తృణమూల్ ప్రభంజనం
కోల్‌కతా: మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్‌లో కామ్రేడ్ల కంచుకోటలను నేలమట్టం చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి పూర్తిస్థాయిలో సత్తా చాటి రాష్ట్రంలోని మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో 34 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రస్తుత లోక్‌సభలో 19 సీట్లున్న తృణమూల్ వామపక్షాల ఖాతాలోని మొత్తం 15 సీట్లనూ కొల్లగొట్టి తన బలాన్ని 34కు చేర్చింది. సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్‌ఫ్రంట్ రాష్ట్రంలో ఈసారి గతంలో ఎన్నడూలేనంత ఘోరంగా దెబ్బతిని కాంగ్రెస్ ఖాతాలోని రెండే స్థానాల్లో(రాయ్‌గంజ్, ముర్షీదాబాద్) గెలిచింది. శారదా చిట్ స్కాంపై సాగిన వ్యతిరేక ప్రచారాన్ని తట్టుకుని ‘దీదీ’ పార్టీ 2011 అసెంబ్లీ ఎన్నిక ల నాటి తన చారిత్రక విజయాన్ని పునరావృతం చేసింది. తనకు పట్టున్న దక్షిణ బెంగాల్లోని 31 సీట్లలో 30 సీట్లను కొల్లగొట్టి, లెఫ్ట్ స్థావరమైన ఉత్తర బెంగాల్లోకి దూసుకుపోయి వామపక్షాలను దాదాపుగా తుడుచిపెట్టేసింది. కాగా, 2009లో ఆరు స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ ఈసారి వాటిలో నాలుగింటిని కాపాడుకోగలింది.