పేదవానికి ఎంపీ టికెట్‌ ఇచ్చిన పార్టీ వైఎస్సార్‌సీపీ | YS Jagan Mohan Reddy Meeting in Palamaneru | Sakshi
Sakshi News home page

నయవంచనపై గర్జన

Published Thu, Mar 21 2019 1:14 PM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

YS Jagan Mohan Reddy Meeting in Palamaneru - Sakshi

పలమనేరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ హేమంత్‌కుమార్‌ రెడ్డికి కండువా వేసి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి

‘‘ప్రతి అక్కచెల్లెమ్మలకు, అవ్వతాతలకు, అన్నదమ్ములకు చెప్తున్నా.. మీకు అండగా నేనుం టా. దేవుడి దయ వల్ల, మీ అందరి ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నవరత్నాల పథకాలను అమలు చేస్తా.. ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుస్తా.. రైతన్నలు అధైర్యపడొద్దు.. మీకు ఏటా పంటల సాగుకు పెట్టుబడి నిధి ఇస్తా.. ఉచితంగా బోర్లు వేయిస్తా.. అవ్వతాతల పింఛను రూ.3 వేలకు పెంచుతా.. అన్ని వర్గాల వారినీ ఆదుకుంటా.. గతంలో నాన్న వైఎస్సార్‌ గారి పాలన చూ శా. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి.. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత తీసుకొస్తా’’ అని ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సాయంత్రం పలమనేరు బహిరంగ సభలో పిలుపునిచ్చారు. నిత్యం మోసాలు, డ్రామాలతో సాగిన చంద్రబాబు అయిదేళ్ల పాలనపై వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో ఆయన ప్రసంగించారు.

పలమనేరు: సీఎం చంద్రబాబునాయుడు కుట్ర రాజకీయాలను వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పలమనేరు వేదికగా కడిగేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలోని పలమనేరు పట్టణంలో నిర్వహించిన బహిరంగసభలో వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించా రు. చంద్రబాబు నయ వంచనపై గర్జించారు. ఆయన్ను సినిమాలో విలన్‌గా పోల్చారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో సాగిన అన్యాయాలు, అక్రమాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఐదేళ్ల బాబు పాలనలో జరిగిన అన్యాయాలు, అబద్ధాలు, మోసాలను కళ్లకు కట్టినట్టు ప్రజలకు వివరించారు. ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పడం చంద్రబాబుకే చెల్లిందన్నారు.

ఆయన ఎన్నికల్లో గెలవడానికి సొంత మామనేకాదు సామాన్య జనాన్ని కూడా ఏం చేయడానికైనా వెనుకాడరని చెప్పినప్పుడు జనం నుంచి విపరీతమైన స్పందన కనిపించింది. రాష్ట్రంలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఉత్తుత్తిగా మారిపోయారని, జన్మభూమి కమిటీలే మాఫియా సామ్రాజ్యాన్ని నడిపాయని దుయ్యబట్టారు. ఈ ఎన్నికలను ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించారు. మనం పింఛన్‌ రెండువేల రూపాయలు ఇస్తామని చెప్పగానే చంద్రబాబు ఆ మొత్తం ఇచ్చాడని, మన పార్టీ అధికారంలోకి రాగానే రూ.3వేలు ఇస్తామని చెప్పడంతో జనం నుంచి పెద్దయెత్తున స్పందన వచ్చింది. పిల్లలను బడికి పంపితే ఏడాదికి రూ.15వేలు ఇస్తామని చెప్పగానే మహిళలు జై జనగన్నా అంటూ నినాదాలు చేశారు. పొదుపు సంఘాల్లోని అప్పులంతా మన ప్రభుత్వం రాగానే పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పగానే మహిళల నుంచి మంచి స్పందన వచ్చింది. అన్నా, అక్కా మన గుర్తు ఫ్యాన్‌ అంటూ ఫ్యానును చేతిలో చూపుతూ ప్రజల్లో ఉత్సాహం నింపారు. వచ్చే ఎన్నికల్లో పలమనేరు అసెంబ్లీ అభ్యర్థిగా వెంకటేగౌడ, చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా రెడ్డెప్పకు ఓటేసి అఖండ మెజారిటీ గెలిపించాలని కోరారు.

ఘన స్వాగతం..
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పలమనేరుకు చేరుకోగానే ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి, పలమనేరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శారద, సీనియర్‌ నాయకులు కుమార్, నారాయణస్వామి, జేఎంసీ శ్రీనివాసులు, రాకేష్‌రెడ్డి, ఆకుల గజేంద్ర, ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు.

సభకు భారీగా జనం..
పలమనేరులో జరిగిన ఎన్నికల ప్రచార సభకు గతంలో ఎన్నడూ లేనివిధంగా జనం రావడం కనిపించింది. గ్రామాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా జననేతను చూసేందుకు వచ్చారు. పట్టణంలోని ఏటీఎం సెంటర్‌ నుంచి రంగబాబు సర్కిల్‌ దాకా జనంతో నిండిపోయింది. మెయిన్‌ రోడ్డులోని మిద్డెలపై మహిళలు గంటల పాటు వేచి ఉండి జగన్‌ను చూసి సంతోషపడ్డారు. జగన్‌మోహన్‌రెడ్డి సభ నియోజకవర్గ నేతలతో సమరోత్సాహాన్ని నింపింది.

పేదవానికి ఎంపీ టికెట్‌ ఇచ్చిన పార్టీ వైఎస్సార్‌సీపీ
రాష్ట్రంలో తొమ్మిది మంది పేదలకు వైఎస్సార్‌సీపీ పార్లమెంటు టికెట్లు కేటాయిస్తే అందులో తాను అత్యంత పేదవాడినని చిత్తూరు ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప పేర్కొన్నారు. పలమనేరులో బుధవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తనకు టికెట్‌ కేటాయించిన వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డిలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. జిల్లాలో అన్ని వర్గాలకు మేలు జరగాలన్నా, మూతబడిన పరిశ్రమలు తెరుచుకోవాలన్నా, పాడిపరిశ్రమ అభివృద్ధి కావాలన్నా వైఎస్సార్‌సీపీని గెలిపించుకోవాలని అన్నారు. ఫ్యాను గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని విన్నవించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement