సాక్షి వెబ్ ప్రత్యేకం : బీజేపీ భీష్ముడు. దేశాన్నేలుతున్న భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి అత్యంత సన్నిహితుడు లాల్‌కృష్ణ అద్వాణీ. దేశభక్తి భావాలతో 14 ఏళ్ల ప్రాయంలోనే ఆరెస్సెస్‌లో చేరి భారత రాజకీయాల్లో చక్రం తిప్పిన దిగ్గజ నాయకుడు. కేంద్ర హోంమంత్రిగా, ఉప ప్రధానిగా సేవలందించిన ఒకప్పటి కమలదళాధిపతి. రామ్ జన్మభూమి-బాబ్రి ఉద్రిక్తతల నేపథ్యంలో రథయాత్ర చేపట్టి బీజేపీ శ్రేణుల్లో సరికొత్త జవసత్వాలు నింపిన దూకుడు మనిషి. రెండు స్థానాలున్న బీజేపీని 86 స్థానాలకు చేర్చిన కాషాయ ధీరుడు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడానికి వాజ్‌పేయి ప్రధాని కావడానికి పాటుపడిన రాజకీయ చతురుడు. ఏనాటికైనా ప్రధానమంత్రి పదవి చేపట్టడం ఆయన కల.
1999లో ఎన్డీయే అధికారంలోకి రాగానే.. సంకీర్ణ రాజకీయాల రీత్యా మృదుస్వభావి వాజ్‌పేయి ప్రధాని కావడంతో ఉప ప్రధాని, హోంమంత్రి పదవికి పరిమితమైన అద్వాణీ.. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నడుమ తన కలను నెరవేర్చుకలేకపోయారు. గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్రమోదీ బీజేపీలో అనూహ్యంగా ఎదిగి రావడం.. 2014 ఎన్నికల్లో ఆయన బీజేపీ ప్రచారసారథిగా పగ్గాలు చేపట్టి.. ఆ పార్టీకి అద్భుతమైన విజయాన్ని చేకూర్చడంతో రాజకీయాల్లో, పార్టీలో అద్వాణీకి, ఆయన తరానికి ప్రాధాన్యం తగ్గిపోయింది. నరేంద్రమోదీ ప్రధాని కావడం.. ఆయన అనుచరుడైన అమిత్ షా బీజేపీ అధ్యక్షుడు కావడంతో.. బీజేపీ నుంచి అద్వాణీ తరం క్రమంగా తెరమరుగైంది. ఈ నేపథ్యంలో 92 ఏళ్ల కురువృద్ధుడైన అద్వాణీ రానున్న రాజకీయాల్లో ఏ పాత్ర పోషిస్తారా? ఆయన ప్రభావమెంతా? రాజకీయాల నుంచి తప్పుకుంటారా? మళ్లీ పోటీ చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
కుటుంబ నేపథ్యం...
సింధీ ఫ్యామిలీకి చెందిన కిషన్‌చంద్ డీ.అద్వాణీ, జ్ఞానీదేవీ దంపతులకు 1927, నవంబర్ 8 న కరాచీలో లాల్‌క్రిష్ణ అద్వాణీ జన్మించారు. దేశ విభజన అనంతరం కిషన్‌చంద్ కుటుంబం పాక్ నుంచి భారత్‌కు తిరిగొచ్చింది. కమలా ఎల్కే అద్వాణీ వివాహం 1965 లో జరిగింది. వీరికి కుమారుడు జయంత్, కూతురు ప్రతిభ ఉన్నారు. ఆయన తోబుట్టువు షీలా అద్వాణీ.
చదువు...
కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ పాఠశాలలో హైస్కూల్ చదువు పూర్తి చేశారు. పాకిస్తాన్‌లోని హైదరాబాద్ డీజీ నేషనల్ కాలేజీలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. కరాచీలోని మోడల్ హైస్కూల్‌లో 1944లో ఉద్యోగ జీవితం ప్రారంభించారు.
