సాక్షి వెబ్ ప్రత్యేకం : హైదరా 'బాద్‌షా'. ఓల్డ్‌సిటీకా షేర్. అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్. ఉర్దూ ఇంగ్లీష్ బాషలో అనర్గళంగా మాట్లాడే వక్త. భారత ముస్లింలకు ఆయనే గళం. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ప్రతి సందర్భంలోనూ ముస్లింల పక్షానే పోరాడుతూ.. వారి సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూ ముందుకుసాగుతున్నారు. ఎప్పుడూ షేర్వాణీ, టోపీ ధరించి విలక్షణమైన ఆహార్యంతో ఆరడుగులకుపైగా ఆజానుబాహుడు. ఆయన ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలిగిన ఉర్దూలో ప్రసంగించడానికే ఇష్టపడుతారు. ముస్లిం ధార్మిక సంస్థగా పురుడు పోసుకున్న మజ్లిస్ –ఏ–ఇత్తేహదుల్–ముస్లిమీన్ (ఎంఐఎం)ను సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ రాజకీయపార్టీగా మారిస్తే.. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న అసదుద్దీన్ పార్టీని జాతీయ స్థాయి వినిపించడంలో విజయం సాధించారు. ఎమ్మెల్యేగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఒటమెరుగని నేతగా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, తమ డిమాండ్లను సాధించుకోవడం ఒవైసీ ప్రత్యేకత.
రాజకీయ ప్రస్థానం
సుల్తాన్ సలావుద్దీన్ వారుసుడిగా రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన అసదుద్దీన్.. పాతబస్తీలోని చార్మినార్ అసెంబ్లీ నుంచి 1994,1999 రెండు పర్యాయాలు ఎంపికయ్యారు. అనంతరం 2004లో హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగి ఘన విజయం సాధించారు. వరసగా మూడు పర్యాయాలు(2004, 2009, 2014) గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఇప్పుడు నాలుగోసారి బరిలో దిగేందుకు నామినేషన్ దాఖలు చేశారు. ఒవైసీ పోటీ చేసిన అన్ని ఎన్నికల్లోనే భారీ మెజార్టీతో ప్రత్యర్థులను మట్టికరిపించారు. 2009లో ఎంఐఎం పార్టీ అధ్యక్షత బాధ్యతలను చేపట్టిన అసదుద్దీన్.. పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఒక స్థానం గెలుచుకోవడంలో అసద్ కీలక పాత్ర పోషించారు.
వివాదాలు.. వివాదాస్పద వ్యాఖ్యలు
ముస్లింల పక్షాన తన గళాన్ని వినిపించే ఒవైసీ ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా 2016లో మహారాష్ట్రలో జరిగిన ఓ ప్రచార ర్యాలీలో భారత్‌మతాకీ జై అననని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆర్‌ఎస్సెస్ భావాజాలాన్ని ఇతరులకు బలవంతంగా రుద్దుతుందని, అందుకే తాను భారత్ మతాకీ జై అనని వివరణ ఇచ్చారు. ఇక దూకుడుగా వ్యవహరించే సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ ముస్లింలు తలచుకుంటే.. ముస్లింలు ఆలోచించుకోవాలి.. అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కూడా ఒవైసీ ఇరకాటంలో పడ్డారు. 2005లో ఓ వ్యక్తిని కొట్టారనే ఆరోపణలతో ఒవైసీ సోదరులపై కేసు నమోదైంది. 2009లో అసద్.. టీడీపీ పోలింగ్ ఏజెంట్‌పై దాడి చేశారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. 2013లో కర్ణాటక, బీదర్‌లో జరిగిన ఓ ర్యాలీలో అనుమతి లేకుండా గన్ పట్టుకొచ్చారని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు.
కుటుంబ నేపథ్యం
ఎంఐఎం వ్యవస్థాపక అధినేత సుల్తాన్ సలావుద్దిన్ ఒవైసీ-నజమున్నీసాల తనయుడైన అసుదుద్దీన్ ఒవైసీ... 1969 మే 13న హైదరాబాద్‌లో జన్మించారు. ఇక్కడే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ పూర్తి చేశారు. అనంతరం లండన్‌లో న్యాయవాద విద్యను అభ్యసించారు. అనంతరం న్యాయవాదిగా వృత్తిని కొనసాగిస్తూ తండ్రిప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చారు. 1996లో ఫర్హీన్‌ను వివాహం చేసుకున్న ఒవైసీకి ఆరుగురు సంతానం. ఒక కుమారుడు, ఐదుగురు కూతుర్లు. రాజకీయ నాయకుడుగానే కాకుండా ఒవైసీ ఆసుపత్రి, వైద్య కళాశాల అధిపతిగా కొనసాగుతున్నారు. ముస్లింలు, దళితుల రిజర్వేషన్ల కోసం పోరాడే ఒవైసీ.. తాను హిందుత్వానికి వ్యతిరేకమని కానీ హిందువులకు కాదని చెబుతుంటారు. ఒవైసీని అందరూ అసద్ భాయ్ అని పిలుస్తుంటారు.
సోదరుడు సగం బలం..
దూకుడు స్వభావంతో సోదరుడు అక్భరుద్దీన్.. ఇరకాటంలో పడేసినా.. అసద్ బలం మాత్రం ఆయనే. ఎంఐఎంలో నెంబర్ టూ పొజిషన్‌గా కొనసాగుతున్న అక్బర్.. అవసరానికి అనుగుణంగా రాజకీయాలు...చేయడంలో దిట్ట. ఎన్నికలు వచ్చాయంటే చాలు పార్టీకి ఆయనే స్టార్ క్యాంపెయినర్. ఇటు పార్టీ క్యాడర్‌లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు. అందుకే అక్బర్ మాటంటే పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వేదవాక్కు. 1999, 2004, 2009, 2014 .. ఇలా వరుసగా... చాంద్రాయణ గుట్ట నుంచి పోటీ చేసి నాలుగు సార్లు అక్భర్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
- శివ ఉప్పల
Comments
Please login to add a commentAdd a comment