'సీఎంపై సంచలన ఆరోపణలు'
భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని కేంద్ర మాజీ మంత్రి బ్రజా కిశోర్ త్రిపాఠి సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికలు, రాజకీయ ప్రయోజనాల కోసం మావోయిస్టులను నవీన్ పట్నాయక్ వాడుకున్నారని ఆరోపించారు. అంతేకాదు తన పార్టీ బీజేడీ అధికారిక బ్యాంకు ఖాతా నుంచి మావోయిస్టులకు రూ. 45 లక్షలు ఇచ్చారని తెలిపారు. అరెస్టైన మావోయిస్టు నాయకుడు సవ్యసాచి పాండా ఖాతాకు ఈ మొత్తం పంపారని వెల్లడించారు.
బీజేడీ ఎస్ బీఐ ఎకౌంట్ (10091755246) నుంచి పాండా ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా(203601501728)కు చెక్కు రూపంలో(441630) డబ్బు చెల్లించారని చెప్పారు. బీజేడీ అధ్యక్షుడిగా ఉన్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పేరుతో 2014, ఏప్రిల్ లో ఈ బదిలీ జరిగిందన్నారు. ఒక్కపక్క మావోయిస్టులకు సాయం చేస్తూనే మరోపక్క వారిపై పోరుకు మరిన్ని నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని సీఎం కోరడం తనకు ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. రూ. 45 లక్షలు పంపడానికి ముందురోజు పాండా ఖాతా నుంచి బీజేడీ ఎకౌంట్ లో రూ. లక్ష జమ చేశారని తెలిపారు.
బీజేడీ నాయకుడి బ్యాంకు ఖాతా నుంచి ఆర్టీజీఎస్ నుంచి పాండా ఎకౌంట్ కు 2014, జూన్ లో రూ. 5 లక్షలు పంపారని ఆరోపించారు. మావోయిస్టులకు నవీన్ పట్నాయక్ ఆశ్రయమిస్తున్నారనడానికి ఇదే నిదర్శమన్నారు. కిశోర్ త్రిపాఠి ఆరోపణలను బీజేడీ అధికార ప్రతినిధి అమర్ సట్పతి తోసిపుచ్చారు. తన భర్తకు బ్యాంకు ఖాతా లేదని పాండా భార్య మిలి పాండా తెలిపారు.