భువనేశ్వర్: కేంద్రంలో ఏ కూటమికి, ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ అన్నారు. కూటమి ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి ఆలోచనా లేదని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఎన్డీఏకు షరతులతో కూడిన మద్దతిస్తే ఎలాంటి సమస్యా ఉండబోదని బీజేడీ సీనియర్ నేత ప్రవత్ త్రిపాఠి వ్యాఖ్యానించిన మరుసటతో రోజే నవీన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడికావడంతో బీజేడీ అటువైపు చూస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా ఇలాంటి సాంకేతాలే ఇచ్చారు. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఎదురు చూడాలంటూ జయలలిత పలు విశ్లేషణలకు ఊతమిచ్చారు.