Turbo Megha Airways
-
ట్రూజెట్‌కు కొత్త భాగస్వామి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన సంస్థ ట్రూజెట్ ప్రయాణంలో మరో మైలురాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) రూపంలో కంపెనీలోకి భారీ నిధులు వచ్చిచేరనున్నాయి. ట్రూజెట్ పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్న టర్బో మేఘా ఎయిర్వేస్లో 49 శాతం వాటా కొనుగోలుకు యూఎస్‌కు చెందిన ఇంటరప్స్ ముందుకొచ్చింది. అయితే వాటా కింద ఎంత మొత్తం పెట్టుబడి చేస్తున్నదీ ఇరు కంపెనీలూ వెల్లడించలేదు. త్వరలోనే ఈ డీల్ పూర్తి కానుంది. టర్బో మేఘా ఎయిర్వేస్ను ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కార్యకలాపాల విస్తరణకు, పౌర విమానయాన రంగంలో కొత్త అవకాశాల అన్వేషణకు ఈ నిధులను వెచ్చిస్తామని ఎంఈఐఎల్ గ్రూప్ డైరెక్టర్ కె.వి.ప్రదీప్, ఇంటరప్స్ చైర్మన్ పాలెపు లక్ష్మీ ప్రసాద్ సంయుక్తంగా తెలిపారు. దేశవ్యాప్తంగా 21 కేంద్రాలు.. హైదరాబాద్ కేంద్రంగా ట్రూజెట్ 2015 జూలైలో కార్యకలాపాలను ప్రారంభించింది. ఉడాన్ పథకం ఆసరాగా మెట్రోలతో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలను అనుసంధానిస్తూ విమానయాన సేవలను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరుతోపాటు విజయవాడ, రాజమండ్రి, కడప, తిరుపతితోసహా 21 కేంద్రాలున్నాయి. ఇప్పటి వరకు 28.2 లక్షల మంది ట్రూజెట్‌లో ప్రయాణించారు. సంస్థ ఖాతాలో ఏడు విమానాలు వచ్చి చేరాయి. ఏటీఆర్–72 రకం ఎయిర్క్రాఫ్ట్స్ను కంపెనీ వినియోగిస్తోంది. హైదరాబాద్–ఔరంగాబాద్ సెక్టార్లో ట్రూజెట్ మాత్రమే సర్వీసులను నడుపుతోంది. కాగా, లక్ష్మీ ప్రసాద్ గతంలో హైదరాబాద్‌లో చార్టర్డ్ అకౌంటెంట్‌గా సేవలందించారు. 1997లో యూఎస్‌లో అడుగుపెట్టారు. గతేడాది ఎయిర్ ఇండియా ఉద్యోగులతో కలిసి ఆ సంస్థను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. -
బీదర్‌కు ట్రూజెట్ సర్వీసులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రూజెట్ పేరుతో విమాన సేవల్లో ఉన్న హైదరాబాద్ సంస్థ టర్బో మేఘా ఎయిర్వేస్ తాజాగా తన నెట్‌వర్క్‌లోకి బీదర్‌ను చేర్చింది. ఉడాన్ సర్వీసుల్లో భాగంగా బెంగళూరు–బీదర్–బెంగళూరు మధ్య ఫ్లయిట్‌ను ప్రతిరోజూ నడుపుతారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కొత్త సర్వీసును శుక్రవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం మంత్రులు, కంపెనీ ప్రతినిధులతో కలిసి విమానంలో బీదర్ ప్రయాణించారు. బస్సులో 12 గంటల సమయం పడుతుందని, విమానంలో గంట 40 నిమిషాల్లోనే చేరుకున్నామని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. బీదర్ చేరికతో ట్రూజెట్ నెట్‌వర్క్‌లో డెస్టినేషన్ల సంఖ్య 24కు చేరుకుందని టర్బో మేఘా ఎయిర్వేస్ డైరెక్టర్ కె.వి.ప్రదీప్ వెల్లడించారు. కార్యకలాపాలు ప్రారంభించిన నాలుగేళ్లలోనే ఈ స్థాయికి చేరుకున్నామని కంపెనీ సీఈవో కల్నల్ ఎల్ఎస్ఎన్ మూర్తి తెలిపారు. కాగా, స్ప్రింగ్ సర్ప్రైజ్ పేరుతో నాలుగు రోజుల సేల్‌లో భాగంగా బెంగళూరు–బీదర్–బెంగళూరు రూట్లో బేస్ ఫేర్ రూ.699కే అందిస్తోంది. సర్వీసు ప్రారంభిస్తున్న కర్ణాటక సీఎం, తదితరులు -
లాభాల్లోకి ట్రూజెట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన రంగ కంపెనీలు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న ఈ తరుణంలో... తెలుగు రాష్ట్రాలకు చెందిన ట్రూజెట్ మాతృ సంస్థ టర్బో మేఘా ఎయిర్వేస్ మాత్రం తొలిసారి లాభాల్లోకి ప్రవేశించినట్లు ప్రకటించింది. 2018 అక్టోబరు నుంచి నష్టాలు లేవని, నిర్వహణ లాభాలు ఆర్జిస్తున్నామని కంపెనీ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థకు రూ.85 కోట్ల నష్టాలొచ్చాయి. ఈ ఏడాది ఫలితాలింకా ఆడిట్ కాలేదని, కాకపోతే తాము లాభాల్లోకి మాత్రం ప్రవేశిస్తున్నామని సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కె.జి.విశ్వనాథ్ చెప్పారు. దాదాపు 23% ఎబిటా మార్జిన్లు సాధిస్తున్నామని, ఇది ఈ రంగంలోని అన్ని కంపెనీలకన్నా ఎక్కువని కంపెనీ సీసీవో సుధీర్ రాఘవన్ వెల్లడించారు. సంస్థకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారమిక్కడ వారితో పాటు సీఈఓ మూర్తి, ఈ కంపెనీని ప్రమోట్ చేస్తున్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా(ఎంఈఐఎల్) గ్రూప్ డైరెక్టర్ కె.వి.ప్రదీప్ విలేకరులతో మాట్లాడారు. కంపెనీ భవిష్యత్ ప్రణాళికలు వివరించారు. చేతికి కొత్త విమానాలు.. 2015లో హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటయిన ట్రూజెట్.. రెండు విమానాలతో మొదలై ప్రస్తుతం 5 విమానాలకు చేరుకుంది. గతేడాది జెట్ ఎయిర్వేస్ నుంచి సిబ్బందితో సహా 5 విమానాలను లీజుకు తీసుకుని సంఖ్యను 10కి చేర్చాలని లకి‡్ష్యంచినా... జెట్ సంక్షోభం కారణంగా కుదరలేదు. ‘‘నవంబరు–డిసెంబరు మా విమానాల సంఖ్య 10కి చేరుతుంది. 2020లో మరో 5–8 జతకూడనున్నాయి. ఈశాన్య రాష్ట్రాల రూట్లకు సంబంధించి గతేడాదే ఉడాన్ బిడ్లు సాధించాం. మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాం’’ అని ప్రదీప్ వివరించారు. స్వయంగా ఎదగటానికే ప్రయత్నిస్తామని, ఇతర సంస్థల్ని కొనేందుకు సరైన అవకాశం వస్తే మాత్రం పరిశీలిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారాయన. ప్రస్తుతం కంపెనీలో మేఘా ఇంజినీరింగ్‌కు 90 శాతం వాటా ఉందని, నిధుల కోసం దీన్ని పబ్లిక్ ఇష్యూకు తెచ్చి, వాటాలు విక్రయించే యోచనేదీ ప్రస్తుతమైతే లేదని స్పష్టంచేశారు. ‘‘మేం గణనీయమైన స్థాయికి చేరాలి. అందుకు కనీసం మూడేళ్లు పడుతుందని నా అంచనా. ఆ స్థాయికి చేరిన తరవాత మాత్రం పబ్లిక్ ఇష్యూకు వచ్చే ఆలోచన తప్పకుండా చేస్తాం’’ అని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆదాయానికి మూడు మార్గాలు! ఖర్చులు తగ్గించుకోవటంతో పాటు లాభాల్లోకి ప్రవేశించడానికి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు కూడా అన్వేషిస్తున్నట్లు విశ్వనాథ్ చెప్పారు. ‘‘ప్రయాణికు లకు యాడ్ ఆన్ సేవలందించడం, ఇతర విమానయాన కంపెనీలకు థర్డ్‌పార్టీ సర్వీసులివ్వటం, విమానాల్లో ప్రకటనలు వంటి మార్గాలన్నీ అన్వేషిస్తున్నాం. అందుకే వేగంగా నష్టాల నుంచి బయటపడ్డాం. విమానయాన రంగం తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న ఈ తరుణంలో కూడా చక్కని వృద్ధిరేటుతో మేం లాభాల్లోకి మళ్లగలిగాం’’ అని ఆయన వివరించారు. అందుకే ఒక సీట్ కిలోమీటర్‌కు (అంటే ప్రయాణించే ప్రతి కిలోమీటరుకు ఒక సీటు ఆర్జించే ఆదాయం) తాము ఆర్జిస్తున్న ఆదాయం పోటీ కంపెనీలకన్నా 40% ఎక్కువగా ఉందని చెప్పారు. ‘‘2019లో మరో 6 కొత్త గమ్యాలకు విమానాలు నడుపుతాం. 2020 నాటికి ఈ సంఖ్య రెట్టింపవుతుంది. ప్రస్తుతం నెలకు 1,200 సర్వీసులు నడుస్తున్నాయి. కొత్త విమానాల చేరికతో ఇది 2,500లకు చేరుతుంది’’ అని చెప్పారు. ప్రస్తుతం సంస్థలో 700 మంది ఉద్యోగులున్నారని, ఇటీవలే జెట్ ఎయిర్వేస్ నుంచి 100 మందిని తీసుకున్నామని, కార్యకలాపాలు విస్తరిస్తున్న దృష్ట్యా వచ్చే 6 నెలల్లో మరో 300 మందిని నియమించుకుంటామని వివరించారాయన. ప్రయాణికులు 6 శాతమే... కడప, బళ్ళారి (విజయనగర్) సహా వేరెవ్వరూ నడపని పలు ప్రాంతాలకు తాము విమానాలు నడుపుతున్నామని, దీనివల్ల పలు గ్రామీణ ప్రాంతాలను విమానరంగ కనెక్టివిటీకి చేరువ చేశామని సంస్థ సీఈఓ, రిటైర్డ్ కల్నల్ ఎల్.ఎస్.ఎన్.మూర్తి చెప్పారు. ‘‘దేశంలో విమాన ప్రయాణం చేసేవారి సంఖ్య 6 శాతమే. అదే చైనాలో తీసుకుంటే 22 శాతం. ఈ సంఖ్య పెరగటం వల్ల ఎయిర్వేస్ సంస్థలే కాదు. విమానాశ్రయాలు నిర్వహించే కంపెనీలు, ప్రయాణికులు... ఇలా ఈ రంగంతో సంబంధం ఉన్నవారంతా లబ్ధి పొందుతారు. ఈ సంఖ్య ఇంకా పెరగాల్సి ఉంది’’ అని అభిప్రాయపడ్డారు. -
ట్రూజెట్ ‘ఉడాన్’..!
⇒ కొత్తగా 16 చిన్న పట్టణాలకు విమాన సర్వీసులు... ⇒ టర్బో మేఘా ఎయిర్వేస్కు గ్రీన్‌సిగ్నల్ ⇒ కంపెనీ ఎండీ వంకాయలపాటి ఉమేష్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో ట్రూజెట్ పేరుతో ప్రాంతీయ విమాన సర్వీసులు అందిస్తున్న టర్బో మేఘా ఎయిర్వేస్ చిన్న పట్టణాల్లో అడుగుపెడుతోంది. ఇప్పటి వరకు 10 నగరాలకు సేవలు అందిస్తున్న ఈ సంస్థ ఉడాన్ ప్రాజెక్టులో పాలు పంచుకుంటోంది. ఇందులో భాగంగా 16 చిన్న పట్టణాలకు సర్వీసులు అందించేందుకు రెడీ అయింది. కొన్ని రూట్లకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకుంది. కొత్త కేంద్రాలకు సేవలు ఎప్పటి నుంచి ప్రారంభించేది మార్చి 30న ఖరారు అవుతుందని టర్బో మేఘా ఎయిర్వేస్ ఎండీ వంకాయలపాటి ఉమేష్ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. నిర్దేశించిన రూట్లలో ప్రతి రోజు కనీసం ఒక్క సర్వీసు అయినా ఉంటుందని పేర్కొన్నారు. చిన్న పట్టణాలకు విమాన సేవలు విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉడే దేశ్కే ఆమ్ నాగరిక్ (ఉడాన్) ప్రాజెక్టు చేపట్టడం తెలిసిందే. ఇవీ ట్రూజెట్ కొత్త రూట్లు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలో ట్రూజెట్ కొత్త రూట్లు