Sabyasachi Panda
-
'సీఎంపై సంచలన ఆరోపణలు'
భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని కేంద్ర మాజీ మంత్రి బ్రజా కిశోర్ త్రిపాఠి సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికలు, రాజకీయ ప్రయోజనాల కోసం మావోయిస్టులను నవీన్ పట్నాయక్ వాడుకున్నారని ఆరోపించారు. అంతేకాదు తన పార్టీ బీజేడీ అధికారిక బ్యాంకు ఖాతా నుంచి మావోయిస్టులకు రూ. 45 లక్షలు ఇచ్చారని తెలిపారు. అరెస్టైన మావోయిస్టు నాయకుడు సవ్యసాచి పాండా ఖాతాకు ఈ మొత్తం పంపారని వెల్లడించారు. బీజేడీ ఎస్ బీఐ ఎకౌంట్ (10091755246) నుంచి పాండా ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా(203601501728)కు చెక్కు రూపంలో(441630) డబ్బు చెల్లించారని చెప్పారు. బీజేడీ అధ్యక్షుడిగా ఉన్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పేరుతో 2014, ఏప్రిల్ లో ఈ బదిలీ జరిగిందన్నారు. ఒక్కపక్క మావోయిస్టులకు సాయం చేస్తూనే మరోపక్క వారిపై పోరుకు మరిన్ని నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని సీఎం కోరడం తనకు ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. రూ. 45 లక్షలు పంపడానికి ముందురోజు పాండా ఖాతా నుంచి బీజేడీ ఎకౌంట్ లో రూ. లక్ష జమ చేశారని తెలిపారు. బీజేడీ నాయకుడి బ్యాంకు ఖాతా నుంచి ఆర్టీజీఎస్ నుంచి పాండా ఎకౌంట్ కు 2014, జూన్ లో రూ. 5 లక్షలు పంపారని ఆరోపించారు. మావోయిస్టులకు నవీన్ పట్నాయక్ ఆశ్రయమిస్తున్నారనడానికి ఇదే నిదర్శమన్నారు. కిశోర్ త్రిపాఠి ఆరోపణలను బీజేడీ అధికార ప్రతినిధి అమర్ సట్పతి తోసిపుచ్చారు. తన భర్తకు బ్యాంకు ఖాతా లేదని పాండా భార్య మిలి పాండా తెలిపారు. -
మావోయిస్టు నేత సవ్యసాచి పండాపై కేసు కొట్టివేత
ప్రముఖ మావోయిస్టు నాయకుడు సవ్యసాచి పండాపై పోలీసులు పెట్టిన కేసును ఒడిషాలోని ఓ స్థానిక కోర్టు కొట్టేసింది. ఈ కేసులో పండాను నిర్దోషిగా విడుదల చేసింది. నాలుగేళ్ల క్రితం గోషానినుగావ్ పోలీసు స్టేషన్లో ఆయుధాల చట్టం కింద పండాపై కేసు నమోదైంది. అయితే, పండాపై ఈ కేసులో ఆరోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని సబ్ డివిజనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ప్రదీప్ కుమార్ బెహరా కేసును కొట్టేశారు. ఒడిషాలోని వివిధ కోర్టుల్లో పండాపై వందకు పైగా కేసులు ఉండగా.. ఈ ఒక్క కేసులోనే ఇప్పటివరకు ఆయనకు సానుకూలంగా తీర్పు వచ్చిందని పండా తరఫు న్యాయవాది దీపక్ పట్నాయక్ తెలిపారు. ఇదే కేసులో మరో ఇద్దరిని కూడా నిర్దోషులుగా విడిచిపెట్టిన కోర్టు.. మరో వ్యక్తి మాత్రం కోర్టుకు హాజరు కాకపోవడంతో అతడిపై నాన్ బెయిలబుల్ వారంటు జారీచేసింది. -
'పండా అరెస్ట్ పెద్ద నాటకం'
భువనేశ్వర్: మావోయిస్టు అగ్రనేత సవ్యసాచి పండా అరెస్ట్ పెద్ద నాటకమని నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) ప్రకటించింది. ఒడిశా ప్రభుత్వం ఆడుతున్న నాటకంలో పండా అరెస్ట్ ఓ భాగమని ఆ పార్టీ అభివర్ణించింది. మావోయిస్టులపై తమ ప్రభుత్వం పోరాడుతుందని చెప్పుకునేందుకు ఒడిశా ప్రభుత్వం ఆ ప్రకటన చేసిందని విమర్శించింది. ఆంధ్ర - ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అజయ్ ఈ మేరకు ఓ లేఖను బుధవారం ఇక్కడ విడుదల చేశారు. పార్టీ నుంచి పండాను రెండేళ్ల క్రితమే బహిష్కరించినట్లు తెలిపారు. మావోయిస్టుల సమాచారాన్ని పోలీసులు, ప్రభుత్వానికి చేరవేస్తున్నారనే అభియోగాలు వెల్లువెత్తిన నేపథ్యంలో పండాను బహిష్కరించిన సంగతిని అజయ్ ఈ సందర్భంగా లేఖలో వివరించారు. ఈ నెల 18వ తేదీన బరంపురం పట్టణంలో పండాను అరెస్ట్ చేసినట్లు ఒడిశా పోలీసులు ప్రకటించారు. అనంతరం ఆయన్ని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు పండాకు 10 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. పండాపై నయాగఢ్, ఆర్ ఉదయ్గిరిలో ఆయుధాలు లూటీ, స్వామి లక్ష్మణానంద సరస్వతి, ఇటాలియన్ జాతీయులు కిడ్నాప్ కేసులతోపాటు పలు కేసులలో పండా నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. పండాను పోలీసులు అరెస్ట్ చేసిన ప్రకటనపై మావోయిస్టు పార్టీపై విధంగా స్పందించింది. -
మావోయిస్టు అగ్రనేత పాండా అరెస్టు
-
పండాకు ఎదురుదెబ్బ
పర్లాకిమిడి(ఒడిశా), న్యూస్‌లైన్: ఒడిశా మావోబడి పార్టీ (ఓఎంపీ) వ్యవస్థాపకుడు, మావోయిస్టు నేత సవ్యసాచి పండాకుమరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన అనుచరులైన ముగ్గురు మహిళా మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేయడంతోపాటు భారీ డంప్‌ను, పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి డీఐజీ (దక్షిణ రేంజ్) అమితాబ్ ఠాగూర్ అందించిన వివరాల ప్రకారం...గజపతి జిల్లా మోహనా పోలీసుస్టేషన్ పరిధిలోని ముఖి అటవీ ప్రాంతంలో ఓఎంపీ క్యాంపు నడుస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు గురువారం రాత్రి కూంబింగ్ చేపట్టి ముగ్గురు మహిళా మావోయిస్టులను అరెస్ట్ చేశారు. వారిని నికిత మజ్జి, దండింగి అనిత, సుశాంతి మజ్జిగా గుర్తించారు. వారు సవ్యసాచి పండా ముఖ్య అనుచరులని నిర్ధారించారు. నికితపై రూ.3 లక్షలు, మిగతా ఇద్దరిపై రూ.50 వేల చొప్పున గతంలోనే ప్రభుత్వం రివార్డులు ప్రకటించింది. వారిపై రాష్ట్రంలో 40కి పైగా కేసులున్నాయని డీఐజీ తెలిపారు. విచారణలో వారిచ్చిన సమాచారం మేరకు ఒక ఏకే-47 రైఫిల్, నాలుగు ఎస్ఎల్ఆర్లు, రెండు ఇన్సాస్ రైఫిళ్లు, ఒక 9 ఎంఎం పిస్టల్, 354 రౌండ్ల తూటాలు, 13 మ్యాగజీన్లు, ఒక టిఫిన్ బాక్సు బాంబు, సెలైన్సర్ అమర్చిన జనరేటర్, 13 సెల్ఫోన్లు, రెండు కంప్యూటర్ ప్రింటర్లు, ఒక కీబోర్డుతోపాటు రూ. 10.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. మహిళా మావోయిస్టులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఇటీవల గంజాం సరిహద్దుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో పండా కుడి తొడలోకి బుల్లెట్ దిగినట్టు తెలుస్తోందని డీఐజీ తెలిపారు. ప్రస్తుతం ఆయనతో ఇద్దరు, ముగ్గురు సన్నిహితులు మాత్రమే ఉన్నారని వివరించారు.