కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనుబ్రతా మోండల్‌ను సీబీఐ అరెస్ట్ చేయడంతో రాజకీయవర్గాల్లో కలకలం రేగింది. టీఎంసీ నేతలు వరుసగా అరెస్టవుతుండడం చర్చనీయాంశంగా మారింది. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన మోండల్ సీబీఐ వలలో చిక్కుకోవడంతో ఆయన గురించి తెలుసుకోవడానికి జనం ఆసక్తి చూపిస్తున్నారు.
ఎవరీ అనుబ్రతా మోండల్?
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బీర్భమ్ జిల్లా అధ్యక్షుడిగా అనుబ్రతా మోండల్ ఉన్నారు. 61 ఏళ్ల మోండల్ బీర్భమ్ జిల్లాలో మంచి పట్టున్న రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఈ ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలకు గానూ పదింటిని టీఎంసీ కైవసం చేసుకుందంటే ఈ జిల్లాలో ఆయన సత్తా ఏంటో తెలుస్తోంది. మమతా బెనర్జీకి వీర విధేయుడైన మోండల్ టీఎంసీ జాతీయ వర్కింగ్ కమిటీలోనూ స్థానం దక్కించుకున్నారు.
పోటీకి దూరంగా.. వివాదాలకు దగ్గరగా..
మూడు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ అనుబ్రతా మోండల్ ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. తెర వెనుక నుంచి చక్రం తిప్పడానికే ఇష్టపడే ఆయన టీఎంసీ కీలక వ్యూహకర్తలో ఒకరిగా గుర్తింపు పొందారు. వివాదాలు ఆయనకు కొత్త కాదు. చాలా సందర్భాల్లో రెచ్చగొట్ట ప్రకటనలతో వివాదాల్లో చిక్కుకున్నారు. ఓ సందర్భంలో పోలీసులపై బాంబులు వేయాలని టీఎంసీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. చాలా మంది రౌడీషీటర్లకు ఆయన ఆశ్రయం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. బీర్భూమ్ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు, రాళ్ల తవ్వకాలు, పశువుల అక్రమ రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలతో ఆయనకు సంబంధాలున్నట్లు సమాచారం. అంతేకాదు ప్రతిపక్ష నేతలను బెదిరించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు.
ఆక్సిజన్ సిలిండర్ వెంట ఉండాల్సిందే..
బెంగాల్ ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండ కేసులో మోండల్‌ను ప్రశ్నించేందుకు గతంలో సీబీఐ సమన్లు పంపింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం అంగీకరించింది. హైపోక్సియా(ఆక్సిజన్ కొరత) రుగ్మతతో బాధపడుతున్న ఆయన ఆక్సిజన్ సిలిండర్‌ను తన వెంట తీసుకెళుతుంటారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఆస్పత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం హాస్పిటల్ వైద్యులు చెప్పడంతో మోండల్‌ను సీబీఐ తాజాగా అరెస్ట్ చేసింది. (క్లిక్: సీబీఐ ఉచ్చులో టీఎంసీ అగ్రనేత)
Comments
Please login to add a commentAdd a comment