సాక్షి, హైదరాబాద్: ‘‘గెలుపు కన్నా ఓటమి నుంచే ఎక్కువగా నేర్చుకుంటాం.. గాంధీజీ సైతం అలాగే ఓటమి నుంచే నేర్చుకున్నారు.. అందుకని ఏ రంగంలోనైనా ఓడిపోతే కుంగిపోకూడదు ’’ అని ఒడిశా హైకోర్ట్ మాజీ చీఫ్ జస్టిస్ ఎస్.మురళీధర్ ఉద్బోధించారు. గాంధీ జయంతి నాడు ప్రముఖుల ప్రసంగాలకు పట్టం కట్టే మంథన్ సంవాద్ వార్షిక చర్చాగోష్టిని నగరంలోని శిల్పకళా వేదికలో సోమవారం నిర్వహించింది.
కార్యక్రమంలో మాజీ చీఫ్ జస్టిస్ మురళీధర్ మాట్లాడుతూ రాజకీయా ల్లోకి రాక పూర్వం న్యాయవాదిగా గాంధీజీ ఎదుర్కొన్న వృత్తిపరమైన ఆటుపోట్లు, దక్షిణాఫ్రికా లో రెండు దశాబ్దాల పాటు న్యాయవాద వృత్తిలో పొందిన అనుభవాలను ప్రస్తావించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ సహనం కోల్పోకుండా, నేర్చుకోవడాన్ని మానకుండా సత్యాన్ని వీడకుండా నిరుపేదలకు అండగా గాంధీజీ న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని కొనసాగించారని గుర్తు చేశారు. నవతరం న్యాయవాదులు గాంధీజీ న్యాయవాద ప్రస్థానం నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు.
ఉపాధికి దోహదం చేయలేని ఆర్ధికాభివృద్ధి: యామినీ అయ్యర్
సిటిజన్ వర్సెస్ లాభార్థి? అంశంపై ఢిల్లీలోని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ అధ్యక్షుడు యామినీ అయ్యర్ మాట్లాడారు. దేశంలో పేర్కొంటున్న ఆర్థికాభివృద్ధి లాభదాయకమైన ఉపాధి అవకా శాలకు, ఉద్యోగాలకు దోహదం చేయలేకపోతోందని అభిప్రాయపడ్డారు. నిజమైన సంక్షేమానికి ఇంకా సరైన నిర్వచనాన్ని వెదికే క్రమంలోనే ఉన్నామన్నారు. ది క్వశ్చన్ ఆఫ్ అకడమిక్ ఫ్రీడమ్ అనే అంశంపై లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌కు చెందిన ప్రొఫెసర్ నీరజా గోపాల్ జయాల్ మాట్లాడుతూ విద్యా సంబంధ స్వేచ్ఛ (అకడమిక్ ఫ్రీడమ్) అనేది మన దేశంలో ఇంకా తగిన స్థాయిలో లేదన్నారు.
సదస్సులో ‘‘వై ఇండిపెండెంట్ న్యూస్ మీడియా షుడ్ త్రైవ్’’ అనే అంశంపై ది న్యూస్ మినిట్ ఎడిటర్ ఇన్ ఛీఫ్ ధన్యా రాజేంద్రన్ మాట్లాడుతూ పారిశ్రామికవేత్త అదానీపై వచ్చిన ఆరోపణల విషయంలో మీడియా పూర్తిస్థాయిలో నిష్పక్షపాత్ర పోషించలేకపోయిందన్నారు. ఫైటింగ్ ది ఫేక్ న్యూస్ పాండమిక్ అనే అంశంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటె మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలో ఫేక్ న్యూస్ ప్రచారం సాగుతోందని ఆరోపించారు. విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ డైరెక్టర్ ఆర్ఘ్యాసేన్‌గుప్తా ‘ది గ్లోబల్ కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా’ అనే అంశంపై మాట్లాడారు. సదస్సులో హిందీ కవి,వ్యంగ్యరచయిత సంపత్ సరళ్ పలు కవితలు,వ్యంగ్యరచనలు వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment