
సాక్షి వెబ్ ప్రత్యేకం : ఎవరికీ తలవంచని ధైర్యం ఆయనది. కష్టాలెన్ని ఎదురొచ్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపన. నమ్మిన సిద్ధాంతం, విలువల కోసం దృఢంగా నిలబడే వ్యక్తిత్వం. యోధుడైన తండ్రిని పోగొట్టుకున్నా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం. రాజీపడి ఎక్కే అందలాల కన్నా.. పోరాటాల ద్వారానే విజయ లక్ష్యాన్ని ఛేదించాలనే మనస్థత్వం. తండ్రికి తగ్గ తనయుడు. ఓదార్పు యాత్ర అయినా.. పాదయాత్ర అయినా ప్రజల కోసం ఏందాకైనా ముందుకు సాగే ధీరత్వం. ఆయనే పులివెందుల బిడ్డ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. దాపరికాలు, అడ్డదారులు ఆయనకు ఇష్టముండదు. తెరవెనుక రాజకీయాలంటే ఆయనకు అసహ్యం. చేసేదే చెప్పాలి. చెప్పేది కచ్చితంగా చేయాలి అన్నదే ఆయన సిద్ధాంతం. రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందని ఎవరైనా చెప్పినా 'కాని' పని చేయడానికి అసలు ఒప్పుకోరు. ఆ కారణంగా మొండివాడని దగ్గరివాళ్లే పెదవి విరిచినా పెద్దగా పట్టించుకోడు. నమ్మినవారి కోసం నష్టాన్ని కష్టాన్నీ భరిస్తాడే కాని అవసరానికి రాజకీయాలు చేయడం అబ్బలేదు. ఆయనకు ప్రజలుంటే చాలు..! తిండీ నిద్రా ఎవీ గుర్తుకురావు.
రాజకీయ జీవితం
2009 లో 1.78 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో కడప ఎంపీగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జగన్‌కు తండ్రి అకాల మరణంతో ఊహించని షాక్ తగిలింది. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో ఆయన 2010 నవంబరు 29న కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి కడప ఎంపీ, పులివెందుల ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేశారు. అనంతరం 2011 మార్చి 12న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఆ తరువాత ఈ రెండు స్థానాలకూ జరిగిన ఉప ఎన్నికల్లో ఎంపీగా జగన్ కనీవినీ ఎరుగని రీతిలో 5.45 లక్షల ఓట్ల పైచిలుకు మెజారిటీతో, విజయమ్మ పులివెందుల నుంచి 75 వేల ఓట్ల భారీ ఆధిక్యతతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హాట్ ఫేవరేట్‌గా బరిలో దిగింది. కానీ చంద్రబాబు.. నరేంద్రమోదీ, పవన్‌కల్యాణ్ సహకారంతో కేవలం 1.6 శాతం ఓట్లతో గట్టెక్కారు. ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ పులివెందుల నియోజకవర్గం నుంచి 75,243 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇక 175 స్థానాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 65 గెలిచి ఏకైక ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. 2009 లోనే ఎంపీగా గెలిచినప్పటికీ తండ్రి మరణం తరువాతే వైఎస్ జగన్ రాజకీయంగా క్రియాశీలమయ్యారు.
తండ్రిబాటలో..
ప్రతిపక్ష నేత హోదాలో ప్రజా సమస్యలను తిరుగులేని పోరాటం చేశారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా అనే అంశం ఈ రోజు సజీవంగా ఉందంటే అది ఆయన చలువే. ప్రజాసంకల్పయాత్ర పేరిట ఆయన సాగించిన సుదీర్ఘ పాదయాత్ర దేశ రాజకీయాల్లోనే ఓ చరిత్ర. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్యంగా 2009, సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జగన్‌ను బాగా కలచివేసింది. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ఎంతోమంది అభిమానులు హఠాన్మరణానికి గురికావడం ఆయనకు మరింత దుఃఖాన్ని కలిగించింది. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక మరణించిన ప్రతీవ్యక్తి ఇంటికి వస్తానని.. వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తానని కర్నూలు జిల్లా నల్లకాలువ వద్ద జరిగిన సభలో ఇచ్చిన మాట ఆయన జీవితాన్నే మార్చివేసింది. ఇచ్చిన మాట కాదని రాజీ పడి ఉంటే... అసలు రాష్ట్ర రాజకీయాలు ఇలా ఉండేవే కాదు. జగన్ ఎన్నో పదవుల్లో కొనసాగేవారు. ఆ మాటపై నిలబడటంలో ఆయన ఎన్నో ఎన్నెన్నో కష్టాలను నష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. అయన ఆనాటి నుంచి ఇప్పటివరకు ఎక్కడా వెనుదిరగలేదు. ఆ మాటపైనే నిలబడ్డారు. ఆయన వ్యతిరేక శక్తులు జగన్‌ను అణగదొక్కాలని చూసేకొద్దీ ఆయన రెట్టించిన ఉత్సాహంతో బలపడుతూ వచ్చారు. తండ్రి ఆశయాలను సాధించాలనే బృహత్తర ఆశయంతో, ఆయన చూపిన ప్రజా సంక్షేమ వెలుగులో ప్రజలకు మరింత చేరువై, వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగిన జగన్.. జనం మధ్యనే ఉంటూ వచ్చారు. జగన్ ఎదుగుదలను సహించని కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై ఎన్ని కుట్రలు పన్నినా.. అక్రమ కేసులు పెట్టినా ఆయన సంకల్పం మాత్రం సడలలేదు. పోరాడుతూనే ఉన్నారు. జనం మధ్యే ఉంటూ ఆ రాజన్న రాజ్యం కోసం కష్టపడుతూనే ఉన్నారు.
