పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ముందుకు వెళుతోందని ఆరోపిస్తూ ఒడిశాలో అధికార బిజూ జనతాదళ్(బీజేడీ) సోమవారం రాష్ట్ర శాసనసభలో ఆందోళనకు దిగింది.
ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ 4 జిల్లాల్లో బంద్
భువనేశ్వర్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ముందుకు వెళుతోందని ఆరోపిస్తూ ఒడిశాలో అధికార బిజూ జనతాదళ్(బీజేడీ) సోమవారం రాష్ట్ర శాసనసభలో ఆందోళనకు దిగింది. సభ ప్రారంభమైన వెంటనే అధికార పార్టీ ఎమ్మెల్యేలు పోలవరం ప్రాజెక్టుకు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. తీవ్ర గందరగోళం నేపథ్యంలో స్పీకర్ సభను మధ్యాహ్నం 3 గంటల వరకూ వాయిదా వేశారు.
అయితే.. అధికార పార్టీయే స్వయంగా సభా కార్యక్రమాలను అడ్డుకోవటాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ ఖండించింది. అసెంబ్లీలో తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరగకుండా అడ్డుకోవటానికే అధికార బీజేడీ పోలవరం ప్రాజెక్టు పేరుతో సభను అడ్డుకుందని విపక్ష నేత నరసింగ్‌మిశ్రా ధ్వజమెత్తారు. మరోవైపు.. పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ బీజేడీ సోమవారం కోరాపుట్, మల్కనగిరి, రాయగడ, నబరంగ్‌పూర్ జిల్లాల్లో 12 గంటల బంద్ నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు ధర్నాలు చేపట్టారు.