Champions Trophy: అఫ్గానిస్తాన్‌ మళ్లీ అదరగొట్టింది | Champions Trophy: Afghanistan beat England by eight runs | Sakshi
Sakshi News home page

Champions Trophy: అఫ్గానిస్తా న్‌మళ్లీ అదరగొట్టింది

Published Thu, Feb 27 2025 1:31 AM | Last Updated on Thu, Feb 27 2025 1:31 AM

Champions Trophy: Afghanistan beat England by eight runs

ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై 8 పరుగులతో విజయం

ఇబ్రహీమ్‌ జద్రాన్‌ అద్భుత సెంచరీ ∙అజ్మతుల్లాకు 5 వికెట్లు 

జో రూట్‌ శతకం వృథా ∙టోర్నీ నుంచి ఇంగ్లండ్‌ అవుట్‌ 

రెండేళ్ల క్రితం వన్డే వరల్డ్‌ కప్‌లో అఫ్గానిస్తాన్‌ చేతిలో ఇంగ్లండ్‌ ఓటమి పాలైంది. ఆ రోజు అది ఒక సంచలనంగా కనిపించింది. ఇప్పుడు మరో ఐసీసీ టోర్నీలో మళ్లీ చెలరేగిన అఫ్గానిస్తాన్‌ అదే తరహా ఆటతో మళ్లీ ఇంగ్లండ్‌ పని పట్టింది. ఇప్పుడిది సంచలనం కాదు సాధారణమని నిరూపించింది. స్ఫూర్తిదాయక ఆటతో అదరగొట్టిన అఫ్గానిస్తాన్‌ చాంపియన్స్‌ ట్రోఫీలో తమ సెమీఫైనల్‌ ఆశలను సజీవంగా ఉంచుకోగా... వరుసగా రెండో ఓటమితో ఇంగ్లండ్‌ నిష్క్రమించింది.

 చాంపియన్స్‌ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరుతో ఇబ్రహీమ్‌ జద్రాన్‌ తన టీమ్‌కు భారీ స్కోరును అందించగా... బౌలింగ్‌లో ఐదు వికెట్లతో అజ్మతుల్లా టీమ్‌ను నిలబెట్టాడు. ఆరేళ్ల తర్వాత వన్డేల్లో సెంచరీ చేసిన జో రూట్‌ ఎంతో పోరాడినా... విజయానికి 26 బంతుల్లో 39 పరుగులు చేయాల్సిన దశలో అతను అవుటవ్వడం ఇంగ్లండ్‌ ఓటమికి కారణమైంది.   

లాహోర్‌: చాంపియన్స్‌ ట్రోఫీ గ్రూప్‌ ‘బి’లో ఇంకా ఆసక్తికర పోటీ సాగుతోంది. ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికాలతో పాటు ఇప్పుడు అఫ్గానిస్తాన్‌ కూడా సెమీఫైనల్‌ రేసులోకి వచ్చింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ 8 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న అఫ్గానిస్తాన్‌ నిరీ్ణత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగులు సాధించింది.

 ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఇబ్రహీమ్‌ జద్రాన్‌ (146 బంతుల్లో 177; 12 ఫోర్లు, 6 సిక్స్‌లు) భారీ సెంచరీ బాదగా... అజ్మతుల్లా (31 బంతుల్లో 41; 1 ఫోర్, 3 సిక్స్‌లు), మొహమ్మద్‌ నబీ (24 బంతుల్లో 40; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్‌ హష్మతుల్లా (67 బంతుల్లో 40; 3 ఫోర్లు) సహకరించారు. అనంతరం ఇంగ్లండ్‌ 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌటైంది. 

జో రూట్‌ (111 బంతుల్లో 120; 11 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ చేయగా...అఫ్గాన్‌  బౌలర్‌ అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (5/58) ప్రత్యరి్థని దెబ్బ తీశాడు. శుక్రవారం జరిగే తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఆ్రస్టేలియాతో అఫ్గానిస్తాన్‌; శనివారం జరిగే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో ఇంగ్లండ్‌ తలపడతాయి. ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా 3 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉండగా... అఫ్గానిస్తాన్‌ ఖాతాలో 2 పాయింట్లున్నాయి. చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ నెగ్గినా ఆ జట్టుకు రెండు పాయింట్లు మాత్రమే లభిస్తాయి.  

భారీ భాగస్వామ్యాలు... 
ఇంగ్లండ్‌ ఆరంభంలో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో అఫ్గాన్‌ బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. ఇదే ఒత్తిడిలో జట్టు 26 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయింది. ఒకే ఓవర్లో గుర్బాజ్‌ (6), సాదిఖుల్లా (4)లను అవుట్‌ చేసిన ఆర్చర్‌ ఆ తర్వాత రహ్మత్‌ షా (4)ను కూడా వెనక్కి పంపాడు. తొలి 10 ఓవర్లలో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో అఫ్గాన్‌ 39 పరుగులే చేసింది. అయితే ఆ తర్వాతి మూడు భాగస్వామ్యాలు అఫ్గాన్‌ను భారీ స్కోరు దిశగా నడిపించాయి. 

దూకుడైన బ్యాటింగ్‌తో  చెలరేగిన ఇబ్రహీమ్‌ వరుసగా నాలుగు, ఐదు, ఆరో వికెట్‌లకు హష్మతుల్లాతో 103 పరుగులు, అజ్మతుల్లాతో 72 పరుగులు, నబీతో 111 పరుగులు జోడించాడు. ఒవర్టన్‌ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టిన ఇబ్రహీమ్‌...106 బంతుల్లో వన్డేల్లో ఆరో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 40వ ఓవర్‌ తర్వాత అఫ్గాన్‌ బ్యాటింగ్‌ మరింత ధాటిగా సాగింది. ఆర్చర్‌ ఓవర్లో ఇబ్రహీమ్‌ 3 ఫోర్లు, సిక్స్‌ బాదగా... రూట్‌ ఓవర్లో నబీ 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టాడు. మెరుపు ప్రదర్శన చేసిన ఇబ్రహీమ్‌ చివరి ఓవర్‌ తొలి బంతికి అవుటయ్యాడు. ఆఖరి 10 ఓవర్లలో అఫ్గానిస్తాన్‌ 113 పరుగులు సాధించడం విశేషం.  

రూట్‌ మినహా... 
సాల్ట్‌ (12), జేమీ స్మిత్‌ (9) ఆరంభంలోనే వెనుదిరగడంతో భారీ ఛేదనలో ఇంగ్లండ్‌కు సరైన ఆరంభం లభించలేదు. అయితే రూట్, డకెట్‌ (45 బంతుల్లో 38; 4 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. ఈ భాగస్వామ్యం తర్వాత బ్రూక్‌ (25), బట్లర్‌ (42 బంతుల్లో 38; 2 సిక్స్‌లు) కూడా కొద్దిసేపు రూట్‌కు సహకరించారు. అయితే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ సరైన రీతిలో సాగలేదు. రూట్, ఒవర్టన్‌ (28 బంతుల్లో 32; 3 ఫోర్లు) భాగస్వామ్యం కొద్దిగా ఇంగ్లండ్‌ విజయంపై ఆశలు రేపింది. 101 బంతుల్లో రూట్‌ వన్డేల్లో 17వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే చక్కటి బంతితో రూట్‌ను అజ్మతుల్లా బోల్తా కొట్టించిన తర్వాత ఒక్కసారిగా మ్యాచ్‌ అఫ్గాన్‌ వైపు మొగ్గింది.

స్కోరు వివరాలు  
అఫ్గానిస్తాన్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (బి) ఆర్చర్‌ 6; ఇబ్రహీమ్‌ (సి) ఆర్చర్‌ (బి) లివింగ్‌స్టోన్‌ 177; సాదిఖుల్లా (ఎల్బీ) (బి) ఆర్చర్‌ 4; రహ్మత్‌ షా (సి) ఆదిల్‌ రషీద్‌ (బి) ఆర్చర్‌ 4; హష్మతుల్లా (బి) రషీద్‌ 40; అజ్మతుల్లా (సి) (సబ్‌) బాంటన్‌ (బి) ఒవర్టన్‌ 41; నబీ (సి) రూట్‌ (బి) లివింగ్‌స్టోన్‌ 40; గుల్బదిన్‌ (నాటౌట్‌) 1; రషీద్‌ ఖాన్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 325. 
వికెట్ల పతనం: 1–11, 2–15, 3–37, 4–140, 5–212, 6–323, 7–324. 
బౌలింగ్‌: ఆర్చర్‌ 10–0–64–3, మార్క్‌ వుడ్‌ 8–0–50–0, ఒవర్టన్‌ 10–0–72–1, ఆదిల్‌ రషీద్‌ 10–0–60–1, రూట్‌ 7–0–47–0, లివింగ్‌స్టోన్‌ 5–0–28–2.  

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (బి) అజ్మతుల్లా 12; డకెట్‌ (ఎల్బీ) (బి) రషీద్‌ 38; స్మిత్‌ (సి) అజ్మతుల్లా (బి) నబీ 9; రూట్‌ (సి) గుర్బాజ్‌ (బి) అజ్మతుల్లా 120; బ్రూక్‌ (సి అండ్‌ బి) నబీ 25; బట్లర్‌ (సి) రహ్మతుల్లా (బి) అజ్మతుల్లా 38; లివింగ్‌స్టోన్‌ (సి) గుర్బాజ్‌ (బి) గుల్బదిన్‌ 10; ఒవర్టన్‌ (సి) నబీ (బి) అజ్మతుల్లా 32; ఆర్చర్‌ (సి) నబీ (బి) ఫారుఖీ 14; రషీద్‌ (సి) ఇబ్రహీమ్‌ (బి) అజ్మతుల్లా 5; వుడ్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్‌) 317. 
వికెట్ల పతనం: 1–19, 2–30, 3–98, 4–133, 5–216, 6–233, 7–287, 8–309, 9–313, 10–317. 
బౌలింగ్‌: ఫారుఖీ 10–0–62–1, అజ్మతుల్లా 9.5–0–58–5, నబీ 8–0–57–2, రషీద్‌ ఖాన్‌ 10–0–66–1, నూర్‌ 10–0–51–0, గుల్బదిన్‌ 2–0–16–1. 

చాంపియన్స్‌ ట్రోఫీలో నేడు
పాకిస్తాన్‌ X బంగ్లాదేశ్‌
స్టార్‌ స్పోర్ట్స్, జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement