సాక్షి వెబ్ ప్రత్యేకం : తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కిన జై బోలో తెలంగాణ చిత్రంలో జయమ్మ పాత్రలో నటించి తెలుగువారికి సుపరిచితురాలుగా నిలిచారు స్మృతి ఇరానీ. ‘ఆటుపోట్లు లేని సముద్రం.. గెలుపు ఓటములు లేని యుద్దం ఉండదని’ అంటూ స్మృతి ఇరానీ చెప్పిన డైలాగులపై, ఆమె ప్రదర్శించిన నటనపై ప్రశంసల వర్షం కురిసింది. అప్పటికే హిందీ టెలివిజన్ రంగంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన స్మృతి.. ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన స్మృతి.. చిన్ననాటి నుంచే అవకాశాలను వెతుక్కుంటూ జీవనం సాగించారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి అనతికాలంలోనే కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు. పలు సందర్భాల్లో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాలకు దారితీశాయి. ఇలా ఆమె టీవీ రంగంలో, రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్నారు.
స్మృతి తండ్రి పంజాబీ, తల్లి బెంగాలీ.. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో ఇంటి నుంచి బయటికొచ్చి పెళ్లి చేసుకున్నారు. ఢిల్లీ శివార్లలో నివాసం ఉంటున్న వారికి 1976 మార్చి 23న స్మృతి ఇరానీ జన్మించారు. స్మృతికి ఇద్దరు చెల్లెలు కూడా ఉన్నారు. స్మృతి ఇరానీ పెద్ద అమ్మాయి కావడంతో.. పదో తరగతి పూర్తి చేసినప్పటి నుంచే కుటుంబానికి ఆర్థికంగా చేయూత అందించేందుకు కష్టపడ్డారు. ఇంటర్ విద్యను మధ్యలోనే ఆపేసిన ఆమె మెక్ డోనాల్డ్స్‌లో హెల్పర్‌గా పనిచేశారు. అంతేకాకుండా పలు సౌందర్య సాధనాలకు మార్కెటింగ్ ఎజెంట్‌గా పనిచేశారు. దూర విద్యలో డిగ్రీ పూర్తిచేశారు. స్నేహితురాలి సలహాతో తన ఫొటోలను మిస్ ఇండియా పోటీలకు పంపిన స్మృతి 1998లో మిస్ ఇండియా ఫైనలిస్ట్‌లలో ఒకరిగా నిలిచారు. కానీ మిస్ ఇండియా టైటిల్ సొంతం చేసుకోలేకపోయ్యారు. ఆ తర్వాత ఆమెకు ఓ ప్రకటనలో నటించే అవకాశం వచ్చింది. అలా టీవీ రంగంలోకి అడుగుపెట్టిన స్మృతి ఇరానీ పలు హిట్ సీరియల్స్‌లో నటించారు. బుల్లితెర స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. 2001లో తనకంటే వయసులో చాలా పెద్దవాడైన బిజినెస్‌మెన్ జుబిన్ ఇరానీని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఓ ప్రొడక్షన్ సంస్థ ఏర్పాటు చేసిన స్మృతి పలు సీరియల్స్‌ను కూడా నిర్మించారు.
రాజకీయ జీవితం..
స్మృతి ఇరానీ తాత ఆరెస్సెస్‌లో, తల్లి జనసంఘ్‌లో సభ్యులుగా ఉండటంతో ఆమె చిన్నతనంలోనే ఆరెస్సెస్ వైపు ఆకర్షితురాలైయ్యారు. చిన్నతనం నుంచే రాజకీయాలపై ఆలోచన ఉండటంతో.. 2003లో బీజేపీలో చేరారు. ఆ మరుసటి ఏడాదే ఆమె మహారాష్ట్ర యూత్ వింగ్ ఉపాధ్యక్షురాలిగా నియమింపబడ్డారు. తొలిసారిగా 2004 సార్వత్రిక ఎన్నికల్లో చాందినీ చౌక్ నియోజకవర్గం నుంచి పోటీచేసి కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్‌పై చేతిలో ఓటమిపాలయ్యారు. అయిన ఆమెకు బీజేపీ తగిన గుర్తింపునిచ్చింది. 2010లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టే అవకాశం కల్పించింది. అదే సంవత్సరం బీజేపీ మహిళ మోర్చా అధ్యక్షురాలిగా స్మృతి ఇరానీ నియమించారు. 2011లో గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.
అయితే ఆమె 2014 సార్వత్రిక ఎన్నికల్లో అమేథీ నుంచి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై పోటీ చేసి ఓడిపోయినప్పటికి పోరాట పటిమను కనబరిచారు. ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి.. మోదీ అధికారం చేపట్టాక స్మృతి ఇరానీకి కేంద్రమంత్రి వర్గంలో చోటు కల్పించారు. తొలుత హెచ్‌ఆర్‌డీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆమెను.. 2016లో జౌళి శాఖ మంత్రిగా నియమించారు. స్మృతి తన రాజకీయ ప్రస్థానంప్రారంభించినప్పటి నుంచి సామాజిక సమస్యలపైనే కాకుండా..మహిళల హక్కుల కోసం కూడా పోరాటం కొనసాగిస్తున్నారు. జై బోలో తెలంగాణ చిత్రంతో పాటు ఆమె పలు చిత్రాలో నటించారు. స్మృతి ఇరానీకి ఇద్దరు పిల్లలున్నారు. అబ్బాయి జోహ్ర్, అమ్మాయి జోయిష్.
వివాదాలు..
బీజేపీలో అతి తక్కువ కాలంలోనే ఉన్నత పదవులు చేపట్టిన స్మృతి ఇరానీని పలు వివాదాలు చట్టుముట్టాయి. 2014కు ముందు ప్రతిపక్షంలో ఉన్న సమయంలోను, కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాలకు దారితీశాయి. ఎన్నికల అఫిడవిట్‌లో ఆమె వెర్వేరుగా విద్యార్హతలను పేర్కొనడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగింది. ఆమె తప్పుడు డిగ్రీ సమర్పించారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. కానీ దానిపై స్మృతి ఇరానీ తన డిగ్రీ పట్టా ఒరిజినల్ అని స్పష్టమైన ప్రకటన చేయలేదు.
స్మృతి ఇరానీ హెచ్‌ఆర్‌డీ మంత్రిగా ఉన్న కాలంలో హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల మృతి చెందారు. ఆ సమయంలో రోహిత్ మృతిపై ఆమె పార్లమెంట్‌లో చేసిన ప్రసంగంపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఆమెను హచ్‌ఆర్‌డీ నుంచి జౌళి శాఖకు మార్చారు.
-సుమంత్
Comments
Please login to add a commentAdd a comment