మరో 20 నగరాలకు ట్రూజెట్‌! | TruJet to induct up to 7 ATRs; to expand 20 more routes | Sakshi
Sakshi News home page

మరో 20 నగరాలకు ట్రూజెట్‌!

Published Fri, Jul 13 2018 12:32 AM | Last Updated on Fri, Jul 13 2018 12:32 AM

TruJet to induct up to 7 ATRs; to expand 20 more routes - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టర్బో మేఘ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానయాన సంస్థ ‘ట్రూజెట్‌’... వచ్చే మార్చి నాటికి మరో 20 నగరాల్లోకి అడుగుపెట్టనుంది. తక్కువ ధరలో సామాన్యులకూ విమాన సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉడాన్‌ పథకంలో భాగంగా అహ్మదాబాద్‌ నుంచి కాండ్లా, పోర్‌బందర్, కేశోడ్, జైసల్మేర్, జల్గావ్, నాసిక్‌ నగరాలకు ట్రూజెట్‌ సర్వీసులు నడపనుంది. అలాగే అస్సాం రాజ«ధాని గువహటి నుంచి బర్న్‌పూర్, కూచ్‌ బిహార్, తేజు, రూప్సి పట్టణాలను కూడా అనుసంధానించనుంది. ఈ సేవల ద్వారా తూర్పు, పశ్చిమ భారత్‌లో అడుగుపెట్టనుంది. ప్రస్తుతం ఈ సంస్థ దక్షిణాదిన హైదరాబాద్, విజయవాడ, కడపతో పాటు 14 నగరాలకు విమాన సర్వీసులు నడుపుతోంది. ఇందులో ఉడాన్‌ కింద కడప, నాందేడ్, బళ్లారి, మైసూర్, సేలం ఉన్నాయి. ఉడాన్‌ కింద దక్కించుకున్న అన్ని రూట్లలో సర్వీసులను విజయవంతంగా నడుపుతున్న తొలి సంస్థ ట్రూజెట్‌ కావడం గమనార్హం. 

మరో 7 విమానాలు.. 
ట్రూజెట్‌ 2015 జూలైలో కార్యకలాపాలు ప్రారంభించింది. మూడు వసంతాలు పూర్తి చేసుకుని నాల్గవ వసంతంలోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు తమ విమానాల్లో 12 లక్షల పైచిలుకు ప్రయాణికులు రాకపోకలు సాగించారని, తమ వద్ద ఏటీఆర్‌–72 రకం విమానాలు 5 ఉన్నాయని, మార్చినాటికి కొత్తగా మరో 5 నుంచి 7 విమానాలను లీజు ప్రాతిపదికన  సమకూర్చుకుంటామని ట్రూజెట్‌ సీఈవో విశోక్‌ మాన్‌సింగ్‌ తెలిపారు. మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాలు చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలను లక్ష్యంగా చేసుకుని విస్తరణ చేపడుతున్నట్టు చెప్పారు. ‘‘ప్రస్తుతం రోజుకు 32 సర్వీసులు నడుపుతున్నాం. ఆగస్టు నుంచి ఈ సంఖ్య 44 లేదా 48కి చేరుతుంది. 85 శాతం ఆక్యుపెన్సీ ఉంది’’ అని వివరించారు. 

అంతటా పైలట్ల కొరత.. 
ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు పైలట్ల కొరతను ఎదుర్కొంటున్నట్లు మాన్‌సింగ్‌ తెలియజేశారు. ఇందుకు ట్రూజెట్‌ మినహాయింపు కాదన్నారు. ‘‘ఒక్కో విమానానికి ఆరుగురు పైలట్లు అవసరమవుతారు. కాకపోతే పైలట్లు అనుభవం సంపాదించిన కొద్దీ పెద్ద విమానాలు నడపటానికి ఆసక్తి చూపిస్తుంటారు. దీంతో కొరత తప్పటం లేదు’’ అన్నారాయన. దేశీయంగా ఏ రూట్లో అయినా 6 నుంచి 9 నెలల్లో ఆపరేషనల్‌ బ్రేక్‌ ఈవెన్‌కు చేరుకోవచ్చని సంస్థ సీఎఫ్‌వో విశ్వనాథ్‌ ఈ సందర్భంగా చెప్పారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement