ట్రూజెట్ ‘ఉడాన్’..!
⇒ కొత్తగా 16 చిన్న పట్టణాలకు విమాన సర్వీసులు...
⇒ టర్బో మేఘా ఎయిర్‌వేస్‌కు గ్రీన్‌సిగ్నల్
⇒ కంపెనీ ఎండీ వంకాయలపాటి ఉమేష్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో
ట్రూజెట్ పేరుతో ప్రాంతీయ విమాన సర్వీసులు అందిస్తున్న టర్బో మేఘా ఎయిర్‌వేస్ చిన్న పట్టణాల్లో అడుగుపెడుతోంది. ఇప్పటి వరకు 10 నగరాలకు సేవలు అందిస్తున్న ఈ సంస్థ ఉడాన్ ప్రాజెక్టులో పాలు పంచుకుంటోంది. ఇందులో భాగంగా 16 చిన్న పట్టణాలకు సర్వీసులు అందించేందుకు రెడీ అయింది. కొన్ని రూట్లకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకుంది. కొత్త కేంద్రాలకు సేవలు ఎప్పటి నుంచి ప్రారంభించేది మార్చి 30న ఖరారు అవుతుందని టర్బో మేఘా ఎయిర్‌వేస్ ఎండీ వంకాయలపాటి ఉమేష్ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. నిర్దేశించిన రూట్లలో ప్రతి రోజు కనీసం ఒక్క సర్వీసు అయినా ఉంటుందని పేర్కొన్నారు. చిన్న పట్టణాలకు విమాన సేవలు విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉడే దేశ్‌కే ఆమ్ నాగరిక్ (ఉడాన్) ప్రాజెక్టు చేపట్టడం తెలిసిందే.
ఇవీ ట్రూజెట్ కొత్త రూట్లు..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలో ట్రూజెట్ కొత్త రూట్లు రానున్నాయి. కడప–విజయవాడ, కడప–చెన్నై, కడప–హైదరాబాద్, హైదరాబాద్–నాందేడ్, నాందేడ్–ముంబై, హైదరాబాద్–బళ్లారి, బళ్లారి–బెంగళూరు, చెన్నై–కడప, చెన్నై–మైసూరు, చెన్నై–సేలం తదితర రూట్లు వీటిలో ఉన్నాయి. అలాగే బెంగళూరు–బీదర్, చెన్నై–హŸస్సూరు రూట్లకు కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి ట్రూజెట్‌కు అనుమతి రావాల్సి ఉంది. కంపెనీ వద్ద ప్రస్తుతం నాలుగు విమానాలు ఉన్నాయి. ఒక్కో ఫ్లయిట్ సామర్థ్యం 72 సీట్లు. ఏప్రిల్‌లో మరో విమానం జతకూడుతోంది. 2017 డిసెంబరు నాటికి మొత్తం 8 విమానాలు కంపెనీ వద్ద ఉంటాయని ఉమేష్ తెలిపారు.
ఉడాన్‌తో జోష్..
రానున్న రోజుల్లో ప్రాంతీయ విమానయాన రంగంలో ఉడాన్ జోష్‌నిస్తుందని ఉమేష్ తెలిపారు. చిన్న నగరాలకు విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ రూట్లో అయినా ఒక గంట ప్రయాణానికి ఒక్కో టికెట్ ధర రూ.2,500 మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ట్రూజెట్ ద్వారా 2.5 లక్షల మందికిపైగా కస్టమర్లు పలు నగరాలకు ప్రయాణించారని వివరించారు. రెండేళ్లలో దేశవ్యాప్తంగా సేవలు అందించాలని భావిస్తున్నట్టు తెలిపారు. కంపెనీ వద్ద ప్రస్తుతం 450 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
మరో నాలుగు కంపెనీలు..
ఉడాన్ ప్రాజెక్టులో ట్రూజెట్‌తోపాటు డెక్కన్ చార్టర్, ఎయిర్ ఒడిషా, అలయన్స్ ఎయిర్, స్పైస్ జెట్ సైతం పాలుపంచుకుంటున్నాయి. ఈ అయిదు కంపెనీలకు 70 రూట్ల దాకా కేటాయించినట్టు తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాల్లో ట్రూజెట్‌తోపాటు ఈ కంపెనీలు సర్వీసులు అందించనున్నాయి. దేశవ్యాప్తంగా 11 కంపెనీలు ప్రస్తుతం 43 విమానాశ్రయాల కోసం రూట్లను ప్రతిపాదించాయి. ఉడాన్ ప్రాజెక్టు అమలు బాధ్యతను ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చేపట్టింది. 43 విమానాశ్రయాల్లో 31 కేంద్రాలకు అసలు విమానాలే నడవడం లేదు. మిగిలిన 12 విమానాశ్రయాలకు సర్వీసులు అంతంత మాత్రంగానే ఉన్నాయి.