Trujet
-
ట్రూజెట్ ని కొనుగోలు చేసి భారత విమానయాన రంగంలోకి అమెరికా దిగ్గజం
-
ట్రూజెట్‌లో విన్‌ఎయిర్‌కు మెజారిటీ వాటాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా తొలి సమాంతర విమానయాన సంస్థ విన్‌ఎయిర్ తాజాగా ట్రూజెట్‌లో 79 శాతం వాటాలను కొనుగోలు చేసింది. ఈ ఒప్పంద విలువ రూ. 200 కోట్లు. డీల్ ప్రకారం ట్రూజెట్ నిర్వహణ నియంత్రణ, కార్యకలాపాలను విన్‌ఎయిర్ (ఉయ్ ఇండియన్ నేషనల్స్) టేకోవర్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై టర్బో మేఘా ఎయిర్వేస్ ఎండీ ఉమేష్ వంకాయలపాటి, విన్‌ఎయిర్ సీఎండీ శామ్యూల్ తిమోతీ సంతకాలు చేశారు. దీని ప్రకారం ఉమేష్ ఎండీగా కొనసాగనుండగా, నూతన మేనేజ్మెంట్ టీమ్‌కు కొత్త వ్యాపార ప్రణాళికతో తిమోతీ దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ ఒప్పందంతో ట్రూజెట్ 650 మంది పైగా ఉద్యోగులు, వారి కుటుంబాలకు స్వాంతన చేకూరనుంది. మీడియా, రియల్ ఎస్టేట్ తదితర వ్యాపారాల్లో ఉన్న ఆర్యన్ గ్రూప్ కంపెనీస్‌లో విన్‌ఎయిర్ కూడా భాగంగా ఉంది. డిసెంబర్ ఆఖరు నాటికి రోజూ 17 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 3 బ్యాకప్ విమానాలతో ట్రూజెట్ సర్వీసులు నిర్వహించగలదని తిమోతీ తెలిపారు. ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఆపరేటింగ్ పర్మిట్లు మొదలైనవన్నీ ఉన్న ఎయిర్‌లైన్స్ నుంచి విమానాలను వాటి లైసెన్సులతో పాటు లీజుకు తీసుకుని లాభసాటి రూట్లలో నడిపించుకునే సంస్థను సమాంతర (ప్యారలల్) ఎయిర్‌లైన్‌గా వ్యవహరిస్తారు. -
నష్టాల్లో రామ్ చరణ్ బిజినెస్, నిలిచిపోయిన సేవలు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మాత్రమే బిజినెస్‌మెన్‌గా కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. పరిశ్రమలో హీరోగా, నిర్మాతగా రాణిస్తున్న చెర్రి.. పలు వ్యాపార సంస్థలో కూడా భాగస్వామ్యం తీసుకున్నారు. అందులో ఓ విమానాయాన సంస్థ కూడా ఉంది. 2015లో చరణ్ తన స్నేహితుడితో కలిసి ట్రూజెట్ పేరుతో డొమాస్టిక్ ఎయిర్‌లైన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఈ విమానాలు హైదరాబాద్ నుంచి వివిధ దేశాలకు తమ ట్రూజెట్ ద్వారా విమానయాన సేవలు అందిస్తోంది. తక్కువ ఖర్చుతో దేశీయ విమానయానాన్ని అందించాలానే ఉద్దేశంతో తన స్నేహితుడు ఉమేశ్‌తో కలిసి టర్బో మేఘా ఎయిర్వేస్ సంస్థను ప్రారంభించిన రామ్ చరణ్. ఈ సంస్థ ట్రూజెట్ పేరుతో విమాన సర్వీసులు నడుపుతోంది. జులై 12వ తేదీ 2015 లో సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు నిరాటకంగా ఈ విమానాలు నడుస్తూ వచ్చాయి. అయితే ఇటీవల ఈ సంస్థ నష్టాల్లో నడుస్తుండటంతో దీనిపై రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి. చదవండి: అతడే నా భర్త, ఇంట్లో చెప్పే పెళ్లి చేసుకుంటాను: రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు ట్రూజెట్ విమానాలు నష్టాల్లో ఉండటంతో ఈ కంపెనీని మూసేస్తున్నారని, ఉద్యోగులకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో సంస్థ ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై ట్రూజెట్ కంపెనీ స్పందించింది. ఈ మేరకు అధికారిక ప్రకటనని విడుదల చేస్తూ.. ‘ట్రూజెట్ విమానాలు ఆపేస్తున్నారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇలాంటి వార్తలని నమ్మకండి. ఈ సంస్థలో పని చేసే ఇద్దరూ అధికారులు గతంలో రిజైన్ చేసి వెళ్లిపోయారు. వారి స్థానంలో కొత్త వారిని కూడా నియమించాము. ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు త్వరలోనే ఇన్వెస్టర్ కూడా రానున్నారు. ఇన్వెస్టర్స్ వచ్చాక కొత్త సీఈఓని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా ఉమేష్ గారే కొనసాగనున్నారు’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ‘వివిధ అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ కారణాల వల్ల ట్రూజెట్ విమానయాన కార్యకలాపాలకు తాత్కాలిక నిలిపివేశాం. టెంపరరిగా ట్రూజెట్ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నాం. త్వరలోనే మళ్లీ పునఃప్రారంభిస్తాం. నవంబర్ 2021 నుండి ఉద్యోగులకు ఒక్క పైసా కూడా చెల్లించడం లేదని చెప్పే వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. వారికి పాక్షిక జీతాలు ఇస్తున్నాము. తక్కువ సాలరీ ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇచ్చాము” అని ఈ ప్రకటనలో తెలిపారు. చదవండి: బోయపాటి సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతోన్న హీరోయిన్! pic.twitter.com/XE4RQ1paG5 — TruJet (@FlyTruJet) February 16, 2022 -
ట్రూజెట్‌కు కొత్త భాగస్వామి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన సంస్థ ట్రూజెట్ ప్రయాణంలో మరో మైలురాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) రూపంలో కంపెనీలోకి భారీ నిధులు వచ్చిచేరనున్నాయి. ట్రూజెట్ పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్న టర్బో మేఘా ఎయిర్వేస్లో 49 శాతం వాటా కొనుగోలుకు యూఎస్‌కు చెందిన ఇంటరప్స్ ముందుకొచ్చింది. అయితే వాటా కింద ఎంత మొత్తం పెట్టుబడి చేస్తున్నదీ ఇరు కంపెనీలూ వెల్లడించలేదు. త్వరలోనే ఈ డీల్ పూర్తి కానుంది. టర్బో మేఘా ఎయిర్వేస్ను ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కార్యకలాపాల విస్తరణకు, పౌర విమానయాన రంగంలో కొత్త అవకాశాల అన్వేషణకు ఈ నిధులను వెచ్చిస్తామని ఎంఈఐఎల్ గ్రూప్ డైరెక్టర్ కె.వి.ప్రదీప్, ఇంటరప్స్ చైర్మన్ పాలెపు లక్ష్మీ ప్రసాద్ సంయుక్తంగా తెలిపారు. దేశవ్యాప్తంగా 21 కేంద్రాలు.. హైదరాబాద్ కేంద్రంగా ట్రూజెట్ 2015 జూలైలో కార్యకలాపాలను ప్రారంభించింది. ఉడాన్ పథకం ఆసరాగా మెట్రోలతో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలను అనుసంధానిస్తూ విమానయాన సేవలను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరుతోపాటు విజయవాడ, రాజమండ్రి, కడప, తిరుపతితోసహా 21 కేంద్రాలున్నాయి. ఇప్పటి వరకు 28.2 లక్షల మంది ట్రూజెట్‌లో ప్రయాణించారు. సంస్థ ఖాతాలో ఏడు విమానాలు వచ్చి చేరాయి. ఏటీఆర్–72 రకం ఎయిర్క్రాఫ్ట్స్ను కంపెనీ వినియోగిస్తోంది. హైదరాబాద్–ఔరంగాబాద్ సెక్టార్లో ట్రూజెట్ మాత్రమే సర్వీసులను నడుపుతోంది. కాగా, లక్ష్మీ ప్రసాద్ గతంలో హైదరాబాద్‌లో చార్టర్డ్ అకౌంటెంట్‌గా సేవలందించారు. 1997లో యూఎస్‌లో అడుగుపెట్టారు. గతేడాది ఎయిర్ ఇండియా ఉద్యోగులతో కలిసి ఆ సంస్థను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. -
బెంగళూరు నుంచి బీదర్‌కు ట్రూజెట్ సర్వీసులు
బెంగళూరు: ఉడాన్ నెట్వర్క్ సేవల విస్తరణలో భాగంగా హైదరాబాద్ టర్బో మేఘా ఎయిర్వేస్కు చెందిన ట్రూజెట్ కొత్తగా ఈశాన్య కర్ణాటకలోని బీదర్ నుంచి విమాన సేవలు ప్రారంభించింది. బీదర్ నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరు మధ్య శుక్రవారం నుంచి ప్రతీ రోజు విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప ఇవాళ బెంగళూరు విమానాశ్రయంలో ఈ సర్వీసు ప్రారంభించారు. బెంగళూరులో ట్రూజెట్ సర్వీసు ప్రారంభించిన అనంతరం అదే విమానంలో ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు బీదర్ వరకు ప్రయాణించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ బెంగళూరు విమానాశ్రయం నుంచి బీదర్‌కు కేవలం గంటా 40 నిమిషాల్లోనే చేరుకున్నామని, సాధారణంగా బెంగళూరు నుంచి బస్సులో బీదర్‌కు చేరుకోవాలంటే 12 గంటల ప్రయాణం అవుతుందన్నారు. ట్రూజెట్ విమాన సర్వీసుల వల్ల ప్రయాణ దూరం భారం తగ్గిందని విమాన సర్వీసుల పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు ఇక ట్రూజెట్ నెట్‌వర్క్‌లో బీదర్ 24వ స్టేషన్ కాబోతోంది. ప్రాంతీయ అనుసంధాన పథకం (ఆర్సీఎస్)- ఉడే దేశ్కా ఆమ్ నాగరిక్ (ఉడాన్), సామాన్య మానవులు కూడా విమానాల్లో ప్రయాణించాలన్న ప్రధానమంతి ప్రయత్నాల్లో భాగంగా ట్రూజెట్ విమానాల్లో 65 శాతానికి పైగా ప్రాంతీయ విమానాశ్రయాలకు అనుసంధానమై ఉన్నాయి. ఆర్సీఎస్ I, II, III కింద తనకు అప్పగించిన మార్గాల్లో పూర్తిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏకైక సంస్థ ట్రూజెట్. ఈ సందర్భంగా టర్బో మేఘా ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ ‘మా మొదటి ప్రయాణాన్ని జూలై 12, 2015న మొదలపెట్టిన నాటి నుంచి మేము చాలా దూరం ప్రయాణించాం. భారత్‌లోని ప్రథమశ్రేణి నగరాల నుంచి సామాజిక-ఆర్థిక అభివృద్ధిని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలన్న జాతి ఆకాంక్షలను మేము నెరవేర్చుతున్నామని గొప్పగా చెప్పుకుంటున్నాం. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమాన సేవలు అందించడం ద్వారా ఆ ప్రాంతాల్లో వ్యాపారానికి, పర్యటక అభివృద్ధికి మేము దోహదపడుతున్నాం. విమాన అనుసంధానం అన్నది ఆర్థిక వ్యవస్థకు అండగా నిలవడమే కాకుండా ఉపాధి కల్పనకు సహకరిస్తుంది’ అని అన్నారు. సీఈఓ కల్నల్ ఎల్ఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ, ప్రాంతీయ విమాన అనుసంధానంలో బలమైన శక్తిగా ట్రూజెట్ నిలుస్తుంది. నాలుగేళ్ల స్వల్ప వ్యవధిలో మా నెట్‌వర్క్‌ను 24స్టేషన్లకు విస్తరించగలిగాం. దేశంలో ఆర్థికశక్తులుగా ఎదుగుతున్న ప్రాంతాల్లో బలమైన ప్రాంతీయ విమానయాన సంస్థగా ఎదిగేందుకు సుస్థిర అభివృద్ధి వ్యూహాన్ని రూపొందించామన్నారు. కాగా బెంగళూరు-బీదర్ బెంగళూరు మధ్య కొత్త సర్వీసు ప్రారంభించిన సందర్భంగా ట్రూజెట్ నాలుగు రోజుల పాటు టికెట్ బేస్ ధరను రూ.699 గా అందిస్తోంది. -
ట్రూజెట్‌తో జెట్ ఒప్పందం రద్దు!
ముంబై: విమానయాన సంస్థ ట్రూజెట్‌కి కొన్ని ప్రాంతీయ విమానాలను లీజుకిచ్చే ఒప్పంద ప్రతిపాదనను రద్దు చేసుకున్నట్లు జెట్ ఎయిర్వేస్ వెల్లడించింది. గడువు తేదీలోగా ఒప్పంద షరతుల్ని అమలు చేయటంలో ట్రూజెట్ విఫలం కావడమే దీనికి కారణమని సంస్థ ప్రతినిధి తెలిపారు. ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న జెట్ ఎయిర్వేస్... నిధుల సమీకరణ కోసం పలు మార్గాలు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ నుంచి పలు ప్రాంతీయ రూట్లలో విమాన సర్వీసులు అందిస్తున్న ట్రూజెట్‌కు ఏడు విమానాలను వెట్ లీజుకు ఇవ్వాలని భావించింది. వెట్ లీజు కింద విమానంతో పాటు సిబ్బంది, నిర్వహణ, బీమా మొదలైనవన్నీ కూడా జెట్ ఎయిర్‌వేసే సమకూర్చాల్సి ఉంటుంది. అయితే, నిధుల కొరతతో కొన్నాళ్లుగా సిబ్బందికి జీతాల చెల్లింపులను కూడా వాయిదా వేస్తూ వస్తుండటంతో పలువురు పైలట్లు ఇప్పటికే జెట్ ఎయిర్వేస్ నుంచి తప్పుకున్నారు. దీంతో విమానాలతో పాటు తగినంత మంది సిబ్బందిని ట్రూజెట్‌కు జెట్ ఎయిర్వేస్ పంపే పరిస్థితి లేకుండా పోయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ట్రూజెట్‌కు డ్రై లీజు గనక ఆమోదయోగ్యమైతే కేవలం విమానాలను మాత్రమే లీజుకివ్వొచ్చని జెట్ భావిస్తున్నట్లు వివరించాయి. ‘కానీ మార్కెట్ నుంచి ఏటీఆర్ విమానాలను లీజుకు తీసుకోవడం పెద్ద సమస్య కాదు. కానీ ఇలాంటి విమానాలను నడిపే సుశిక్షితులైన పైలట్ల కొరతే సమస్య. కాబట్టి ట్రూజెట్ ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తుందా... అనేది అనుమానమే. విమానాలను డ్రై లీజుకు తీసుకోవడం ఆర్థికంగా ఆ సంస్థకు కూడా ప్రయోజనకరం కాకపోవచ్చు’’ అని ఆ వర్గాలు వివరించారు. -
మరో 20 నగరాలకు ట్రూజెట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టర్బో మేఘ ఎయిర్వేస్కు చెందిన విమానయాన సంస్థ ‘ట్రూజెట్’... వచ్చే మార్చి నాటికి మరో 20 నగరాల్లోకి అడుగుపెట్టనుంది. తక్కువ ధరలో సామాన్యులకూ విమాన సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉడాన్ పథకంలో భాగంగా అహ్మదాబాద్ నుంచి కాండ్లా, పోర్బందర్, కేశోడ్, జైసల్మేర్, జల్గావ్, నాసిక్ నగరాలకు ట్రూజెట్ సర్వీసులు నడపనుంది. అలాగే అస్సాం రాజ«ధాని గువహటి నుంచి బర్న్‌పూర్, కూచ్ బిహార్, తేజు, రూప్సి పట్టణాలను కూడా అనుసంధానించనుంది. ఈ సేవల ద్వారా తూర్పు, పశ్చిమ భారత్‌లో అడుగుపెట్టనుంది. ప్రస్తుతం ఈ సంస్థ దక్షిణాదిన హైదరాబాద్, విజయవాడ, కడపతో పాటు 14 నగరాలకు విమాన సర్వీసులు నడుపుతోంది. ఇందులో ఉడాన్ కింద కడప, నాందేడ్, బళ్లారి, మైసూర్, సేలం ఉన్నాయి. ఉడాన్ కింద దక్కించుకున్న అన్ని రూట్లలో సర్వీసులను విజయవంతంగా నడుపుతున్న తొలి సంస్థ ట్రూజెట్ కావడం గమనార్హం. మరో 7 విమానాలు.. ట్రూజెట్ 2015 జూలైలో కార్యకలాపాలు ప్రారంభించింది. మూడు వసంతాలు పూర్తి చేసుకుని నాల్గవ వసంతంలోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు తమ విమానాల్లో 12 లక్షల పైచిలుకు ప్రయాణికులు రాకపోకలు సాగించారని, తమ వద్ద ఏటీఆర్–72 రకం విమానాలు 5 ఉన్నాయని, మార్చినాటికి కొత్తగా మరో 5 నుంచి 7 విమానాలను లీజు ప్రాతిపదికన సమకూర్చుకుంటామని ట్రూజెట్ సీఈవో విశోక్ మాన్సింగ్ తెలిపారు. మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాలు చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలను లక్ష్యంగా చేసుకుని విస్తరణ చేపడుతున్నట్టు చెప్పారు. ‘‘ప్రస్తుతం రోజుకు 32 సర్వీసులు నడుపుతున్నాం. ఆగస్టు నుంచి ఈ సంఖ్య 44 లేదా 48కి చేరుతుంది. 85 శాతం ఆక్యుపెన్సీ ఉంది’’ అని వివరించారు. అంతటా పైలట్ల కొరత.. ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు పైలట్ల కొరతను ఎదుర్కొంటున్నట్లు మాన్సింగ్ తెలియజేశారు. ఇందుకు ట్రూజెట్ మినహాయింపు కాదన్నారు. ‘‘ఒక్కో విమానానికి ఆరుగురు పైలట్లు అవసరమవుతారు. కాకపోతే పైలట్లు అనుభవం సంపాదించిన కొద్దీ పెద్ద విమానాలు నడపటానికి ఆసక్తి చూపిస్తుంటారు. దీంతో కొరత తప్పటం లేదు’’ అన్నారాయన. దేశీయంగా ఏ రూట్లో అయినా 6 నుంచి 9 నెలల్లో ఆపరేషనల్ బ్రేక్ ఈవెన్‌కు చేరుకోవచ్చని సంస్థ సీఎఫ్‌వో విశ్వనాథ్ ఈ సందర్భంగా చెప్పారు. -
ట్రూజెట్ వార్షికోత్సవ సేల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన రంగంలో ఉన్న ట్రూజెట్ మూడవ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో టికెట్ ప్రారంభ ధరను రూ.603 నుంచి ఆఫర్ చేస్తోంది. బుకింగ్ పీరియడ్ జూలై 9 నుంచి 12 వరకు ఉంది. కస్టమర్లు జూలై 20 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణించాల్సి ఉంటుంది. ట్రూజెట్ ప్రస్తుతం హైదరాబాద్ నుంచి 9 నగరాలకు విమాన సర్వీసులను నడుపుతోంది. -
‘హైదరాబాద్-మైసూరు’ కొత్త ట్రూ జెట్
హైదరాబాద్: టాలీవుడ్ మెగా వారసుడు , హీరో రామ్ చరణ్ టర్బో మెగా ఎయిర్వేస్ తో కలిసి సంయుక్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ‘ట్రూ జెట్’ ఎయిర్‌లైన్స్ కొత్త విమాన సర్వీసును ప్రారంభించింది. ప్రాంతీయ కనెక్టివిటీ పథకం కింద హైదరాబాద్-మైసూర్ సర్వీసులను ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉడాన్ పథకంలో భాగంగా ఇప్పటికే హైదరాబాద్- నాందేడ్ , హైదరాబాద్-కడప సర్వీసులను ప్రకటించిన ట్రూ జెట్ తాజాగా మైసూరును ఈ జాబితాలో చేర్చింది. మెట్రో నగరాలతో ఇతర సిటీలను అనుసంధానించే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ - మైసూర్ ఎయిర్ కనెక్టివిటీ సర్వీసును ప్రారంభించినట్టు టర్బో- మేఘా ఎయిర్వేస్ మేనేజింగ్ డైరెక్టర్ వంకాయల పాటి ఉమేష్ చెప్పారు. ఇది మొత్తం ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని తాము ఆశిస్తున్నామన్నారు. -
ట్రూజెట్ ‘ఉడాన్’..!
⇒ కొత్తగా 16 చిన్న పట్టణాలకు విమాన సర్వీసులు... ⇒ టర్బో మేఘా ఎయిర్వేస్కు గ్రీన్‌సిగ్నల్ ⇒ కంపెనీ ఎండీ వంకాయలపాటి ఉమేష్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో ట్రూజెట్ పేరుతో ప్రాంతీయ విమాన సర్వీసులు అందిస్తున్న టర్బో మేఘా ఎయిర్వేస్ చిన్న పట్టణాల్లో అడుగుపెడుతోంది. ఇప్పటి వరకు 10 నగరాలకు సేవలు అందిస్తున్న ఈ సంస్థ ఉడాన్ ప్రాజెక్టులో పాలు పంచుకుంటోంది. ఇందులో భాగంగా 16 చిన్న పట్టణాలకు సర్వీసులు అందించేందుకు రెడీ అయింది. కొన్ని రూట్లకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకుంది. కొత్త కేంద్రాలకు సేవలు ఎప్పటి నుంచి ప్రారంభించేది మార్చి 30న ఖరారు అవుతుందని టర్బో మేఘా ఎయిర్వేస్ ఎండీ వంకాయలపాటి ఉమేష్ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. నిర్దేశించిన రూట్లలో ప్రతి రోజు కనీసం ఒక్క సర్వీసు అయినా ఉంటుందని పేర్కొన్నారు. చిన్న పట్టణాలకు విమాన సేవలు విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉడే దేశ్కే ఆమ్ నాగరిక్ (ఉడాన్) ప్రాజెక్టు చేపట్టడం తెలిసిందే. ఇవీ ట్రూజెట్ కొత్త రూట్లు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలో ట్రూజెట్ కొత్త రూట్లు రానున్నాయి. కడప–విజయవాడ, కడప–చెన్నై, కడప–హైదరాబాద్, హైదరాబాద్–నాందేడ్, నాందేడ్–ముంబై, హైదరాబాద్–బళ్లారి, బళ్లారి–బెంగళూరు, చెన్నై–కడప, చెన్నై–మైసూరు, చెన్నై–సేలం తదితర రూట్లు వీటిలో ఉన్నాయి. అలాగే బెంగళూరు–బీదర్, చెన్నై–హŸస్సూరు రూట్లకు కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి ట్రూజెట్‌కు అనుమతి రావాల్సి ఉంది. కంపెనీ వద్ద ప్రస్తుతం నాలుగు విమానాలు ఉన్నాయి. ఒక్కో ఫ్లయిట్ సామర్థ్యం 72 సీట్లు. ఏప్రిల్‌లో మరో విమానం జతకూడుతోంది. 2017 డిసెంబరు నాటికి మొత్తం 8 విమానాలు కంపెనీ వద్ద ఉంటాయని ఉమేష్ తెలిపారు. ఉడాన్‌తో జోష్.. రానున్న రోజుల్లో ప్రాంతీయ విమానయాన రంగంలో ఉడాన్ జోష్‌నిస్తుందని ఉమేష్ తెలిపారు. చిన్న నగరాలకు విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ రూట్లో అయినా ఒక గంట ప్రయాణానికి ఒక్కో టికెట్ ధర రూ.2,500 మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ట్రూజెట్ ద్వారా 2.5 లక్షల మందికిపైగా కస్టమర్లు పలు నగరాలకు ప్రయాణించారని వివరించారు. రెండేళ్లలో దేశవ్యాప్తంగా సేవలు అందించాలని భావిస్తున్నట్టు తెలిపారు. కంపెనీ వద్ద ప్రస్తుతం 450 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మరో నాలుగు కంపెనీలు.. ఉడాన్ ప్రాజెక్టులో ట్రూజెట్తోపాటు డెక్కన్ చార్టర్, ఎయిర్ ఒడిషా, అలయన్స్ ఎయిర్, స్పైస్ జెట్ సైతం పాలుపంచుకుంటున్నాయి. ఈ అయిదు కంపెనీలకు 70 రూట్ల దాకా కేటాయించినట్టు తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాల్లో ట్రూజెట్తోపాటు ఈ కంపెనీలు సర్వీసులు అందించనున్నాయి. దేశవ్యాప్తంగా 11 కంపెనీలు ప్రస్తుతం 43 విమానాశ్రయాల కోసం రూట్లను ప్రతిపాదించాయి. ఉడాన్ ప్రాజెక్టు అమలు బాధ్యతను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చేపట్టింది. 43 విమానాశ్రయాల్లో 31 కేంద్రాలకు అసలు విమానాలే నడవడం లేదు. మిగిలిన 12 విమానాశ్రయాలకు సర్వీసులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. -
ట్రూజెట్ 3 కొత్త విమాన సర్వీసులు
సాక్షి, తిరుపతి: విజయవాడ-కడప, విజయవాడ-తిరుపతి, తిరుపతి-హైదరాబాద్ మార్గాల్లో మంగళవారం నుంచి ట్రూజెట్ పేరుతో టర్బో మేఘా విమానయాన సేవలు అందిస్తున్నట్లు ఆసంస్థ ఎండీ వి.ఉమేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి సర్వీస్ కింద తిరుపతి-హైదరాబాద్ మార్గంలో ప్రతిరోజూ తిరుపతిలో 9.45కు బయలుదేరి 11 గంటలకు హైదరాబాద్ చేరుకుటుందని చెప్పారు. రెండో సర్వీస్ తిరుపతి-హైదరాబాద్ మార్గంలో సోమ, శుక్ర, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 12.45 గంటలకు బయలుదేరి 2.05కు చేరుతుందని, 3వ సర్వీస్ తిరుపతి-హైదరాబాద్ మార్గంలో మంగళ, బుధ గురువారాల్లో సాయంత్రం 6.15 గంటలకు బయలుదేరి 7.35కు చేరుతుందని చెప్పారు. 4వ సర్వీస్ తిరుపతి నుంచి హైదరాబాద్‌కు ప్రతిరోజూ రాత్రి 8.20కి బయలుదేరి 9.45కు హైదరాబాద్‌కు చేరుతుందన్నారు. తిరుపతి-గోవా మార్గంలో శుక్ర ,శని, ఆది, సోమవారం మధ్యాహ్నం 12.45కు తిరుపతిలో బయలుదేరి సాయంత్రం 4.45కు గోవా చేరుతుందన్నారు. విజయవాడ-తిరుపతి మార్గంలో మంగళ, బుధ, గురవారాల్లో సాయంత్రం 4.35కు విజయవాడలో బయలుదేరి 5.50కి తిరుపతికి చేరుతుందన్నారు. కడప-తిరుపతి మార్గంలో సోమ, శుక్ర, శని, ఆదివారాల్లో ఉదయం 11.35కు కడపలో బయలుదేరి 12.20కి తిరుపతికి చేరుతుందన్నారు. -
విజయవాడ నుంచి మూడు డైరెక్ట్ ఫ్లైట్లు: ట్రూజెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విజయవాడ నుంచి మూడు ప్రాంతాలకు ఫ్లైట్ సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ట్రూజెట్ వెల్లడించింది. హైదరాబాద్, తిరుపతి, కడప రూట్లలో ఈ సర్వీసులు ఉంటాయని ట్రూజెట్ మాతృ సంస్థ టర్బో మేఘా ఎయిర్వేస్ ఎండీ వంకాయలపాటి ఉమేష్ తెలిపారు. విజయవాడ-హైదరాబాద్ మధ్య సేవలు ఏప్రిల్ 22 నుంచి తిరుపతి, కడపలకు సర్వీసులు మే 3 నుంచి ప్రారంభమవుతాయని వివరించారు. కడప-విజయవాడ రూట్ లో విమానసేవలు అందించే ఏకైక ఎయిర్‌లైన్ తమదే అవుతుందని ఉమేష్ పేర్కొన్నారు. -
కడప-హైదరాబాద్ మధ్య ట్రూజెట్ విమాన సర్వీసులు
సాక్షి ప్రతినిధి, కడప: కడప నుంచి హైదరాబాద్‌కు ట్రూజెట్ విమాన సర్వీసులు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు ఓల్వో బస్సు టికెట్ ధరలతో సమానంగానే విమానాల్లో చార్జీ ఉంటుందని ట్రూజెట్ ఎండీ ఉమేష్ మీడియాకు వెల్లడించారు. వారంలో నాలుగు రోజుల (శుక్ర, శని, ఆది, సోమ) పాటు సర్వీసులు ఉంటాయని చెప్పారు. మే 3వ తేది నుంచి విజయవాడ-కడప మధ్య విమాన సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో కడప నుంచి గోవా, బెంగుళూరు, చెన్నై, ఔరంగబాద్ (షిరిడి) సర్వీసులు కూడా నడపనున్నట్లు వివరించారు. -
కడపకు ట్రూజెట్ సేవలు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రాంతీయ విమాన సేవలను అందించే ట్రూజెట్ కడపకు సర్వీసులను ప్రారంభించింది. ఏప్రిల్8న హైదరాబాద్- కడప, తిరుపతి-కడపలకు సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ట్రూజెట్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారపరంగా చాలా ముఖ్యపట్టణమైన కడపకు ట్రూజెట్ ఒక్కటే సర్వీసులను అందిస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. ఇంత వరకు విమాన సర్వీసులు లేని నాగపూర్, ఔరంగాబాద్ తర్వాత ఇప్పుడు మూడో పట్టణం కడపకు సేవలను విస్తరిస్తున్నట్లు ట్రూజెట్ మేనేజింగ్ డెరైక్టర్ ఉమేష్ వంకాయలపాటి తెలిపారు. దీనివల్ల ఇప్పుడు కడప నుంచి నాగపూర్, గోవా, రాజమండ్రి పట్టణాలకు విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. మూడో విమానం ఏటీఆర్-72 అందుబాటులోకి రావడంతో కొత్త సర్వీసులను ప్రారంభించినట్లు ట్రూజెట్ ఆ ప్రకటనలో పేర్కొంది. -
విస్తరణ దిశగా ట్రూజెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రాంతీయ విమానయాన సంస్థ ట్రూజెట్ విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేసింది. వచ్చే ఆరు నెలల్లో మరో నాలుగు విమానాలను సమకూర్చుకోనున్నట్లు ప్రకటించింది. ఇప్పుడున్న రెండు విమానాలకు తోడు శుక్రవారం మూడో విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చింది. వచ్చే ఆగస్టు నాటికి మొత్తం విమానాల సంఖ్య 7కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ట్రూజెట్ మేనేజింగ్ డెరైక్టర్ ఉమేష్ వంకాయలపాటి తెలిపారు. ప్రస్తుతం ఏడు పట్టణాలకు సర్వీసులను నడుపుతున్నామని, జనవరి 15 నుంచి పుణే, పాండిచ్చేరిలకు ప్రారంభించనున్నట్లు తెలిపారు. మార్చినాటికి మరో రెండు, ఆ తర్వాత సెప్టెంబర్ నాటికి మరో రెండు విమానాలు వస్తే పశ్చిమ, ఉత్తర భారతదేశ పట్టణాలకు విస్తరించనున్నట్లు తెలిపారు. ట్రూజెట్ సేవలు ప్రారంభించిన ఐదు నెలల్లోనే లక్ష మంది ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో తీసిన లక్కీ డ్రాలో హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణించిన వ్యక్తి లక్ష రూపాయల నగదు బహుమతిని గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 85 నుంచి 90 శాతం లోడ్ ఫ్యాక్టర్‌తో తమ సర్వీసులు నడుస్తున్నట్లు తెలిపారు. విస్తరణ కార్యకలాపాలకు అదనపు నిధుల సేకరణ అవసరం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
ట్రూజెట్ ప్రత్యేక డిస్కౌంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్థానిక విమానయాన సంస్థ ట్రూ జెట్ ఎంపిక చేసిన వినియోగదారులకు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. ట్రూ జెట్‌లో ప్రయాణించే సీనియర్ సిటిజన్స్, విద్యార్థులు, మీడియా సంస్థల ప్రతినిధులు, దక్షిణ భారత ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు, మూవీ ఆర్టిస్ట్స్అసోసియేషన్ సభ్యులకు 10 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు ట్రూ జెట్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. టాలీవుడ్ నటుడు రాంచరణ్ తేజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ట్రూ జెట్ 4 నెలల క్రితం విమాన సర్వీసులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత నాలుగు నెలల నుంచి సర్వీసులను విజయవంతంగా నడుపుతున్నామని, ఆ ప్రత్యేక ఆఫర్లతో మరింత మంది ప్రయాణీకులను ఆకర్షించగలమన్న ధీమాను టర్బో మెఘా ఎయిర్వేస్ ఎండీ వంకాయలపాటి ఉమేష్ వ్యక్తం చేశారు. -
మరిన్ని నగరాలకు ట్రూజెట్
- నేటి నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు - త్వరలో విశాఖ, విజయవాడలకు - ట్రూజెట్ ఎండీ ఉమేష్ వంకాయలపాటి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టాలీవుడ్ నటుడు రామ్‌చరణ్ బ్రాండ్ అంబాసిడర్, డెరైక్టర్‌గా ఉన్న చౌక విమానయాన సంస్థ ట్రూజెట్ తన సర్వీసులను మరిన్ని నగరాలకు విస్తరిస్తోంది. సెప్టెంబర్ 10 నుంచి హైదరాబాద్- బెంగళూరు, బెంగళూరు-షిరిడీ (ఔరంగాబాద్)లకు కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ట్రూజెట్ తెలిపింది. ఈ కొత్త సర్వీసులతో కలిపి మొత్తం ఆరు పట్టణాలకు తాము విమాన సర్వీసులను అందిస్తున్నామని, త్వరలోనే దక్షిణాదిలోని అన్ని ప్రధాన పట్టణాలకు విస్తరించనున్నట్లు ట్రూజెట్ మేనేజింగ్ డెరైక్టర్ ఉమేష్ వంకాయలపాటి తెలిపారు. ఈ నెలాఖరుకు మూడో విమానం అందుబాటులోకి వస్తుందని, దీంతో విజయవాడ, విశాఖపట్నంలకు సర్వీసులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కోరిక మేరకు సాధ్యమైనంత త్వరగా హైదరాబాద్ నుంచి విజయవాడకు సర్వీసును ప్రారంభించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ మధ్యనే ట్రూజెట్ విమాన సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మా సర్వీసులకు డిమాండ్ బాగుందని, లోడ్ ఫ్యాక్టర్ 85 నుంచి 90 శాతంగా ఉందన్నారు. ప్రారంభించిన రెండు నెలల్లోనే నిర్వహణా లాభాలను ఆర్జిస్తున్నట్లు తెలిపారు. -
బర్డ్ ఇన్ఫర్మేషన్తో ట్రూజెట్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏవియేషన్, పర్యాటకరంగానికి సంబంధించిన సాఫ్ట్వేర్ సేవలను అందించే బర్డ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌తో ట్రూజెట్ చేతులు కలిపింది. దేశవ్యాప్తంగా ట్రూజెట్‌కు ఉన్న అన్ని ఎయిర్‌పోర్టు ఆఫీసులు, కాల్ సెంటర్స్, ఇంటర్నెట్ బుకింగ్ ఇంజన్లకు బర్డ్ ఇన్ఫర్మేషన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తుంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో చాలా సులభంగా ఆన్లైన్ ద్వారా టికెట్ బుకింగ్ సేవలు పొందవచ్చని టర్బో మెఘా ఎయిర్వేస్ డెరైక్టర్ ప్రేమ్ కుమార్ తెలిపారు. జూలై 10 నుంచి ట్రూజెట్ టికెట్ బుకింగ్ సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
‘ట్రూజెట్’ తొలి విమానం ఎగిరింది..
హైదరాబాద్-తిరుపతి సర్వీసును ప్రారంభించిన మంత్రి అశోక గజపతిరాజు శంషాబాద్: నటుడు రాంచరణ్‌తేజ్ బ్రాండ్ అంబాసిడర్, డెరైక్టర్‌గా ఉన్న ట్రూజెట్ ఎయిర్‌లైన్స్ సర్వీసులు ఆదివారం హైదరాబాద్ నుంచి తిరుపతి, రాజమండ్రిలకు ప్రారంభమయ్యాయి. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పౌరవిమానయాన శాఖ మంత్రి పి. అశోక గజపతిరాజు జెండా ఊపి సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోదావరి పుష్కరాల భక్తుల కోసం ఈ నెల 12 నుంచి 25వ తేదీ వరకు రాజమండ్రికి ప్రత్యేక సర్వీసులు కొనసాగుతాయని తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎనిమిదో దేశీయ ఎయిర్‌లైన్స్‌గా ట్రూజెట్ సర్వీసులు ప్రారంభం కావడం అభినందనీయమని జీఎంఆర్ ఎయిర్‌పోర్టు సీఈవో ఎస్జీకే కిశోర్ అన్నారు. షిర్డీ భక్తుల సౌకర్యార్థం ఈ నెల 26న శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఔరంగాబాద్ విమానాశ్రయానికి ట్రూజెట్ ఎయిర్ సర్వీసులు ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు, నటుడు రాంచరణ్‌తేజ్ తదితరులు పాల్గొన్నారు. -
రామ్ చరణ్ (ట్రూజెట్) విమానాలు ప్రారంభం