రాజకీయ జీవితం
దేశ విభజన అనంతరం కుటుంబంతో కలిసి పాకిస్తాన్ నుంచి భారత్‌కు చేరుకున్న ఎల్‌కే అద్వాణీ భారత పునర్నిర్మాణానికై తనవంతు కృషి చేయాలనుకున్నారు. 14 ఏళ్ల వయసులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)లో వలంటీర్‌గా చేరారు. అనంతరం రాజకీయాల వైపు అడుగులేశారు. 1951లో శ్యామప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్ (బీజేఎస్) లో చేరారు. 1957లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సహాయకుడిగా పనిచేశారు. 1958 నుంచి 1963 వరకు జనసంఘ్ ఢిల్లీ శాఖకు కార్యదర్శిగా సేవలందించారు. బీజేఎస్ రాజకీయ పత్రిక ’ఆర్గనైజర్’ ఉపసంపాదకుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 1967లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్‌కు చైర్మన్‌గా ఎన్నికయ్యారు.1970లో మొదటిసారిగా లోక్‌సభ ఎంపీగా గెలుపొందారు. 1972లో జనసంఘ్‌కు అధ్యక్షత వహించారు. మిత్ర పక్షాలతో కలిసి 1977లో జనసంఘ్ జనతా పార్టీగా ఆవిర్భవించింది. జనతా పార్టీ విచ్చిన్నంతో వాజ్ పేయి అధ్యక్షతన 1980లో ఏర్పాటైన బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో అద్వాణీ ఒకరిగా ఉన్నారు. అదే సంవత్సరం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.
బీజేపీ స్థాపించిన అనంతరం 1984 లోకసభ ఎన్నికల్లో రెండు సీట్లకే పరిమితమైన బీజేపీ.. అద్వాణీ సారధ్యంలో 1989 ఎన్నికల వరకు ఘణమైన వృద్ధి సాధించింది. ఆ ఎన్నికల్లో 86 సీట్లు గెలుచుకుంది. ఇక హిందుత్వం ప్రధాన ఎజెండాగా.. లౌకికవాదం నేపథ్యంగా..1990లో ఆయన చేపట్టిన రామజన్మభూమి రథయాత్ర దేశ రాజకీయాలను కీలక మలుపు తిప్పింది. 1997లో 50 ఏళ్ల స్వతంత్ర భారత 'గోల్డెన్ జుబ్లీ' వేడుకలను నిర్వహించేందుకు అద్వాణీ దేశం నలుమూలల నుంచి స్వర్ణ జయంతి రథయాత్ర చేసి బీజేపీని మరో మెట్టు ఎక్కించారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు కావడానికి తనవంతు కృషి చేశారు. వాజ్‌పేయి క్యాబినెట్‌లో 1998లో హోం మంత్రిగా, 2002 నుంచి 2004 వరకు ఉప ప్రధానిగా సేవలందించారు. 2004లో బీజేపీ ఓటమి పాలవడం.. పదేళ్లపాటు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో అద్వాణీ నాయకత్వం ప్రభ కోల్పోయింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అద్వాణీని ప్రధానిగా అభ్యర్థిగా ప్రకటించింది. కానీ, ఆయన పార్టీని విజయపథంలో నడపించలేకపోయారు. 2014 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీని బీజేపీ ప్రచారంలోకి దింపింది. దీనిని వ్యతిరేకిస్తూ అద్వాణీ రాజీనామా చేశారు. పార్టీ నాయకులంతా నచ్చజెప్పడంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. గాంధీనగర్ లోకసభ నుంచి అద్వాణీ ప్రస్తుతం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఇటీవల లోక్‌సభలో ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. 1976 నుంచి 1982 వరకు అద్వాణీ గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.
నా జీవితం.. నాదేశం..
ఆరు భారతీయ భాషల్లో విడుదలైన ఎల్‌కే అద్వాణీ జీవిత చరిత్ర ‘మై కంట్రీ మై లైఫ్’ 2008లో విడుదలై ప్రాచుర్యం పొందింది. ఈ పుస్తకాన్ని భారత్ మిస్సైల్ మేన్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం విడుదల చేశారు. ఈ పుస్తకంలో వాజ్‌పేయితో తన 65 ఏళ్ల అనుబంధాన్ని పంచుకున్నారు అద్వాణీ. వాజ్‌పేయి భారతరత్నకు అన్ని విధాల అర్హుడని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అద్వానీ లేఖ కూడా రాశారు.
-వేణు.పి
Comments
Please login to add a commentAdd a comment