గ్వాలియర్ మహారాజు | Jyotiraditya Scindia Profile of A Young Politician | Sakshi
Sakshi News home page

జ్యోతిరాదిత్య మాధవరావు సింధియా

Published Tue, Mar 12 2019 6:33 PM | Last Updated on Fri, Mar 15 2019 8:48 PM

Jyotiraditya Scindia Profile of A Young Politician - Sakshi

సాక్షి వెబ్ ప్రత్యేకం : యువరాజుగా రాజభోగాలు అనుభవించాల్సిన వాడు రాజభవంతులు, పట్టుపరుపులు వదిలి ప్రజల కోసం ఎర్రటి ఎండలో తిరిగాడు. వివాదాలు, విమర్శలు, ఎదురు దాడులతో సహావాసం చేశాడు. తండ్రి మరణంతో అనుకోకుండా రాజకీయాల్లోకి అడుగుపెట్టినా తను మాత్రం అనుకున్నది చేసుకుంటూపోయాడు. తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్నాడు. ఆనతి కాలంలో ముఖ్యమంత్రి పదవికి అర్హుడనిపించకున్నాడు. చేతివరకు వచ్చిన సీఎం పదవి నోటికందకపోయినా బాధపడకుండా తనపనితాను చేసుకుపోతున్నాడు రాసబిడ్డ జ్యోతిరాదిత్య సింధియా.

వ్యక్తిగత జీవితం
జ్యోతిరాదిత్య సింధియా గ్వాలియర్‌ మహారాజు జీవాజీరావ్‌ సింధియా మనవడు. 1జనవరి 1971లో మాధవ్‌రావ్‌ సింధియా, మాధవి రాజే సింధియా దంపతులకు ముంబై నగరంలో జన్మించారు. ముంబైనగరంలోని కాంపియన్‌ స్కూల్‌, డెహ్రడూన్‌లోని డూన్‌ స్కూల్‌లలో పదవతరగతి వరకు చదువుకున్నారు. హార్వర్డ్‌ యూనివర్శిటీ నుంచి ఎకనమిక్స్‌లో డిగ్రీ పట్టాపొందారు. స్టాన్‌ఫర్డ్‌ గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ఎంబీఏ చేశారు. 1994లో మరాఠా గైక్వాడ్‌ రాజవంశానికి చెందిన ప్రియదర్శినీ రాజేను వివాహమాడారు. వీరికి ఒక కుమారుడు మహానార్యమన్‌, కుమార్తె ఉన్నారు. 

రాజకీయ జీవితం 
తండ్రి మరణంతో రాజకీయాలలోకి ప్రవేశించారు జ్యోతిరాదిత్య సింధియా. మధ్యప్రదేశ్‌లోని గుణ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న  మాధవ్‌రావ్‌ విమాన ప్రమాదంలో మరణించగా 2001 డిసెంబర్‌ 18న కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.  2002లో తండ్రి మరణంతో ఖాళీ పడ్డ స్థానంలో బై ఎలక్షన్‌లో  గుణ ఎంపీగా గెలుపొందారు. దేశంలోనే అత్యంత ధనవంతులైన మంత్రులలో ఈయన కూడా ఒకరు. 2008లో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి కమ్యూనికేషన్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిగా సేవలందించారు. 2009లో స్టేట్‌ ఫర్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ శాఖ కేంద్ర మంత్రిగా పనిచేశారు.  2013 మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడిగా భాద్యతలు చేపట్టారు. 2018 ఎన్నికల తర్వాత సీఎంగా జ్యోతిరాధిత్య సింధియా, కమల్‌నాథ్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే సింధియా అభ్యర్థిత్వాన్ని సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ వ్యతిరేకించటంతో ముఖ్యమంత్రి పదవి చేజారింది. 

వివాదాలు 
తండ్రి మాధవ్‌రావ్‌ సింధియాకు చెందిన 20వేల కోట్ల అస్తి తనకే చెందాలని జ్యోతిరాదిత్య సింధియా కోర్టులో కేసువేశారు. అయితే దీన్ని సవాల్‌ చేస్తూ జ్యోతిరాదిత్య మేనత్తలు కోర్టులో కేసు వేశారు.  దళిత నేతకు అవమానం జరిగేలా ప్రవర్తించారని ఆరోపిస్తూ బీజేపీ నేత నంద కుమార్‌ సింగ్‌ చౌహాన్‌ జ్యోతిరాదిత్య సింధియాపై కేసు పెట్టారు. 

రాజకీయాల రాజవంశం
సింధియా కుటుంబం దశాబ్దాలుగా మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవరావు సింధియా మొదట జన్‌ సంఘ్‌ నుంచి పోటీ చేసినప్పటికీ తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా మారారు. కాగా అదే కుటుంబానికి చెందిన బీజేపీ వ్యవస్థాపక సభ్యురాలు విజయ రాజే సింధియా, ఆమె కుమార్తెలు వసుంధరా రాజే(రాజస్తాన్‌ మాజీ సీఎం), యశోదర రాజే(మధ్యప్రదేశ్‌ ఎంపీ) బీజేపీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే సిద్ధాంతాల పరంగా విభేదాలు ఉన్నప్పటికీ సింధియాలు ఎప్పుడూ ఒకరిపై ఒకరు పోటీకి నిలబడలేదు.  

గ్వాలియర్‌ సంస్థానాధీశుల వారసుడు జ్యోతిరాదిత్య సింధియా. ఆయన నానమ్మ రాజమాత విజయరాజే సింధియా జనసంఘ్‌ వ్యవస్థాపకుల్లో ఒకరు. 1971 ఎన్నికల్లో జనసంఘ్‌ తరఫున విజయరాజేతోపాటు మాధవ్‌రావు సింధియా కూడా పోటీ చేసి, గెలుపొందారు. అప్పట్లో ఇందిర ప్రభంజనాన్ని తట్టుకుని గెలిచిన అతికొద్ది మందిలో వీరు కూడా ఉన్నారు. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో విజయరాజేను కూడా ప్రభుత్వం జైలుపాలు చేసింది. అయితే, మాధవ్‌రావు సింధియా 1980లో కాంగ్రెస్‌ పార్టీలో చేరగా ఆయన తోబుట్టువులు వసుంధరా రాజే, యశోధరా రాజే బీజేపీలో చేరారు.

ఇష్టాఇష్టాలు
జ్యోతిరాదిత్య సింధియాకు క్రికేట్‌, స్విమ్మింగ్‌, రీడింగ్‌ అంటే చాలా ఇష్టం.
- బండారు వెంకటేశ్వర్లు

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/3

2
2/3

3
3/3

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement