సాక్షి వెబ్ ప్రత్యేకం : తండ్రి ఆకస్మిక మరణంతో రాజకీయాల్లోకొచ్చిన యువనేత సచిన్ పైలట్ అనతి కాలంలోనే కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగారు. 26 ఏళ్లకే ఎంపీగా గెలుపొందిన ఆయన భారత పార్లమెంట్ చరిత్రలో పిన్న వయసులో ఎంపీగా ఎన్నికైన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. రాహుల్ గాంధీకి నమ్మిన బంటుగా మారి రాజస్థాన్ కాంగ్రెస్ పగ్గాలు అందుకున్నారు. 2013 అటు తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయంతో నిస్తేజంగా మారిన కాంగ్రెస్ శేణుల్లో జవసత్వాలు నింపారు. సీఎం వసుందర రాజే పాలనను ఎండగడుతూ.. యువత, గ్రామీణ ప్రాంతాల్లోని కర్షకులకు దగ్గరయ్యారు. తద్వారా రాజస్థాన్‌లో మరోసారి కమలం విరబూయకుండా అడ్డుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు సాధించి కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టడంలో కీలక పాత్ర పోషించారు. అయితే, మాజీ సీఎం, పార్టీలో సీనియర్ అయిన అశోక్ గహ్లోత్‌తో ముఖ్యమంత్రి పీఠానికి పోటీ ఏర్పడడంతో సచిన్ డిప్యూటీ సీఎం పదవితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరి పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన రాజస్థాన్‌లో పార్టీని అధికారంలో నిలిపిన ఈ యువ నాయకుడి సేవల్ని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఉపయోగించుకుని కాంగ్రెస్ ఏ మేరకు లాభపడుతుందో వేచి చూద్దాం..!
కుటుంబ నేపథ్యం..
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రాజేష్ పైలట్, రమా పైలట్ కుమారుడు సచిన్ పైలట్. ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌లో 1977, సెప్టెంబర్ 7 న జన్మించారు. కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా కూతురు సారా అబ్దుల్లాను ప్రేమ వివాహం చేసుకున్నారు. సారా సామాజిక కార్యకర్త. వీరికి ఇద్దరు కుమారులు.
రాజకీయ ప్రస్థానం..
తండ్రి మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చారు. 2004లో రాజేష్ పైలట్ ప్రాతినిధ్యం వహించిన దౌసా నుంచి ఎంపీగా గెలుపొందారు. భారత పార్లమెంట్ చరిత్రలో పిన్న వయసులో ఎంపీగా ఎన్నికైన వ్యక్తిగా రికార్తు సృష్టించారు. అనంతరం 2009లో అజ్మీరా నుంచి రెండో సారి ఎంపీగా గెలుపొందారు. యూపీఏ -2 హయాంలో.. కమ్యునికేషన్లు మరియు ఐటీ వ్యవహారాల శాఖ మంత్రిగా, కార్పొరేట్ వ్యవహరాల శాఖ మంత్రి (స్వతంత్ర) గా పనిచేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి అజ్మీరా నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014లో రాజస్థాన్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీని క్షేత్ర స్థాయిలో పటిష్ట పరిచారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ సచిన్ సారథ్యంలో పునర్‌వైభవం సంతరించుకుంది. 2018 శాసనసభా ఎన్నికల్లో ఆ పార్టీ 100 సీట్లు సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. టోంక్ అసెంబ్లీ స్థానాన్ని గత 46 ఏళ్లుగా మైనారిటీలకే కేటాయిస్తూ వస్తున్న కాంగ్రెస్ ఈ సారి రూటు మార్చింది. సంప్రదాయానికి స్వస్తి పలుకుతూ సచిన్‌ను టోంక్ నుంచి బరిలోకి దింపింది. బీజేపీ అభ్యర్థి యూనస్ ఖాన్‌పై సచిన్ 54,179 మెజారిటీతో ఘన విజయం సాధించారు. కిషన్‌ఘర్ విమానాశ్రాయాన్ని సాధించడం తన రాజకీయ జీవితంలో గొప్ప విజయంగా సచిన్ చెప్తారు.
విద్యాభ్యాసం..హాబీలు..
ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో ఆంగ్ల సాహిత్యం (ఆనర్స్)లో బీఏ చదివారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (ఘజియాబాద్)నుంచి.. వార్టాన్ బిజినెస్ స్కూల్ (పెన్సిల్వేనియా) నుంచి ఎంబీఏ పట్టాలు పొందారు. సచిన్‌కు షూటింగ్, విమానాలు నడపడం, డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. ఢిల్లీ తరపున పలు జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొన్నారు. అమెరికా నుంచి 1995లో ప్రైవేటు పైలట్ లైసెన్స్ పొందారు.
గ్లోబల్ లీడర్‌గా గౌరవం..
బీబీసీ ఢిల్లీ బ్యూరోతోపాటు, జనరల్ మోటార్స్‌లోనూ సచిన్ పనిచేశారు. టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ హోదా పొందారు. పలు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో సభ్యుడిగా కూడా ఉన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం-2008 ఏడాదికి గాను యంగ్ గ్లోబల్ లీడర్‌గా గుర్తింపు నిచ్చింది. 26 ఏళ్ల వయసులో ఎంపీగా, 31 ఏళ్లకే కేంద్ర మంత్రిగా, 35 సంవత్సరాలకే రాజస్థాన్ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా సచిన్ సేవలందించడం విశేషం.
-వేణు.పి
Comments
Please login to add a commentAdd a comment