియాపై పట్టులేకున్నా కష్టించి పనిచేయడంపై మమకారమే ఆయనను ప్రజలకు చేరువ చేసింది. ఐదేళ్ల పరిపాలనతోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న నేతలకు నవీన్ పట్నాయక్ నిరంతరాయంగా ఎలా నెగ్గుకొస్తున్నారన్నది ఓ పట్టాన అంతుపట్టదు. అధికారులతో వారి సామర్ధ్యానికి అనుగుణంగా పనిచేయించడమే అభివృద్ధికి బాటలు వేస్తుందని నవీన్ పట్నాయక్ చెబుతుంటారు. కవి, రచయితగా.. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ గత నాలుగు పర్యాయాలుగా బిజూ జనతాదళ్‌ను రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టే దిశగా నడిపించడంలో విజయవంతమై దేశ రాజకీయాల్లోనే అరుదైన ఘనత సాధించారు. కవి, రచయితగానూ పేరొందిన నవీన్ పట్నాయక్ నాలుగు పుస్తకాలను ప్రచురించారు. కుటుంబ సభ్యులు, బాల్యస్నేహితులు పప్పూగా పిలుచుకునే నవీన్ పట్నాయక్ 1946 అక్టోబర్ 16న కటక్‌లో ఒడిషా మాజీ సీఎం బిజూ పట్నాయక్, గ్యాన్ పట్నాయక్ దంపతులకు జన్మించారు. డెహ్రాడూన్‌లో వెల్హాం బాయ్స్ స్కూల్, ది డూన్ స్కూల్లో ఆయన విద్యాభ్యాసం సాగింది. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన కిరోరి మాల్ కలేజ్ నుంచి నవీన్ పట్నాయక్ బీఏ డిగ్రీ పొందారు. పాఠశాల స్ధాయి నుంచే నవీన్ పట్నాయక్ చరిత్ర, ఆయిల్ పెయింటింగ్, అథ్లెటిక్స్‌పై మక్కువ పెంచుకున్నారు. డూన్ స్కూల్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నవీన్ పట్నాయక్ మూడేళ్ల జూనియర్. పట్నాయక్ ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇంటాక్) వ్యవస్ధాపక సభ్యుడిగానూ వ్యవహరిస్తున్నారు. తండ్రి మరణంతో రాజకీయ అరంగేట్రం.. ఒడిషా రాష్ట్రానికి, రాజకీయాలకు చాలాకాలం దూరంగా ఉన్న పట్నాయక్ తండ్రి బిజూ పట్నాయక్ మరణంతో అమెరికా నుంచి తిరిగివచ్చి1997లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత బీజేడీ పేరుతో పార్టీని స్ధాపించి బీజేపీ తోడ్పాటుతో 1998లో ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. ఒడిషా సీఎంగా నవీన్ పట్నాయక్ తనదైన పేదల అనుకూల విధానాలు, అభివృద్ధి రాజకీయాలతో రాష్ట్ర రాజకీయాల్లో కుదురుకున్నారు. ఆ తర్వాత వరుసగా నాలుగు పర్యాయాలు ఒడిషాలో అధికారాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు. తండ్రి బిజూ పట్నాయక్ మరణానంతరం ఒడిషాలోని అస్కా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికలో నవీన్ పట్నాయక్ పోటీచేసి పార్లమెంట్లో అడుగుపెట్టారు. అటల్ బిహారి వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయన కేంద్ర గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఒడిషా సీఎంగా.. 2000 సంవత్సరంలో జరిగిన ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో బీజేడీ అధికారంలోకి రావడంతో నవీన్ పట్నాయక్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఒడిషా సీఎం పగ్గాలు చేపట్టారు. ఇక 2004, 2009, 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒడిషాలో నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజేడీ తిరుగులేని విజయాలు సాధించి అధికారాన్ని నిలుపుకుంది. తండ్రి తరహాలోనే అధికార యంత్రాంగంపై గట్టి పట్టుకలిగిన పట్నాయక్ వారిని అభివృద్ధి పనుల్లో నిరంతరం శ్రమించేలా పర్యవేక్షించడంలో విజయం సాధించారు. పట్నాయక్ తన బాల్య, యవ్వన దశలు ఎక్కువగా ఒడిషాకు దూరంగా గడపడంతో ఒడియా భాష రాయడంలో, పలకడంలో ఆయన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశంలోనే తమ ప్రాంతీయ భాష మాట్లాడటం రాని తొలి సీఎం నవీన్ పట్నాయక్ కావడం గమనార్హం. ఒడియా మాట్లాడటం రాని సీఎంగా ఆయన విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. పట్నాయక్‌కు హిందీ, ఫ్రెంచ్, ఆంగ్ల భాషల్లో మంచి నైపుణ్యం ఉంది. ఇక ర్యాలీలు, బహిరంగ సమావేశాల్లో రోమన్ అల్ఫాబెట్‌లో ఆయన ఒడియా ప్రసంగాలు సాగుతాయి. హాబీలు : పుస్తక పఠనం, సాంస్కృతిక, చారిత్రక, పర్యావరణ కార్యక్రమాలు వీక్షించడం, రచనా వ్యాసంగం ఇష్టమైన ఆహారం : మసాలా కూర్చిన బెండకాయ ఫ్రై, వైట్‌సాస్‌తో ఫ్రైడ్ చికెన్ -మురళి -
‘ఏకకాలంలో ఎన్నికలు సరైనవే’
భువనేశ్వర్ : పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోన్న విషయం తెలిసిందే. ఇదే అంశంపై గత కొంత కాలంగా ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య చర్చలు జరుగుతున్నాయి. జమిలి ఎన్నికలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయవల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ కోరిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన బీజూ జనతాదళ్ అధినేత, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ జమిలి ఎన్నికలకు తన మద్దతు తెలిపారు. దేశంలో పార్లమెంట్, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ మంచి నిర్ణయమని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలనేవి తప్పనిసరని, ప్రజలకు సేవ చేయడానికే తాము ఎన్నికయ్యామని పేర్కొన్నారు. ఏడాది పొడవునా ఎన్నికలు జరుగుతుంటే అభివృద్ధికి ఆటకం కలుగుతోందని, ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే అభివృద్ధిపై దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికలపై చర్చించేందుకు జాలై ఏడున ఢిల్లీ రావాల్సిందిగా సీఎం నవీన్ పట్నాయక్‌ను లా కమిషన్ చైర్మన్ బీఎస్ చౌహాన్ ఆహ్వానించారు. ఒడిషాలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు 2019లో ఎన్నికలు జరుగునున్న విషయం తెలిసిందే. లా కమిషన్ ఆహ్వానం మేరకు బీజేడీ ఎంపీ పింకీ మిశ్రా ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు బీజేడీ వర్గాలు వెల్లడించాయి. -
‘పార్టీ నుంచి శాశ్వతంగా తొలగిపోతున్నా’
భువనేశ్వర్: పార్టీనుంచి శాశ్వతంగా తొలగిపోతున్నట్లు బీజ్ జనతాదళ్ ఎంపీ జే పాండా ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‌కు బావోద్వేగంతో లేఖ రాశారు. సీఎంతో విభేదాల కారణంగా పాండాను జనవరిలోనే పార్టీ నుంచి డిస్మిస్ చేస్తున్నట్లు బీజేడీ ప్రకటించింది. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న పాండా సోమవారం పార్టీ నుంచి శాస్వతంగా తొలగిపోతున్నట్లు నవీన్ పట్నాయక్‌కు లేఖ ద్వారా తెలియజేశారు. తనకు ఇష్టం లేకున్నా బరువైన హృదయంతో్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేవారే ముఖ్యమైన స్థానంలో ఉన్నారని, వారి నుంచి పార్టీని కాపాడాలని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. బీజేపీతో సంబందాలు ఉన్నాయన్న కారణంతో పాండాను పార్టీని నుంచి బహిష్కరించామని బీజేడీ పేర్కొంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా పాండా బీజేపీ మద్దతు తెలిపారని, కనీసం తన నియోజకవర్గంలో కూడా పార్టీ తరుఫున ప్రచారం చేయలేదని బీజేడీ విమర్శిస్తోంది. -
అసెంబ్లీలో చిత్ర విచిత్ర పరిస్థితులు
భువనేశ్వర్ : రాష్ట్ర శాసనసభలో చిత్ర విచిత్ర పరిస్థితులు నెలకొంటున్నాయి. అధికార పక్షం బిజూ జనతా దళ్ ప్రగల్భాలు బట్టబయలవుతున్నాయి. న్యాయసమ్మతమైన శీర్షికలతో ప్రతిపక్షాలు సభలో ప్రస్తావించినా సభా కార్యక్రమాలకు పరోక్షంగా గండి కొట్టిస్తున్నందున ఇటీవల వరుసగా 3 రోజులపాటు అమూల్యమైన సభా కార్యక్రమాలకు నిరవధికంగా గండిపడిన సంగతి తెలిసిందే. మొత్తం మీద ఈ వివాదానికి తెరదించి తదుపరి సభా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగించేందుకు సభలో సభ్యుల గైర్హాజరు మరో ప్రధాన సమస్యగా నిలుస్తోంది. ప్రభుత్వం తప్పిదాలే కారణం రాజ్యాంగబద్ధమైన కార్యాచరణలో ప్రభుత్వం తప్పటడుగు వేసి ప్రతిపక్షాల్ని ప్రేరేపించి సభా కార్యక్రమాలకు గండి కొట్టిస్తున్న విషయాన్ని తాజా సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఏదోలా ప్రతిపక్షాలను బుజ్జగించి సభలో శాంతియుత వాతావరణం పునరుద్ధరించే సమయానికి అధికార పక్షం సభ్యులు సభా కార్యక్రమాలకు డుమ్మా కొడుతున్నారు. దీంతో సభలో కనీస సభ్యుల హాజరు కొరవడుతోంది. బడ్జెట్ సమావేశంలో అత్యంత కీలకమైన బిల్లుల ఆమోదానికి ఈ పరిస్థితులు ప్రతికూలంగా నిలుస్తున్నాయి. ఇటువంటి దయనీయ పరిస్థితి గురువారం ఎదురైంది. లోకాయుక్త నియామకం జాప్యంపట్ల చెలరేగిన వివాదం అఖిల పక్ష సమావేశం తీర్మానం తర్వాత సభా కార్యక్రమాల నిర్వహణకు అనుకూలత ఏర్పడింది. ఈ సమయంలో అధికార పక్షం సభ్యులు సభలో అదృశ్యమయ్యారు. సభా కార్యక్రమాలు ప్రారంభమయ్యే సమయానికి సభలో నామమాత్రంగా 9 మంది సభ్యులు మాత్రమే దర్శనమిచ్చారు. మిగిలిన సభ్యులు అంతా సభా ప్రాంగణంలోకి విచ్చేసి హాజరు కావలసిందిగా స్పీకర్ అభ్యర్థించాల్సిన దయనీయ పరిస్థితులు తాండవించడం విచారకరం. సభా కార్యక్రమాలకు గంటమోగినా సభ్యుల జాడ కనబడకపోవడంతో అయోమయ పరిస్థితి నెలకొంది. గంట మోగిన ఒక నిమిషం తర్వాత సభలో సభ్యుల సంఖ్య మెల్లగా 10కి చేరుకుంది. మరో 2 నిమిషాల తర్వాత సభ్యుల హాజరు క్రమంగా 14 మంది వరకు పుంజుకుంది. సాయంత్రం 6.37 గంటల ప్రాంతంలో బడ్జెట్ వంటి కీలకమైన అంశంపై సభలో చర్చ సాగుతుండగా కోరం కొరత కనిపించడం విచారకరం. ప్రతిపక్షాల పెదవి విరుపు సభ్యుల గైర్హాజరు పట్ల ప్రతిపక్ష కాంగ్రెస్ పెదవి విరిచింది. సభలో బిల్లుల వ్యవహారాన్ని నిరవధికంగా నిర్వహించేందుకు కోరం లేకపోవడం విడ్డూరం. ఇటువంటి దయనీయ పరిస్థితుల నివారణపట్ల స్పీకర్ స్పందించాల్సి ఉందని కాంగ్రెస్ అభ్యర్థి, ఆలీ నియోజక వర్గం సభ్యుడు దేవేంద్ర శర్మ అభ్యర్థించారు. బడ్జెట్ సమావేశాల్లో మంత్రుల గైర్హాజరుపట్ల ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిస్థితులకు నిరసనగా కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి మౌనంగా వాకౌట్ చేశారు. -
'సీఎంపై సంచలన ఆరోపణలు'
భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని కేంద్ర మాజీ మంత్రి బ్రజా కిశోర్ త్రిపాఠి సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికలు, రాజకీయ ప్రయోజనాల కోసం మావోయిస్టులను నవీన్ పట్నాయక్ వాడుకున్నారని ఆరోపించారు. అంతేకాదు తన పార్టీ బీజేడీ అధికారిక బ్యాంకు ఖాతా నుంచి మావోయిస్టులకు రూ. 45 లక్షలు ఇచ్చారని తెలిపారు. అరెస్టైన మావోయిస్టు నాయకుడు సవ్యసాచి పాండా ఖాతాకు ఈ మొత్తం పంపారని వెల్లడించారు. బీజేడీ ఎస్ బీఐ ఎకౌంట్ (10091755246) నుంచి పాండా ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా(203601501728)కు చెక్కు రూపంలో(441630) డబ్బు చెల్లించారని చెప్పారు. బీజేడీ అధ్యక్షుడిగా ఉన్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పేరుతో 2014, ఏప్రిల్ లో ఈ బదిలీ జరిగిందన్నారు. ఒక్కపక్క మావోయిస్టులకు సాయం చేస్తూనే మరోపక్క వారిపై పోరుకు మరిన్ని నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని సీఎం కోరడం తనకు ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. రూ. 45 లక్షలు పంపడానికి ముందురోజు పాండా ఖాతా నుంచి బీజేడీ ఎకౌంట్ లో రూ. లక్ష జమ చేశారని తెలిపారు. బీజేడీ నాయకుడి బ్యాంకు ఖాతా నుంచి ఆర్టీజీఎస్ నుంచి పాండా ఎకౌంట్ కు 2014, జూన్ లో రూ. 5 లక్షలు పంపారని ఆరోపించారు. మావోయిస్టులకు నవీన్ పట్నాయక్ ఆశ్రయమిస్తున్నారనడానికి ఇదే నిదర్శమన్నారు. కిశోర్ త్రిపాఠి ఆరోపణలను బీజేడీ అధికార ప్రతినిధి అమర్ సట్పతి తోసిపుచ్చారు. తన భర్తకు బ్యాంకు ఖాతా లేదని పాండా భార్య మిలి పాండా తెలిపారు. -
ఫిరాయింపుదారులపై అనర్హత వేటు పడాలి
‘సాక్షి’తో బీజేడీ ఎంపీ కలికేశ్ నారాయణ్‌సింగ్ దేవ్ సాక్షి, న్యూఢిల్లీ: ఒక పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు అధికార పార్టీలోకి ఫిరాయించడం దేశంలోని అనైతిక రాజకీయాలకు నిదర్శనమని బిజూ జనతాదళ్(బీజేడీ) ఎంపి కలికేశ్ నారాయణ్‌సింగ్ దేవ్ చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో, ప్రత్యేకించి ఏపీ, తెలంగాణలో కొనసాగుతున్న పార్టీ ఫిరాయింపులపై ఆయన మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. మూడింట రెండొంతుల సభ్యులు ఫిరాయిస్తే తప్ప ఒక పార్టీని వదిలి మరో పార్టీలో చేరడం సాధ్యం కాదని ఫిరాయింపుల నిరోధక చట్టం స్పష్టంగా పేర్కొంటోందని గుర్తుచేశారు. అందువల్ల మూడింట రెండొంతుల పార్టీ సభ్యులు లేని పక్షంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేయాలని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ ఫిరాయింపులపై స్పీకర్ చేసేదే తుది నిర్ణయంగా పరిగణిస్తారని అన్నారు. అయితే, దీనిపై కోర్టులను ఆశ్రయించడానికి మార్గం ఉందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఫిరాయింపుల నిరోధక చట్టం నిబంధనలను ఉల్లంఘించకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. మూడింట రెండొంతుల సభ్యులు లేని పక్షంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఆటోమేటిక్‌గా అనర్హత వేటు వేయాలన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలో సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేసే అధికారాన్ని స్పీకర్ పరిధి నుంచి తప్పించి, ఎన్నికల సంఘం పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదనలో తప్పేమీ లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26కు సవరణ చేయడం ద్వారా అసెంబ్లీ స్థానాల పెంపు అంశం వివాదాస్పద సమస్య అని పేర్కొన్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా రాజ్యాంగ నిబంధనలు, అందుకు సంబంధించిన న్యాయపరమైన పరిమితులను దృష్టిలో ఉంచుకోవాలని నారాయణ్‌సింగ్ దేవ్ సూచించారు. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం అవసరమని చెప్పారు. -
