
నవీన్ పట్నాయక్ ( ఫైల్ ఫోటో)
భువనేశ్వర్ : పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోన్న విషయం తెలిసిందే. ఇదే అంశంపై గత కొంత కాలంగా ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య చర్చలు జరుగుతున్నాయి. జమిలి ఎన్నికలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయవల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ కోరిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన బీజూ జనతాదళ్ అధినేత, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ జమిలి ఎన్నికలకు తన మద్దతు తెలిపారు. దేశంలో పార్లమెంట్, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ మంచి నిర్ణయమని తెలిపారు.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలనేవి తప్పనిసరని, ప్రజలకు సేవ చేయడానికే తాము ఎన్నికయ్యామని పేర్కొన్నారు. ఏడాది పొడవునా ఎన్నికలు జరుగుతుంటే అభివృద్ధికి ఆటకం కలుగుతోందని, ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే అభివృద్ధిపై దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికలపై చర్చించేందుకు జాలై ఏడున ఢిల్లీ రావాల్సిందిగా సీఎం నవీన్ పట్నాయక్‌ను లా కమిషన్ చైర్మన్ బీఎస్ చౌహాన్ ఆహ్వానించారు. ఒడిషాలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు 2019లో ఎన్నికలు జరుగునున్న విషయం తెలిసిందే. లా కమిషన్ ఆహ్వానం మేరకు బీజేడీ ఎంపీ పింకీ మిశ్రా ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు బీజేడీ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment