సాక్షి వెబ్ ప్రత్యేకం : దేశ రాజకీయాల్లో ఆయన ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించారు. జాతీయ రాజకీయాల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆయన కీలకనేత. నేడు ఇంటిపోరుతో సతమతమవుతున్నా... ఒకనాడు దేశరాజకీయాలను తనచుట్టూ తిప్పుకున్న సీనియర్ నాయకుడు ములాయం సింగ్ యాదవ్. పెద్ద కొడుకు అఖిలేష్, తమ్ముడు శివపాల్ యాదవ్, ఎస్పీ సీనియర్ నేత అమర్‌సింగ్ మధ్య తలెత్తిన విభేదాలు సమాజ్‌వాదీ పార్టీపై ప్రతికూల ప్రభావం చూపాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ పరాజయానికి ఈ విభేదాలే ప్రధాన కారణమయ్యాయి. సీఎం అఖిలేష్ నిర్ణయాలతో ములాయం తీవ్రంగా వ్యతిరేకించడంతో.. ఆయన పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. దాంతో ఎస్పీ రెండుగా చీలిపోయి.. పార్టీ గుర్తు కోసం తండ్రీ కొడుకుల మధ్య వార్ నడిచింది. ప్రస్తుతం లోక్‌సభ ఎంపీగా ఉన్న ములాయం.. పార్టీలో కేవలం అభిప్రాయాలను వెల్లడించే స్థితిలో మాత్రమే ఉన్నారు. అయితే, కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న ఈ ఎస్పీ కింగ్ .. బీజేపీ ఓటమే లక్ష్యంగా ఎస్పీ-బీఎస్పీ కూటమి కట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నరేంద్రమోదీ మరోసారి ప్రధాని కావాలంటూ పార్లమెంటు సాక్షిగా వ్యాఖ్యానించి వార్తల్లో నిలిచారు. మరి కేంద్రంలో ఎవరుండాలని నిర్ణయించే యూపీలో ములాయం వ్యాఖ్యలు ఏ మేరకు ప్రభావం చూపుతాయో తెలియాలంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే !
మల్లయోధుడు..
ఎత్వా జిల్లాలోని సైఫీ ప్రాంతంలో గల వ్యవసాయ పేద కుటుంబంలో సుఘార్ సింగ్, మూర్తి సింగ్‌లకు 1939, నవంబర్ 22న జన్మించారు. ఆరుగురు తోబుట్టువుల్లో ఒకరు. తొలుత మల్లయోధుడిగా రాణించాలనుకున్నారు. అది కుదరకపోవడంతో ఆగ్రా యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో పట్టా పొందారు. బడుగులు, ముస్లింల పక్షపాతిగా పేరు గడించారు. సోషలిస్టు నాయకుడు రామ్‌మనోహర్ లోహియా రచనలకు ప్రభావితమై ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టి రాజకీయాలవైపు అడుగులేశారు. ఆయనకు కుమారులు అఖిలేష్ యాదవ్, ప్రతీక్ యాదవ్ ఉన్నారు. ములాయంకు ఇద్దరు భార్యలు ఒకరు మాలతీ దేవీ. మరొకరు సాధనా గుప్తా.
రాజకీయ ప్రస్థానం..
1967లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నిక. 1975 ఎమర్జెన్సీ కాలంలో జైలు జీవితం గడిపారు. 1977లో లోక్‌దళ్ (జనరల్ పీపుల్స్ పార్టీ)కి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రెండుగా చీలిన లోక్‌దళ్-బీ వర్గానికి నాయకత్వం వహించారు. 1980 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 1982లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1985 వరకు మండలిలో ప్రతిపక్ష పాత్ర పోషించారు. 1985 నుంచి రెండేళ్లే పాటు శాసనసభలో ప్రతిపక్షపాత్ర నాయకుడిగా ఉన్నారు.
బీజేపీ మద్దతు ఉపసంహరణ..
1989లో బీజేపీ బయటి నుంచి మద్దతివ్వడంతో తొలిసారిగా సీఎం పీఠం అధిరోహించారు. అయితే, హిందూ మితవాదుల ‘బాబ్రీ ఆక్రమణ’ను ములాయం ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో బీజేపీ మద్దతు ఉపసంహరించుకొంది. కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో 1991 వరకు సీఎంగా కొనసాగారు. కాంగ్రెస్ కూడా మద్దతు ఉపసంహరించుకోవడంతో లోక్‌దళ్ ప్రభుత్వం పడిపోయింది. ఇతర పక్షాలతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బాబ్రీ మసీదు ఘర్షణలు ములాయం రాజకీయ జీవితంలో కీలక మార్పులు తెచ్చాయి.
సమాజ్‌వాది పార్టీ స్థాపన..
1992, అక్టోబర్ 4న న్యాయవాదులు, ముస్లింల మద్దతుతో సమాజ్‌వాది పార్టీ (సోషలిస్టు)ని స్థాపించారు. 1992, డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేసినప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ సరైన రక్షణ చర్యలు తీసుకోలేదంటూ ఆక్షేపించారు. బాబ్రీ వ్యవహారంతో బీజేపీ, కాంగ్రెస్‌లకు దూరమైనా ముస్లిం ప్రజలకు దగ్గరయ్యారు.
ఈసారి బీఎస్పీ వల్ల..
1993 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ మద్దతుతో ఎస్పీ ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో ములాయం రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, 1995 లో జరిగిన గెస్ట్‌హౌజ్ ఉదంతంతో ఎస్పీ-బీఎస్పీ ప్రభుత్వం కుప్పకూలింది. ఈసారి కూడా ములాయం పూర్తికాలం సీఎంగా కొనసాగలేకపోయారు. 1995 లో బీఎస్పీ-బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో ఆయన జాతీయ రాజకీయాలవైపు మళ్లారు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో విపక్షాలన్నీ కలిసి యునైటెడ్ ఫ్రంట్‌గా అవతరించాయి. ఇతర పక్షాల మద్దతుగా ములాయం ప్రధాని పీఠం ఎక్కాలనుకున్నారు. కానీ, యూఎఫ్‌లోని పార్టీలన్నీ దేవెగౌడకు మద్దతివ్వడంతో ప్రధాని అయ్యారు. 17 ఎంపీ సీట్లున్న ములాయంకు రక్షణశాఖ మంత్రిగా అవకాశం కల్పించారు.
ముచ్చటగా మూడోసారి
జాతీయ రాజకీయాలపైనే దృష్టి పెట్టిన ఎస్పీకి.. 2002 అసెంబ్లీ ఎన్నికల్లో 143 స్థానాలే వచ్చాయి. దీంతో మరోసారి ప్రతిపక్షానికే పరిమితమైంది. మరోమారు బీఎస్పీ-బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. అయితే, ఆ ప్రభుత్వం కూలిపోవడంతో.. ఇతర పక్షాలతో కలిసి ఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ములాయం మూడోసారి సీఎం అయ్యారు. 2007లో బీఎస్పీ అధికారంలోకి వచ్చింది. 2009లో ములాయం మరోమారు లోక్‌సభకు ఎనికయ్యారు. కాగా, బీఎస్పీ అయిదేళ్ల పాలనతో విసిగిపోయిన ప్రజలు 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీకి భారీ మద్దతు ప్రకటించారు. దీంతో 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో ఎస్పీ 224 సీట్లు గెలుచుకుంది. అయితే, ఈ సారి ములాయం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తను జాతీయ రాజకీయాల్లో కొనసాగుతూనే.. యూపీ ముఖ్యమంత్రిగా కొడుకు అఖిలేష్‌కు అవకాశం కల్పించారు.
- వేణు.పి
Comments
Please login to add a commentAdd a comment