సాక్షి వెబ్ ప్రత్యేకం : పదమూడేళ్ల వయసులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)లో చేరిన ఓ పాఠశాల విద్యార్థి తన అకుంఠిత దీక్ష, నిరంతర కృషి, పట్టుదలతో మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. ఆయనే మూడుసార్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్. భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీగా, మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సేవలందించిన ఆయన 2005 నుంచి 2018 డిసెంబర్ వరకు మధ్యప్రదేశ్ సీఎంగా కొనసాగారు. రాజకీయాల్లో విశేషమైన అనుభవమున్నా ప్రతి విషయాన్ని సున్నితంగా ఆలోచించే మనస్థత్వం చౌహాన్‌ది. వృత్తిరీత్యా ఆయనది వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినా ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా మూడు సార్లు సీఎం పీఠం ఎక్కి ఔరా అనిపించారు. అంతేకాదు విదిశ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా ఐదు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. లాడ్లీ లక్ష్మీ యోజన, కన్యాదాన్ యోజన, జననీ సురక్షా యోజన లాంటి పథకాలను ప్రవేశపెట్టి మధ్యప్రదేశ్ ప్రజల మన్ననలు అందుకున్నారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో బాబాలకు క్యాబినెట్ హోదా కల్పించి జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. భోపాల్‌లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ (తత్వశాస్త్రం) పట్టా అందుకున్నారు.
రాజకీయ ప్రవేశం
1972లో ఆర్‌ఎస్‌ఎస్ లో చేరారు. 1975లో మధ్యప్రదేశ్‌లోని మోడల్ స్కూల్ స్టూడెంట్స్ యూనియన్‌కి మొదటిసారిగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం 1976-77 ప్రాంతంలో ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వ వ్యతిరేకంగా ఉద్యమించినందుకు కొంతకాలం భోపాల్‌లో జైలుశిక్ష అనుభవించారు. మొదటిసారి 1990లో బుద్నీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1991లో పదో లోక్‌సభ ఎన్నికల్లో మొదటిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అంతేకాకుండా 1997-98 మధ్యకాలంలో పార్టీ కీలక కమిటీల్లో సభ్యుడిగా, మధ్యప్రదేశ్ బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా సేవలు అందించారు. 1999లో 13వ లోక్‌సభ ఎన్నికల్లో నాలుగోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం 2000 నుంచి 2003 వరకు భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా, ఛైర్మన్ ఆఫ్ హౌస్ కమిటీ (లోక్‌సభ), బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే బుద్నీ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన ఉప ఎన్నికల్లో ఆయన భారీ మెజారిటీతో గెలిచి తొలిసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. మూడు పర్యాయాలు మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారం చేపట్టేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వ్యాపం కుంభకోణం ఆయన సీఎంగా ఉన్న సమయంలోనే చోటుచేసుకుంది. దీనిలో ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మాంద్‌సౌర్‌లో రైతులపై కాల్పులు జరిపి ఐదుగురు రైతుల మృతికి కారణమైయారన్న అప్రతిష్టను శివరాజ్‌సింగ్ మూటకట్టుకున్నారు.
సంస్కరణలు
ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన అనంతరం రాష్ట్రంలో వ్యవసాయ రంగ పరిస్థితిని మెరుగుపరిచేందుకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. రైతులకు వడ్డీలేని రుణాలు, నీటి వనరుల పెంపు, రాయితీ ధరకు విద్యుత్ సరఫరా తదితర మార్గాల ద్వారా వ్యవసాయం వృద్ధి చెందేందుకు కృషి చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా దిగుబడి సాధించినందుకు గానూ వరుసగా నాలుగు సంవత్సరాల పాటు రాష్ట్రపతి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ‘కృషి కర్మణ్’ అవార్డును అందుకున్నారు. మనిషి జీవన విధానంలో నదుల ప్రాముఖ్యతను తెలియజేస్తూ వాటిని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని చెబుతూ ‘నమామి దేవి నర్మదా’ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టారు. తన నిబద్ధత, నిరాడంబరతతో చాలా సులువుగా ప్రజల్లో కలిసి పనిచేసినందుకుగాను అందరి మన్ననలు అందుకుంటూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవన విధానం మెరుగు పరిచేందుకు సూర్యోదయ మానవతా సేవా బిరుదును అందుకున్నారు.
కుటుంబ నేపథ్యం
ప్రేమ్‌సింగ్ చౌహాన్, సుందర్‌బాయ్ చౌహాన్ దంపతులకు 1959, మార్చి 5న శివరాజ్‌సింగ్ జన్మించారు. భార్య సుధాన్ సింగ్, కార్తికేయ, కునాల్ వీరిపిల్లలు. శివరాజ్ సింగ్‌ది వ్యవసాయ ఆధారిత కుటుంబం.
-సురేష్ అల్లిక
Comments
Please login to add a commentAdd a comment