‘పోలవరం’పై ఒడిశా అసెంబ్లీలో బీజేడీ ఆందోళన
ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ 4 జిల్లాల్లో బంద్ భువనేశ్వర్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ముందుకు వెళుతోందని ఆరోపిస్తూ ఒడిశాలో అధికార బిజూ జనతాదళ్(బీజేడీ) సోమవారం రాష్ట్ర శాసనసభలో ఆందోళనకు దిగింది. సభ ప్రారంభమైన వెంటనే అధికార పార్టీ ఎమ్మెల్యేలు పోలవరం ప్రాజెక్టుకు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. తీవ్ర గందరగోళం నేపథ్యంలో స్పీకర్ సభను మధ్యాహ్నం 3 గంటల వరకూ వాయిదా వేశారు. అయితే.. అధికార పార్టీయే స్వయంగా సభా కార్యక్రమాలను అడ్డుకోవటాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ ఖండించింది. అసెంబ్లీలో తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరగకుండా అడ్డుకోవటానికే అధికార బీజేడీ పోలవరం ప్రాజెక్టు పేరుతో సభను అడ్డుకుందని విపక్ష నేత నరసింగ్మిశ్రా ధ్వజమెత్తారు. మరోవైపు.. పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ బీజేడీ సోమవారం కోరాపుట్, మల్కనగిరి, రాయగడ, నబరంగ్‌పూర్ జిల్లాల్లో 12 గంటల బంద్ నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు ధర్నాలు చేపట్టారు. -
బీజేడీ శాసనసభాపక్ష నేతగా నవీన్ పట్నాయక్
భువనేశ్వర్: బిజు జనతాదళ్(బీజేడీ) శాసనసభాపక్ష నేతగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎన్నికయ్యారు. కొత్తగా శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేలు ఆయనను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వరుసగా నాలుగోసారి ఆయన సీఎం పీఠాన్ని అధిష్టించబోతున్నారు. లోక్‌సభ ఎన్నికలతోపాటు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సారథ్యంలోని అధికార బీజేడీ వరుసగా నాలుగోసారి అధికార పీఠాన్ని దక్కించుకొని విజయదుందుభి మోగించింది. మొత్తం 147 సీట్లకుగానూ మూడింట రెండొంతుల మెజారిటీతో 115 చోట్ల గెలుపొందింది. కాంగ్రెస్ 18, బీజేపీ 11, సమతా క్రాంతి దళ్ 1 సీటు గెలుచుకోగా రెండు చోట్ల స్వతంత్రులు గెలిచారు. -
మద్దతుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు
భువనేశ్వర్: కేంద్రంలో ఏ కూటమికి, ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ అన్నారు. కూటమి ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి ఆలోచనా లేదని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఎన్డీఏకు షరతులతో కూడిన మద్దతిస్తే ఎలాంటి సమస్యా ఉండబోదని బీజేడీ సీనియర్ నేత ప్రవత్ త్రిపాఠి వ్యాఖ్యానించిన మరుసటతో రోజే నవీన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడికావడంతో బీజేడీ అటువైపు చూస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా ఇలాంటి సాంకేతాలే ఇచ్చారు. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఎదురు చూడాలంటూ జయలలిత పలు విశ్లేషణలకు ఊతమిచ్చారు. -
మహిళపై ఎమ్మెల్యే అత్యాచారం!
ఓ మహిళపై అధికార పార్టీ ఎమ్మెల్యే అత్యాచారం జరిపిన సంఘటన ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా పోలీసుల కథనం ప్రకారం... ఉదాల పట్టణంలోని స్థానిక మహిళ తనకు ఉద్యోగం కావాలంటూ బీజు జనతాదళ్ ఎమ్మెల్యే శ్రీనాథ్ సోరెన్‌ను అశ్రయించింది. అందులోభాగంగా ముందుగా రూ. లక్ష నగదు ఆయనకు అందజేసింది. అయితే ఉద్యోగం కోసం ఎమ్మెల్యే వద్దకు ఎన్నిసార్లు వెళ్లిన మరోసారి రమ్మని ఆయన చెప్పడంతో సదరు మహిళ విసిగిపోయింది. దాంతో తాను ఇచ్చిన నగదు మొత్తాన్ని తిరిగి ఇచ్చి వేయాలని ఎమ్మెల్యేను మహిళ డిమాండ్ చేసింది. దాంతో జనవరి 3వ తేదీన తప్పక ఇస్తాని, తాను చెప్పిన చోటకు రమ్మని ఆమెను నమ్మబలికాడు. దాంతో అమాయకరాలైన మహిళ శ్రీనాథ్ సోరెన్ మాటలను నమ్మింది. జనవరి 3వ ఎమ్మెల్యే చెప్పిన చోటుకు వెళ్లింది. ఎమ్మెల్యేను డబ్బును అడగగా ఎమ్మెల్యేతోపాటు అతడి సహయకుడు ఇద్దరు కలసి ఆ మహిళపై అత్యాచారం జరిపారు. దాంతో మహిళ సమీపంలోని పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసిన వారు స్పందించకపోవడంతో ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది. దీంతో సదరు ఎమ్మెల్యే, అతడి సహయకుడిని అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. దాంతో వారిద్దరిపై సోమవారం సాయంత్రం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. నివేదిక రావలసి ఉందని తెలిపారు. అయితే తనపై మహిళ అత్యాచార ఆరోపణలు ప్రతిపక్షల కుట్ర అని ఎమ్మెల్యే శ్రీనాథ్ సోరెన్ ఆరోపించారు. తన వ్యక్తిగత ప్రతిష్టను భగ్నం చేసేందుకు విపక్షాల అడిన ఆటలో తాను పావుని చేశారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తాం:బిజూ జనతాదళ్
ఢిల్లీ:యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి తమ మద్దతు ఉంటుందని బిజూ జనతాదళ్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసానికి తప్పకుండా మద్దతు తెలుపుతామని ఆ పార్టీ నేత, ఎంపీ జయపాండ వెల్లడించారు. లోక్‌సభలో బిజూ జనతాదళ్‌కు 14 మంది ఎంపీల ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన అవిశ్వాసం-యూపీఏ సర్కారు అంశంపై మీడియాతో మాట్లాడారు.. యూపీఏ విధానాలపై తాము మొదటి నుంచి వ్యతిరేకమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి మాత్రం జయ పాండా నోరు మెదపలేదు. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన ముసాయిదా బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించటంతో.. ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు.. సొంత పార్టీ నేతృత్వంలోని యూపీఏ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ లోక్‌సభ స్పీకర్‌కు నోటీసు అందించారు. కాంగ్రెస్ ఎంపీలు రాయపాటి సాంబశివరావు, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్‌కుమార్, ఎ.సాయిప్రతాప్, లగడపాటి రాజగోపాల్, జి.వి.హర్షకుమార్ సోమవారం ఉదయం ఈమేరకు స్పీకర్ మీరాకుమార్‌కు నోటీసు ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా యూపీఏపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధపడింది.