‘నారద’ కేసు సీబీఐకి
3 రోజుల్లో ప్రాథమిక విచారణ పూర్తి చేయాలి: కలకత్తా హైకోర్టు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్ర హైకోర్టు షాకిచ్చింది. పలువురు తృణమూల్ కాంగ్రెస్ నేతలు ముడుపులు తీసుకుంటూ నారద న్యూస్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిన వ్యవహారంలో ప్రాథమిక విచారణ చేయాలని కలకత్తా హైకోర్టు శుక్రవారం సీబీఐని ఆదేశించింది. స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని, వస్తువులను 24 గంటల్లో స్వాధీనం చేసుకోవాలని, 72 గంటల్లో ప్రాథమిక విచారణ పూర్తి చేయాలని ధర్మాసనం సీబీఐని ఆదేశించింది. ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత అవసరమైతే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, తర్వాత దర్యాప్తు కొనసాగించాలని పేర్కొంది.
ప్రముఖుల ప్రవర్తన ఇతరులు వేలెత్తి చూపేలా ఉండకూడదని, అవినీతి ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తోందని జస్టిస్ చక్రవర్తి పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాన్ని సుప్రీం కోర్టులో సవాలు చేస్తామని సీఎం మమత చెప్పారు. గతేడాది పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు నారద స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోలను పలు వార్తా చానళ్లు ప్రసారం చేశాయి. మొదట ఈ వీడియోలు ‘నారదన్యూస్.కామ్’లో ప్రసారమయ్యాయి. దీనిలో కొందరు నేతలు డబ్బులు తీసుకుంటున్నట్లుగా దృశ్యాలు ఉన్నాయి. కాగా, ఇవి ట్యాంపర్ చేసిన టేపులు కావని చండీగఢ్‌లోని సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబొరెటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్) ఇచ్చిన నివేదికను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో మంత్రులు, ఎంపీలు, సీనియర్ నేతలు ఉన్నందువల్ల రాష్ట్ర సంస్థలు కాకుండా సీబీఐ అయితేనే స్వతంత్రంగా దర్యాప్తు నిర్వహించగలదని కోర్టు పేర్కొంది.
స్టింగ్ ఆపరేషన్ బూటకం: మమత
హైకోర్టు ఆదేశం దురదృష్టకరమని, దీన్ని రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటామని మమత చెప్పారు. ‘స్టింగ్ ఆపరేషన్ నాటకం. వీడియోను బీజేపీ కార్యాలయంలో విడుదల చేశారు’ అని అన్నారు. ఆపరేషన్‌లో లంచం తీసుకుంటూ కనిపించిన టీఎంసీ ఎంపీలపై చర్యలు తీసుకోవాలని వామపక్షాలు లోక్‌సభలో డిమాండ్ చేశాయి. దర్యాప్తు పరిధిలోకి సీఎంను తేవాలనే డిమాండ్‌తో లెఫ్ట్ ఫ్రంట్ పార్టీలు కోల్‌కతా భారీ ర్యాలీ నిర్వహించాయి.