
సాక్షి, భువనేశ్వర్: కరోనా వైరస్‌తో బిజు జనతా దళ్ (బీజేడీ) ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రదీప్ మహరతి ఆదివారం మృతిచెందారు. సెప్టెంబర్ 14న ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండడంతో వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. 64 ఏళ్ల ప్రదీప్ మహరతి ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో కీలక మంత్రి పదవులు చేపట్టారు.
1985లో జనతా పార్టీ తరపున పిప్లీ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఒడిశా శాసనసభకు ఎన్నికయ్యారు. మొత్తం ఏడు సార్లు ఆ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించగా అందులో ఐదు సార్లు జీజేడీ తరుపున ( 2000-2019) కావడం విశేషం. వ్యవసాయ, పంచాయతీరాజ్, త్రాగునీటి సరఫరా, మత్స్య శాఖల మంత్రి పదవుల్లో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. వ్యవసాయ రంగానికి ఆయన చేసిన కృషికి గాను 2016లో 'గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్‌షిప్' అవార్డు, 2014-2015లో 'కృషి కర్మన్' అవార్డు దక్కించుకున్నారు.