
అసెంబ్లీలో ఖాళీగా కుర్చీలు
భువనేశ్వర్ : రాష్ట్ర శాసనసభలో చిత్ర విచిత్ర పరిస్థితులు నెలకొంటున్నాయి. అధికార పక్షం బిజూ జనతా దళ్ ప్రగల్భాలు బట్టబయలవుతున్నాయి. న్యాయసమ్మతమైన శీర్షికలతో ప్రతిపక్షాలు సభలో ప్రస్తావించినా సభా కార్యక్రమాలకు పరోక్షంగా గండి కొట్టిస్తున్నందున ఇటీవల వరుసగా 3 రోజులపాటు అమూల్యమైన సభా కార్యక్రమాలకు నిరవధికంగా గండిపడిన సంగతి తెలిసిందే. మొత్తం మీద ఈ వివాదానికి తెరదించి తదుపరి సభా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగించేందుకు సభలో సభ్యుల గైర్హాజరు మరో ప్రధాన సమస్యగా నిలుస్తోంది.
ప్రభుత్వం తప్పిదాలే కారణం
రాజ్యాంగబద్ధమైన కార్యాచరణలో ప్రభుత్వం తప్పటడుగు వేసి ప్రతిపక్షాల్ని ప్రేరేపించి సభా కార్యక్రమాలకు గండి కొట్టిస్తున్న విషయాన్ని తాజా సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఏదోలా ప్రతిపక్షాలను బుజ్జగించి సభలో శాంతియుత వాతావరణం పునరుద్ధరించే సమయానికి అధికార పక్షం సభ్యులు సభా కార్యక్రమాలకు డుమ్మా కొడుతున్నారు. దీంతో సభలో కనీస సభ్యుల హాజరు కొరవడుతోంది. బడ్జెట్ సమావేశంలో అత్యంత కీలకమైన బిల్లుల ఆమోదానికి ఈ పరిస్థితులు ప్రతికూలంగా నిలుస్తున్నాయి.
ఇటువంటి దయనీయ పరిస్థితి గురువారం ఎదురైంది. లోకాయుక్త నియామకం జాప్యంపట్ల చెలరేగిన వివాదం అఖిల పక్ష సమావేశం తీర్మానం తర్వాత సభా కార్యక్రమాల నిర్వహణకు అనుకూలత ఏర్పడింది. ఈ సమయంలో అధికార పక్షం సభ్యులు సభలో అదృశ్యమయ్యారు. సభా కార్యక్రమాలు ప్రారంభమయ్యే సమయానికి సభలో నామమాత్రంగా 9 మంది సభ్యులు మాత్రమే దర్శనమిచ్చారు. మిగిలిన సభ్యులు అంతా సభా ప్రాంగణంలోకి విచ్చేసి హాజరు కావలసిందిగా స్పీకర్ అభ్యర్థించాల్సిన దయనీయ పరిస్థితులు తాండవించడం విచారకరం.
సభా కార్యక్రమాలకు గంటమోగినా సభ్యుల జాడ కనబడకపోవడంతో అయోమయ పరిస్థితి నెలకొంది. గంట మోగిన ఒక నిమిషం తర్వాత సభలో సభ్యుల సంఖ్య మెల్లగా 10కి చేరుకుంది. మరో 2 నిమిషాల తర్వాత సభ్యుల హాజరు క్రమంగా 14 మంది వరకు పుంజుకుంది. సాయంత్రం 6.37 గంటల ప్రాంతంలో బడ్జెట్ వంటి కీలకమైన అంశంపై సభలో చర్చ సాగుతుండగా కోరం కొరత కనిపించడం విచారకరం.
ప్రతిపక్షాల పెదవి విరుపు
సభ్యుల గైర్హాజరు పట్ల ప్రతిపక్ష కాంగ్రెస్ పెదవి విరిచింది. సభలో బిల్లుల వ్యవహారాన్ని నిరవధికంగా నిర్వహించేందుకు కోరం లేకపోవడం విడ్డూరం. ఇటువంటి దయనీయ పరిస్థితుల నివారణపట్ల స్పీకర్ స్పందించాల్సి ఉందని కాంగ్రెస్ అభ్యర్థి, ఆలీ నియోజక వర్గం సభ్యుడు దేవేంద్ర శర్మ అభ్యర్థించారు. బడ్జెట్ సమావేశాల్లో మంత్రుల గైర్హాజరుపట్ల ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిస్థితులకు నిరసనగా కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి మౌనంగా వాకౌట్ చేశారు.