కోల్‌కతా: ‘భయం కారణంగా బెంగాలీలెప్పుడూ తమ తలలను ఇతరుల ఎదుట వంచలేదు. బెంగాలీలను భయపెట్టి ఎవరూ ఇంతవరకు గెలవలేదు..’ అంటూ బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ భార్య, సమాజ్‌వాదీ పార్టీనేత జయా బచ్చన్ పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆదేశాల మేరకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఆమె బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్సీపీ, శివసేన, ఆర్జేడీ, జేఎంఎం వంటి పార్టీలు సైతం టీఎంసీకి మద్దతిచ్చిన సంగతి తెలిసిందే.
మమతా అనుకున్నది సాధిస్తారు..
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురించి జయా బచ్చన్ మాట్లాడారు. మమతా అనుకున్నది సాధిస్తారని ఆమె చెప్పారు. ‘మమతా బెనర్జీ మీద నాకెంతో గౌరవం, ప్రేమ ఉన్నాయి. అన్ని రకాల దాడులకు వ్యతిరేకంగా ఆమె ఒక్కరే పోరాడుతున్నారు. తల పగిలినా, కాలు విరిగినా.. ఆమె గుండె ధైర్యం, మనో నిబ్బరం మాత్రం సడలడంలేదు’ అని వ్యాఖ్యానించారు. ఆమె నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ మమతా తిరిగి గెలుస్తారని అన్నారు.
నా మూలాలు బెంగాల్‌లో..
రాష్ట్రానికి వెలుపల జన్మించినప్పటికీ, తాను బెంగాలీనేనని జయా బచ్చన్ తెలిపారు. పెళ్లికి ముందు వరకూ తన ఇంటి పేరు భాదురి అని చెప్పారు. బెంగాల్ ప్రజాస్వామ్య హక్కుల కోసం మమతా పోరాడుతున్నారని అన్నారు. రవీంధ్రనాధ్ ఠాగూర్ సైతం బెంగాలీలంతా అక్కాచెల్లెళ్లు, అన్నా తమ్ముళ్లని చెప్పారని గుర్తు చేశారు. బెంగాల్ ప్రస్తుతం మహిళలకు సురక్షితంగా ఉందన్నారు. మమతాను అసభ్యపదజాలంతో దూషించిన వారి పై స్పందిస్తూ.. సిగ్గు సిగ్గు.. అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment