‘మహిళ’ పర్వం!
* జాతీయ రాజకీయాల్లో కొత్త కూటమికి తెరలేస్తోందా?
* మమతతో జయ ఫోన్ సంభాషణ
* దాంతో జోరందుకున్న రాజకీయ ఊహాగానాలు
* నిర్ణాయక శక్తిగా జయ-మమత-మాయా త్రయం!
కోల్‌కతా: భారత రాజకీయ యవనికపై స్త్రీ పర్వానికి తెర లేవనుందా? విప్లవ నాయకి జయలలిత, బెంగాలీ అగ్గిబరాటా మమతా బెనర్జీ, అణగారిన సామాజిక వర్గాల్లో తిరుగులేని మాయావతి అందుకు నేతృత్వం వహించనున్నారా? రానున్న లోక్‌సభ ఎన్నికల అనంతరం జాతీయ రాజకీయాల్లో ఈ ముగ్గురు మహిళా నేతలు కీలక పాత్ర పోషించనున్నారా? కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో నిర్ణాయక శక్తిగా మారనున్నారా? ప్రస్తుత రాజకీయ పరిణామాలను చూస్తుంటే ఆ అవకాశాలను తోసిపుచ్చలేమని పరిశీలకులు భావిస్తున్నారు.
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శుక్రవారం ఫోన్ చేసి సంభాషించడం రాజకీయ వర్గాల్లో పలు రకాల చర్చోపచర్చలకు తెర తీసింది. ఎన్నికల తర్వాత జయ ప్రధాని అయ్యే పక్షంలో ఆమెతో కలిసి పని చేయడానికి తనకెలాంటి అభ్యంతరమూ లేదని మమత గురువారం వ్యాఖ్యానించడం తెలిసిందే. ఆ మర్నాడే ఆమెకు అన్నాడీఎంకే అధినేత్రి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది. వారు ఏం ఏం చర్చించిందీ తెలియరాకున్నా, రానున్న లోక్‌సభ ఎన్నికల ప్రస్తావన మాత్రం ప్రముఖంగా వచ్చిందని ఇద్దరు నేతల సన్నిహిత వర్గాలు ధ్రువీకరించాయి.
జయ, మమత మధ్య ఎన్నికలకు ముందు పొత్తు వంటిదేమీ ఉండకపోయినా, ఫలితాలు వెల్లడయ్యాక మాత్రం నంబర్ గేమ్‌లో భాగంగా అవసరమైతే వారిద్దరూ ఒక్కటయ్యే అవకాశాలు మెరుగైనట్టేనన్నది ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న రాజకీయ పండితుల అభిప్రాయం. మమతకు బద్ధ శత్రువులైన వామపక్షాలతో జయలలిత తాజాగా తమిళనాట తెగదెంపులు చేసుకోవడం అందుకు మార్గాన్ని మరింత సుగమం చేయగల పరిణామమంటున్నారు. జయతో పాటు బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతితో కలిసి పని చేసేందుకు సిద్ధమేనని మమత చేసిన వ్యాఖ్యల ప్రభావం కూడా జాతీయ రాజకీయాలపై బాగానే ఉండగలదని అంచనా వేస్తున్నారు.
అన్నీ కలిసొస్తే ప్రధాని పీఠమెక్కాలని జయలలిత కొంతకాలంగా ఆశపడుతుండటం, తన ఆకాంక్షను ఇటీవల బాహాటంగానే బయట పెట్టుకుంటుండటం తెలిసిందే. ఆమె ఆకాంక్ష నెరవేరడంలోని సాధ్యాసాధ్యాలను పక్కన పెడితే, జయ-మమత-మాయా త్రయం కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో నిర్ణాయక శక్తిగా మారే అవకాశాలు మాత్రం నానాటికీ ప్రబలమవుతున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో దీదీ చేతిలో ఎదురైన ఘోర పరాభవం నుంచి వామపక్షాలు ఇంకా తేరుకోనేలేదు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాలకు గాను మెజారిటీ సీట్లలో తృణమూల్ హవాయే కొనసాగుతుందని సర్వేలన్నీ ముక్త కంఠంతో ఘోషిస్తున్నాయి. తమిళనాడులోని 39 స్థానాల్లో జయ 20కి అటూ ఇటుగా చేజిక్కించుకునేలా కన్పిస్తున్నారు. యూపీలో కూడా సమాజ్‌వాదీ పాలన పట్ల ప్రజల్లో రాజుకుంటున్న అసంతృప్తి మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి కలిసొస్తుందన్నది రాజకీయ పండితుల అంచనా. ఆ లెక్కన రాష్ట్రంలోని 80 స్థానాల్లో కనీసం 20కి పై చిలుకు బీఎస్పీ ఖాతాలో పడవచ్చంటున్నారు. ఈ అంచనాలన్నీ నిజమైతే సమష్టిగా 60 పై చిలుకు లోక్‌సభ స్థానాలతో ఈ ముగ్గురు నేతలు కింగ్‌మేకర్లుగా అవతరించే అవకాశాలు పుష్కలంగా ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఢిల్లీ బరిలో తృణమూల్
న్యూఢిల్లీ: గాంధేయవాది, సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే నుంచి లభించిన ప్రశంసలు, మద్దతు నేపథ్యంలో ఢిల్లీలో కూడా అదృష్టం పరీక్షించుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నిర్ణయించారు. రానున్న ఎన్నికల్లో అక్కడి ఏడు లోక్‌సభ స్థానాల్లోనూ పోటీ చేయనున్నారు. తృణమూల్ అభ్యర్థుల జాబితాను మార్చి 12న రాంలీలా మైదానంలో జన్‌తంత్ర ర్యాలీ సందర్భంగా అన్నాహజారేతో కలిసి ఆమె ప్రకటించనున్నారు. తృణమూల్ ఎంపీ సుకేందు శేఖర్ రాయ్ శుక్రవారం ఈ మేరకు తెలిపారు. 300 మంది ఆశావహుల నుంచి అన్నా, మమత సంయుక్తంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారని కూడా ఆయన చెప్పారు.