న్యూఢిల్లీ: రాజధానిలోని ఏడు లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 10 జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొత్తం 206 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. శనివారంతో నామినేషన్ల గడువు ముగిసే సరికి 206 మంది నామినేషన్లు స్వీకరించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
కపిల్ సిబల్, హర్షవర్ధన్, రాజ్‌మోహన్ గాంధీ వంటి ప్రముఖులు బరిలో నిలిచిన ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో అన్ని పార్టీల నుంచి నువ్వా-నేనా అనే స్థాయిలోనే అభ్యర్థులు బరిలోకి దిగారని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఏ నియోజకవర్గంలో కూడా ఏ పార్టీ గెలుపు ఖాయమని చేప్పేందుకు వీలులేకుండా అభ్యర్థుల జాబితా కనిపిస్తోందన్నారు.
బీజేపీ నేతలు హర్షవర్ధన్, మీనాక్షి లేఖీ, కాంగ్రెస్ నేతలు అజయ్ మాకెన్, ఆప్ నేతలు అశుతోష్, రాజ్‌మోహన్ గాంధీ వంటి ప్రముఖుల గెలుపు కొంతవరకు ఖాయంగానే కనిపిస్తున్నా ఢిల్లీ ఓటరు ఎప్పుడూ ఊహించని రీతిలో తీర్పునిస్తున్నాడని చెబుతున్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో 221 మంది నామినేషన్లు వేసినప్పటికీ ఉపసంహరణ తర్వాత 160 మంది మాత్రమే బరిలో నిలిచారని, ఈసారి కూడా ఉపసంహరణ తర్వాత అసలైన అభ్యర్థుల సంఖ్య ఖరారవుతుందని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు.
భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీ, మరో నటుడు విశ్వజీత్ చటర్జీ, సిట్టింగ్ ఎంపీ కృష్ణాతీరథ్, రమేశ్ కుమార్ వంటి ప్రముఖులు కూడా ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు.
ఇక తృణముల్ కాంగ్రెస్ కూడా ఢిల్లీలో సత్తాచాటాలని పరితపిస్తోంది. ఈ పార్టీ అభ్యర్థులు చివరిరోజైన శనివారం నామినేషన్లు వేశారు. ఈశాన్య ఢిల్లీ నుంచి బరిలోకి దిగుతున్న భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీకి సిట్టింగ్ ఎంపీ జైప్రకాశ్ అగర్వాల్, ఆప్ నేత ఆనంద్‌కుమార్‌ల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముందంటున్నారు.
ఇక కేంద్ర మంత్రి కృష్ణాతీరథ్‌కు కూడా ఆప్ నేత రాఖీ బిర్లా, బీజేపీ నుంచి నామినేషన్ వేసిన ఉదిత్‌రాజ్ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. ఇక తృణముల్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న విశ్వజీత్ చటర్జీకి కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ అజయ్ మాకెన్, బీజేపీ నేత మీనాక్షి లేఖీ, ఆప్ నేత ఆశిష్ కేతన్ నుంచి పోటీ ఎదురుకానుంది.
ఇలా ఏడు నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల బలాబలాలు పోటాపోటీగా ఉన్నాయని చెబుతున్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్నవారికి స్థానికంగా హర్షవర్ధన్‌కు ఉన్న మంచిపేరు, ప్రధాని అభ్యర్థిగా మోడీ చరిష్మా కలిసివచ్చే అంశంకాగా ఆమ్ ఆద్మీ పార్టీకి అరవింద్ కేజ్రీవాల్ ఉద్యమాలు, 49 రోజుల పాలనలో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆప్ అభ్యర్థుల విజయానికి అనుకూలాంశాలుగా చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రం పార్టీ పేరుమీదే గెలుస్తామని చెబుతున్నారు.
ఏడు స్థానాలకు 206 నామినేషన్లు
Published Sun, Mar 23 2014 10:21 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement