Birbhum district
-
బొగ్గు గనిలో పేలుడు..ఏడుగురి మృతి
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లోని బీర్భుమ్ జిల్లాలోని ఓ బొగ్గుగనిలో పేలుడు సంభవించింది. సోమవారం(అక్టోబర్7) జరిగిన ఈ పేలుడులో ఏడుగురు చనిపోగా పలువురు గాయపడ్డారు. గంగారామ్‌చక్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన గనిలో బొగ్గు వెలికితీసేందుకుగాను బాంబులు పెడుతుండగా పేలుడు సంభవించింది.పేలుడు తర్వాత గని ప్రదేశంలో మృతదేహాలు చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. గని వద్ద నిలిపి ఉంచిన వాహనాలు పేలుడు ధాటికి ధ్వంసమయ్యాయి. ఇదీ చదవండి: పండుగల వేళ ఢిల్లీలో హై అలర్ట్ -
బెంగాల్ రాజకీయాల్లో కలకలం.. ఎవరీ అనుబ్రతా మోండల్?
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనుబ్రతా మోండల్‌ను సీబీఐ అరెస్ట్ చేయడంతో రాజకీయవర్గాల్లో కలకలం రేగింది. టీఎంసీ నేతలు వరుసగా అరెస్టవుతుండడం చర్చనీయాంశంగా మారింది. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన మోండల్ సీబీఐ వలలో చిక్కుకోవడంతో ఆయన గురించి తెలుసుకోవడానికి జనం ఆసక్తి చూపిస్తున్నారు. ఎవరీ అనుబ్రతా మోండల్? తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బీర్భమ్ జిల్లా అధ్యక్షుడిగా అనుబ్రతా మోండల్ ఉన్నారు. 61 ఏళ్ల మోండల్ బీర్భమ్ జిల్లాలో మంచి పట్టున్న రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఈ ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలకు గానూ పదింటిని టీఎంసీ కైవసం చేసుకుందంటే ఈ జిల్లాలో ఆయన సత్తా ఏంటో తెలుస్తోంది. మమతా బెనర్జీకి వీర విధేయుడైన మోండల్ టీఎంసీ జాతీయ వర్కింగ్ కమిటీలోనూ స్థానం దక్కించుకున్నారు. పోటీకి దూరంగా.. వివాదాలకు దగ్గరగా.. మూడు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ అనుబ్రతా మోండల్ ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. తెర వెనుక నుంచి చక్రం తిప్పడానికే ఇష్టపడే ఆయన టీఎంసీ కీలక వ్యూహకర్తలో ఒకరిగా గుర్తింపు పొందారు. వివాదాలు ఆయనకు కొత్త కాదు. చాలా సందర్భాల్లో రెచ్చగొట్ట ప్రకటనలతో వివాదాల్లో చిక్కుకున్నారు. ఓ సందర్భంలో పోలీసులపై బాంబులు వేయాలని టీఎంసీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. చాలా మంది రౌడీషీటర్లకు ఆయన ఆశ్రయం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. బీర్భూమ్ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు, రాళ్ల తవ్వకాలు, పశువుల అక్రమ రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలతో ఆయనకు సంబంధాలున్నట్లు సమాచారం. అంతేకాదు ప్రతిపక్ష నేతలను బెదిరించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆక్సిజన్ సిలిండర్ వెంట ఉండాల్సిందే.. బెంగాల్ ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండ కేసులో మోండల్‌ను ప్రశ్నించేందుకు గతంలో సీబీఐ సమన్లు పంపింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం అంగీకరించింది. హైపోక్సియా(ఆక్సిజన్ కొరత) రుగ్మతతో బాధపడుతున్న ఆయన ఆక్సిజన్ సిలిండర్‌ను తన వెంట తీసుకెళుతుంటారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఆస్పత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం హాస్పిటల్ వైద్యులు చెప్పడంతో మోండల్‌ను సీబీఐ తాజాగా అరెస్ట్ చేసింది. (క్లిక్: సీబీఐ ఉచ్చులో టీఎంసీ అగ్రనేత) -
మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. సీబీఐ ఉచ్చులో టీఎంసీ అగ్రనేత
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కేబినెట్లో మంత్రిగా పనిచేసిన పార్థ చటర్జీ ఈడీ కేసులో ఇరుక్కుని జైలుకెళ్లగా.. తాజాగా మరో అగ్రనేత సీబీఐకి చిక్కారు. మమతకు అత్యంత సన్నిహితుడైన బీర్భూమ్ జిల్లా టీఎంసీ అధ్యక్షుడు అనుబ్రతా మోండల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. 2020 పశువుల అక్రమ రవాణా కేసులో ఆయనను అదుపులోకి తీసుకుంది. బీర్భూమ్ జిల్లాలోని తన నివాసంలో అనుబ్రతా మోండల్‌ను గురువారం సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనను అరెస్ట్ చేస్తున్నారన్న సమాచారంతో టీఎంసీ కార్యకర్తలు, మోండల్ మద్దతుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరీ చెదరగొట్టి మోండల్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తమ ఎదుట హాజరుకావాలని 10 పర్యాయాలు సమన్లు పంపినా అనారోగ్య కారణాలతో ఆయన రాలేదని సీబీఐ వెల్లడించింది. కేసు దర్యాప్తులో భాగంగా గతంలో రెండు సార్లు ఆయనను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఏంటీ కేసు? 2020లో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత పశువుల స్మగ్లింగ్ కుంభకోణం కేసులో అనుబ్రతా మోండల్ పేరు తెరపైకి వచ్చింది. సీబీఐ నివేదిక ప్రకారం.. 2015, 2017 మధ్య కాలంలో 20,000 పశువుల తలలను సరిహద్దు భద్రతా దళం స్వాధీనం చేసుకుంది. దీంతో పశువుల అక్రమ రవాణా స్కామ్ వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో భాగంగా ఇటీవల కాలంలో బీర్భూమ్ జిల్లాలో పలుచోట్ల సీబీఐ సోదాలు జరిపింది. మోండల్ అంగరక్షకుడు సైగల్ హొస్సేన్‌ను కూడా దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. (క్లిక్: ఐటీ దాడులు.. డబ్బులు లెక్కించడానికి 13 గంటలు) -
బేల్దార్.. దాదా! తాపీ పని చేసే వ్యక్తి తాపీగా హత్యలు చేసే స్థాయికి..
తాపీ పని చేసే వ్యక్తి తాపీగా హత్యలు చేసే స్థాయికి ఎదగడం సినిమాల్లో చూశాం! బీర్భూమ్ ప్రధాన నిందితుడు అనరుల్ హుస్సేన్ కథ కూడా అలాంటిదే! చిన్న గుడిసెలో ఉండే బేల్దార్ అనరుల్ మూడంతస్తుల భవనంలో ఉండే దాదాగా మారిన తీరు అనూహ్యం. తానుండే ప్రాంతంలో చాలామందికి అనరుల్ ఒక దైవదూత. కానీ ఈ దైవదూత వెనుక చీకటి కోణాలు అనేకం. సజీవ దహనం కేసులో సీబీఐ అరెస్టు చేసేవరకు అనరుల్‌ను తాకడానికి స్థానిక పోలీసులు కూడా భయపడేవారు. ఆ ప్రాంతానికి అతను మకుటం లేని మహారాజు. చిన్నతనంలో తండ్రితో కలిసి అనరుల్ తాపీ పనులకు వచ్చేవాడని, తర్వాత మేస్త్రీగా ఎదిగాడని స్థానికులు గుర్తు చేసుకుంటారు. అప్పటినుంచే ఏదో సాధించాలన్న కసి అతనిలో ఉండేదని అనరుల్ చిన్నప్పటి స్నేహితుడు స్వపన్ మండల్ చెప్పారు. లక్ష్యసాధన కోసం తొలుత అన్రుల్ కాంగ్రెస్‌లో చేరాడు. అనంతరం మమత నేతృత్వంలోని టీఎంసీలోకి వచ్చి రామ్‌పుర్హాత్ బ్లాక్1 ప్రెసిడెంట్ అయ్యాడు. సజీవ దహనం కేసు దర్యాప్తునకు పోలీసులు బోగ్తుయ్ ఊర్లోకి రాకుండా అనరుల్ అడ్డుకున్నాడంటే అతని పరపతి అర్థం చేసుకోవచ్చు. వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు పడిపోయినట్లు చివరకు సీబీఐ చేతికి చిక్కాడు. అవినీతి సోపానాలు అనరుల్ హుస్సేన్ ఎదుగుదల వెనుక అవినీతి, అక్రమాలున్నాయని, స్థానికంగా నర్సరీ నడిపే కార్తీక్ మండల్ చెప్పారు. పలు సంవత్సరాలుగా అనరుల్ అక్రమ సంపాదన కొనసాగిందన్నారు. ‘‘ఆయన ఇల్లు చూడండి. ఒక మేస్త్రీ ఇల్లులాగా ఉందా అది? గడిచిన రెండు దశాబ్దాల్లో అతను ఇంత శక్తిని, ఆస్తిని కూడబెట్టాడు. నిజాయితీపరుడెవరూ స్వల్పకాలంలో ఇంత కూడబెట్టలేడు’’ అని కార్తీక్ వ్యాఖ్యానించారు. తన స్థలాన్ని కబ్జా చేసి మరీ అనరుల్ ఇల్లు కట్టాడని ఆరోపించారు. స్థానిక ఎంఎల్ఏ, అసెంబ్లీ డిప్యుటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీకి హుస్సేన్ చాలా ఆప్తుడని పుకార్లున్నాయి. మంచి పనివంతుడని అనరుల్‌కు పార్టీలో పేరుందని స్థానిక నాయకులు చెప్పారు. 2011లో టీఎంసీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి అనరుల్‌కు అడ్డం లేకుండా పోయింది. ఇసుక అక్రమ తవ్వకాలు, స్థానిక సిండికేట్ నిర్వహణ తదితరాల్లో అనరుల్ హస్తం ఉంది. 2019లో అతన్ని బ్లాక్ ప్రెసిడెంట్‌గా తొలగించాలని స్థానిక నేత భావించినా, ఎంఎల్ఏ అండతో గండం తప్పించుకున్నాడు. ఈర్ష్యతో ఆరోపణలు తన తండ్రి ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అనరుల్ కుమార్తె ముంతాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కోరిన పనల్లా ఆయన చేశాడని, అందుకు ప్రతిగా ఆయనపై బురదజల్లుతున్నారని ఆమె ఆవేదన చెందా రు. అయితే అనరుల్ లాంటివాళ్లు టీఎంసీలో చాలా మంది ఉన్నారని, ప్రస్తుతం ఇతనొక్కడే బయటపడ్డాడని బీజేపీ నేతలు ఆరోపించారు. ఆశిష్ కింద చాలామంది అనరుల్ హుస్సేన్ లాంటి వాళ్లున్నారన్నారు. టీఎంసీ పాలనలో ఇలాంటి బాహుబలులు చాలామంది పుట్టుకువచ్చారని దుయ్యబట్టారు. వీరంతా స్థానిక సామంతరాజులని విమర్శించారు. ప్రస్తుతం అనరుల్‌ను పోలీసు కస్టడీలో ఉంచారు. ఇకపై ఆయన్ను సీబీఐ విచారించనుంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
Birbhum Violence: బీర్భూమ్ హత్యాకాండ.. 21 మందిపై ఎఫ్ఐఆర్
రామ్పుర్హత్: బీర్భూమ్ హత్యాకాండపై విచారణకు 30 మంది సభ్యుల సీబీఐ బృందం ఘటనాస్థలికి చేరుకుంది. సజీవదహనాలపై విచారణ ఆరంభించింది. విచారణ అనంతరం ఎఫ్ఐఆర్లో 21 మంది నిందితుల పేర్లను సీబీఐ నమోదు చేసింది. స్థానిక నేత హత్యకు ప్రతీకారంగా సజీవదహన ఘటన జరిగిఉండవచ్చని అంచనా వేసిది. మరో 70– 80 మంది గుంపునకు ఈ సంఘటనతో సంబంధం ఉందని భావిస్తున్నట్లు తెలిపింది. డెడ్‌లైన్ లోపు విచారణ పూర్తి చేసి కోర్టుకు నివేదిక అందించాల్సిఉన్నందున సమయం వృథా చేయమని సీబీఐ అధికారులు చెప్పారు. డీఐజీ అఖిలేశ్ సింగ్ ఆధ్వర్యంలో వచ్చిన సీబీఐ అధికారులు మూడు బృందాలుగా విడిపోయి విచారణ జరుపుతున్నారు. బోగ్తాయ్ గ్రామంలో అధికారులు దాదాపు ఐదుగంటలు గడిపారు. ఘటనా స్థలాన్ని నిశితంగా పరిశీలించి ఆధారాల కోసం అన్వేషించారు. తాము జరిపే విచారణను వీడియో తీయడంతో పాటు తమతో ఒక ఫోరెన్సిక్ నిపుణుడిని కూడా సీబీఐ అధికారులు వెంటపెట్టుకుతిరుగుతున్నారు. మరికొందరు అధికారులు పోలీసుస్టేషన్లో కేసు డైరీని అధ్యయనం చేశారు. బోగ్తాయ్‌లో శ్మశాన నిశబ్దం బోగ్తాయ్: సజీవదహనం జరిగిన బెంగాల్‌లోని బోగ్తాయ్ గ్రామంలో శ్మశాన నిశబ్దం తాండవిస్తోంది. గ్రామస్తులు చాలామంది ఊరువిడిచి పొరుగు గ్రామాలకు పారిపోయారు. స్థానిక టీఎంసీ నేత భాదు షేక్ హత్య, అనంతర హింసాకాండతో గ్రామస్తులు భీతిల్లిపోతున్నారు. ఈ ఘటనలు కొనసాగవచ్చని భయపడుతున్నారు. దీంతో చాలామంది పెళ్లాంబిడ్డలతో కలిసి బంధువుల ఊర్లకు పారిపోయారు. గ్రామాన్ని సందర్శించిన జర్నలిస్టులకు తాళం వేసిన గృహాలు స్వాగతమిచ్చాయి. కొందరు వృద్ధ మహిళలు, పెద్దవారు మాత్రమే ఊర్లో కనిపించారు. యువకులంతా భయంతో గ్రామం విడిచిపోయారన్నారు. సీబీఐ విచారణ పూర్తయితే నిజానిజాలు బయటపడతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. -
సజీవదహనం వెనుక కుట్రకోణం
బీర్భూమ్ (పశ్చిమబెంగాల్): పశ్చిమబెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో ఎనిమిది మంది నిండు ప్రాణాలను బలితీసుకున్న హింసాత్మక గృహదహనాలు జరిగిన రామ్‌పూర్‌హట్ గ్రామాన్ని గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సందర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆధునిక బెంగాల్లో ఇలాంటి అనాగరిక ఘటనలు జరుగుతాయని ఎప్పుడూ ఊహించలేదని అన్నారు. మీ కుటుంబ సభ్యులు మరణిస్తే, నా గుండె పిండేసినట్టుందని భావోద్వేగంతో మాట్లాడారు. ఈ ఘటన వెనుకాల భారీ కుట్ర ఉందన్న మమత ఈ కేసులో తృణమూల్ కాంగ్రెస్ నేతల ప్రమేయం ఉంటే వెంటనే అరెస్ట్‌లు చేయాలని ఆదేశించారు. రామ్‌పూర్‌హట్ మారణకాండకు బాధ్యులైన వారిని విడిచిపెట్టమన్న మమత ఈ ఘటనని అడ్డుకోలేకపోయిన పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా ఎస్పీని ఆదేశించారు. మరోవైపు మృతుల పోస్టుమార్టమ్ నివేదికలో సంచలన వాస్తవాలు బయటపడ్డాయి. ఆ ఎనిమిది మందిని సజీవంగా దహనం చేయడానికి ముందు వారిని బాగా చితక బాదినట్టుగా పోస్టుమార్టమ్ నివేదిక వెల్లడించింది. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు బాద్ షేక్ హత్యకి ప్రతీకారంగా మార్చి 21న పలు ఇళ్లకు నిప్పటించి తగుల బెట్టిన ఘటనలో ఎనిమిది కాలిన మృతదేహాలు బయటపడ్డాయి. వీరిలో ఇద్దరు పిల్లలు, ముగ్గురు మహిళలు ఉన్నారు. మమతా బెనర్జీ బాధితుల్ని పరామర్శించిన వెంటనే గృహదహనాల వెనుక హస్తం ఉందని అనుమానిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు అనిరుల్ హుస్సేన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.మరోవైపు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి, రాష్ట్ర డీజీపీకి నోటీసులు పంపింది. నాలుగు వారాల్లోగా దీనిపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ ఘటన వెనుకనున్న వాస్తవాలను వెలికి తీయడానికి బీజేపీకి చెందిన కేంద్ర కమిటీలో గ్రామంలో పర్యటిస్తోంది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. -
సొంత ఊరిపై మమకారం
కోల్‌కతా: ఢిల్లీలో చక్రం తిప్పిన ప్రణబ్ ముఖర్జీ సొంతూరితో ఉన్న అనుబంధాన్ని మాత్రం ఎన్నడూ మరువలేదు. పశ్చిమ బెంగాల్‌లోని బీర్బూమ్ జిల్లాలోని మిరాటి గ్రామంలో ప్రణబ్ పుట్టారు. మిరాటిలోని మట్టిరోడ్ల నుంచి రాజకీయ పండితుడి దాకా...అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్ దాకా ఆయన ప్రస్థానం కొనసాగినా సొంతూరితో ఉన్న అనుబంధం మరింత బలపడిందే తప్ప తరిగిపోలేదు. ఆయన ఎక్కడ ఉన్నా ఏటా దుర్గాపూజ సమయంలో మాత్రం సొంతూళ్లోనే ఉంటారు. ధోతి, కండువాతో సంప్రదాయ వస్త్రధారణలో ఆయన దుర్గాదేవికి హారతి ఇస్తారు. గత ఏడాది కూడా ప్రణబ్ దసరా సమయంలో అక్కడే గడిపారు. అయితే, చాలా ఏళ్ల తర్వాత ఈసారి ఆ గ్రామం ఆయన లేకుండానే దుర్గా పూజను జరుపుకోనుంది. ఆయన మరణంతో ఈ గ్రామం మూగబోయింది. ఆయన సీనియర్ మంత్రి అయినా లేక రాష్ట్రపతి అయినా ఈ గ్రామ ప్రజలకు మాత్రం ప్రణబ్ దానే. ఢిల్లీ నుంచి ఫోన్ చేసేవారు... ఆయన ఇంట్లో జరిగే దుర్గాపూజ మా గ్రామంలో జరిగే అతిపెద్ద పండుగ. ఈ పర్వదినాల్లో ఐదురోజుల పాటు ఆయన ఇంట్లోనే అందరూ భోజనాలు చేస్తారు. ఇకపై మిరాటిలో జరిగే దుర్గాపూజ మాత్రం మునుపటిలా ఉండదు అని ప్రణబ్ కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన చటోరాజ్ చెప్పారు. ఆయన ఢిల్లీ నుంచి ఫోన్ చేసి అన్ని సవ్యంగా జరుగుతున్నాయా లేదా అని అడిగేవారు. ప్రణబ్ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి గ్రామస్తులంతా ఆయన త్వరగా కోలుకోవాలని పూజలు చేశారు. ప్రణబ్ వెంటిలేటర్‌పై చికిత్స తీసుకునేముందు తన గ్రామం నుంచి పనసపండు తీసుకురమ్మని చెప్పారని ఆయన కొడుకు అభిజిత్ ముఖర్జీ ఇటీవల చెప్పారు. తాను ఆగస్టు 3న కోల్‌కతా నుంచి మిరాటికి వెళ్లి 25 కిలోల పనసపండును రైల్లో ఢిల్లీకి తీసుకెళ్లానన్నారు. ప్రణబ్ ఎంతో ఇష్టంగా ఆ పండును తిన్నారని పేర్కొన్నారు. -
కలకలం; బీజేపీ నాయకుడి కూతురు కిడ్నాప్!
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో బీజేపీ నాయకుడి కూతురు కిడ్నాప్ అవడం కలకలం రేపుతోంది. ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని దుండగులు ఆమెను అపహరించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వివరాలు.... లబ్ధ్పూర్కు చెందిన సుప్రభాత్ బత్యబయాల్ గురువారం రాత్రి ఓ సమావేశం నిమిత్తం బయటికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన కూతురితో పాటు సుప్రభాత్ సోదరుడు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఈ క్రమంలో ఇంట్లోకి వచ్చిన ఐదుగురు ఆగంతకులు సుప్రభాత్ కూతురిని కిడ్నాప్ చేశారు. ఈ విషయం గురించి సుప్రభాత్ సోదరుడు మాట్లాడుతూ... ‘ ఐదుగురు వ్యక్తులు వచ్చారు. మొదట మమ్మల్ని ఇంట్లో బంధించి తాళం వేశారు. ఆ తర్వాత కాసేపటికి ఇంట్లో చొరబడి తుపాకీతో బెదిరించి నా సోదరుడి కూతురిని లాక్కెళ్లారు. కార్లో ఎక్కించుకుని పరారయ్యారు’ అని పేర్కొన్నారు. కాగా ఐదు నెలల క్రితమే సుప్రభాత్ అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయన కూతురు కిడ్నాప్ అవడంతో లబ్ధ్పూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన స్థానికులు పోలీసు స్టేషను ఎదుట నిరసనకు దిగారు. ఇక ఈ విషయంలో రాజకీయ నాయకుల ప్రమేయం లేదని భావిస్తున్నట్లు బీర్భూమ్ జిల్లా ఎస్పీ శ్యామ్ సింగ్ తెలిపారు. అలా అని ఈ విషయాన్ని పూర్తిగా కొట్టి పారేయలేమని పేర్కొన్నారు. త్వరలోనే బాధితురాలి ఆచూకీ కనుగొంటామని హామీ ఇవ్వడంతో పరిస్థితి కుదుటపడింది. -
రేపిస్టుకు 20 ఏళ్ల జైలు
సూరి: నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడొకరికి పశ్చిమబెంగాల్ లోని స్థానిక న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. నందన్ సాహా గతేడాది ఆగస్టు 6న బిర్భుం జిల్లా నానూర్ లోని కిర్నార్హర్ గ్రామంలో నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను ఎత్తుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ కేసులో దోషిగా తేలడంతో అతడికి అడిషినల్ సెషన్స్ జడ్జి మహానంద దాస్ 20 ఏళ్ల జైలుశిక్ష విధించారు. రూ.20వేలు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.