అడుగులో అడుగేస్తూ...!
2017 నవంబర్ 6 వ తేదీ రోజున ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్ర జగన్ జీవితంలో మరో మైలురాయి. దాదాపు 14 నెలల పాటు ఎండనకా వాననకా 13 జిల్లాల ప్రజలను ప్రత్యక్షంగా కలుస్తూ 3648 కిలోమీటర్ల (కశ్మీర్ నుంచి కన్యాకుమారి కన్నా ఎక్కువ దూరం) మేరకు సాగిన కాలినడకన ఆయన ప్రజలకు మరింత చేరువయ్యారు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, సోదరి షర్మిల పాదయాత్రలు ముగించిన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోనే జగన్ పాదయాత్ర పూర్తి చేయడం మరో చారిత్రక ఘట్టంగా మారింది. ప్రజా సంకల్పయాత్రలో 3648 కిలోమీటర్లు నడిచింది నేనైనా నడిపించింది మాత్రం ప్రజలే అని జగన్ చెప్పిన మాటతో ఆయన జనంతో మమేకం కావడమంటే ఎంతిష్టమో తెలియజేస్తుంది. " ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు వేలాది కిలోమీటర్లు పాదయాత్రలు చేయడం... కోట్లాది మంది ప్రజలను ప్రత్యేక్షంగా కలవడం... ప్రపంచ చరిత్రలో ఎవరికీ దొరకని అదృష్టం. ఇది దైవ నిర్ణయం.ఇది ప్రజల ఆశీర్వాదం. కోట్లాది మంది గుండె చప్పుళ్లు వినగలగడం నా జీవితానికే గొప్ప అనుభవం " అని చివరి రోజున జగన్ చెప్పిన మాట.
ఏదైనా ఒక విషయంమీద మాట్లాడాలన్నా, కొత్త అంశం తెలుసుకోవాలనుకున్నా దాని పూర్తి లోతుపాతులు తెలుసుకునే వరకు నిద్రపోరు. మరీ ముఖ్యంగా ప్రజా సమస్యలకు సంబంధించి తాను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా చూసినదానిపైనే ఎక్కువ ఆధారపడుతారు. ఏ విషయంలోనైనా పూర్తి అవగాహన రాకుండా మాట్లాడరు. నేర్చుకునే విషయంలో నిత్యవిద్యార్థి. అవగాహన చేసుకునే వరకు అడిగి తెలుసుకుంటారు. ఎవరైనా సరే ఒకసారి పరిచయమైతే చాలు ఎన్నేళ్లయినా సరే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ప్రజా సమస్యలపై జగన్ స్థాయిలో పోరాటాలు చేసిన చరిత్ర కలిగిన రాజకీయ నాయకుడు దేశంలోనే ఉండరేమో. ప్రత్యేక హోదా కావొచ్చు... ఫీజు రీయింబర్స్ మెంట్ కావొచ్చు... సమస్యఏదైనా...దీక్షలు, ధర్నాలు, ఆందోళనలు... జగన్ చేసినన్ని ఎవరూ చేయలేదు. అలాగే లక్షలాది మంది ప్రజలను కలుసుకున్న ప్రత్యేక్షంగా కలుసుకున్న అరుదైన నాయకుడు జగన్.
నేపథ్యం
యెడుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి 1972 డిసెంబరు 21న జన్మించారు. నిజాం కాలేజీలో బీకాం పూర్తి చేశారు. ఆ తర్వాత మేనేజ్ మెంట్ కోర్సులో చేరినప్పటికీ పూర్తి చేయలేదు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, విజయమ్మలకు తొలి సంతానం కాగా సోదరి షర్మిల. 1996లో భారతీరెడ్డితో వివాహం. వారికి హర్షా, వర్షా ఇద్దరు కూతుళ్లు. మితంగా తినడం ఇష్టం. టీ అంటే ఎక్కువ ఇష్టపడుతారు. తెల్లచొక్కాలు ధరించడానికి ప్రాధాన్యతనిస్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మాదిరిగానే తెల్లచొక్కా చేతులు కొంతవరకు పైకి మడిచి ధరిస్తారు.
- శివ ఉప్పల





















Comments
Please login to add a commentAdd a comment