రానున్నాయి. కడప–విజయవాడ, కడప–చెన్నై, కడప–హైదరాబాద్, హైదరాబాద్–నాందేడ్, నాందేడ్–ముంబై, హైదరాబాద్–బళ్లారి, బళ్లారి–బెంగళూరు, చెన్నై–కడప, చెన్నై–మైసూరు, చెన్నై–సేలం తదితర రూట్లు వీటిలో ఉన్నాయి. అలాగే బెంగళూరు–బీదర్, చెన్నై–హŸస్సూరు రూట్లకు కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి ట్రూజెట్‌కు అనుమతి రావాల్సి ఉంది. కంపెనీ వద్ద ప్రస్తుతం నాలుగు విమానాలు ఉన్నాయి. ఒక్కో ఫ్లయిట్ సామర్థ్యం 72 సీట్లు. ఏప్రిల్‌లో మరో విమానం జతకూడుతోంది. 2017 డిసెంబరు నాటికి మొత్తం 8 విమానాలు కంపెనీ వద్ద ఉంటాయని ఉమేష్ తెలిపారు. ఉడాన్‌తో జోష్.. రానున్న రోజుల్లో ప్రాంతీయ విమానయాన రంగంలో ఉడాన్ జోష్‌నిస్తుందని ఉమేష్ తెలిపారు. చిన్న నగరాలకు విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ రూట్లో అయినా ఒక గంట ప్రయాణానికి ఒక్కో టికెట్ ధర రూ.2,500 మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ట్రూజెట్ ద్వారా 2.5 లక్షల మందికిపైగా కస్టమర్లు పలు నగరాలకు ప్రయాణించారని వివరించారు. రెండేళ్లలో దేశవ్యాప్తంగా సేవలు అందించాలని భావిస్తున్నట్టు తెలిపారు. కంపెనీ వద్ద ప్రస్తుతం 450 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మరో నాలుగు కంపెనీలు.. ఉడాన్ ప్రాజెక్టులో ట్రూజెట్తోపాటు డెక్కన్ చార్టర్, ఎయిర్ ఒడిషా, అలయన్స్ ఎయిర్, స్పైస్ జెట్ సైతం పాలుపంచుకుంటున్నాయి. ఈ అయిదు కంపెనీలకు 70 రూట్ల దాకా కేటాయించినట్టు తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాల్లో ట్రూజెట్తోపాటు ఈ కంపెనీలు సర్వీసులు అందించనున్నాయి. దేశవ్యాప్తంగా 11 కంపెనీలు ప్రస్తుతం 43 విమానాశ్రయాల కోసం రూట్లను ప్రతిపాదించాయి. ఉడాన్ ప్రాజెక్టు అమలు బాధ్యతను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చేపట్టింది. 43 విమానాశ్రయాల్లో 31 కేంద్రాలకు అసలు విమానాలే నడవడం లేదు. మిగిలిన 12 విమానాశ్రయాలకు సర్వీసులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. -
గన్నవరం నుంచి నూతన విమాన సర్వీసులు
విమానాశ్రయం(గన్నవరం): ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో గన్నవరం విమానాశ్రయానికి కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. టర్బో మెగా ఎయిర్వేస్కు చెందిన ట్రూజెట్తోపాటు స్పైస్‌జెట్ సంస్థలు కొత్తగా అదనపు విమాన సర్వీసులు నడిపేందుకు ముందుకువచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై, కడప, తిరుపతికి విమాన సర్వీసులు నడుపుతున్న ట్రూజెట్ సంస్థ ఈ నెల 20వ తేదీ నుంచి హైదరాబాద్‌కు రెండవ విమాన సర్వీసును నడపనుంది. ఈ విమానం ప్రతిరోజు మధ్యాహ్నం 12.40కు గన్నవరం నుంచి బయలుదేరి 1.40కు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. ఫిబ్రవరి 19 నుంచి వారణాసికి సర్వీస్ స్పైస్‌జెట్ విమాన సంస్థ ఫిబ్రవరి 19వ తేదీ నుంచి వారణాసి నుంచి హైదరాబాద్ మీదుగా ఇక్కడికి నూతన సర్వీస్‌ను ప్రారంభించనుంది. ఈ విమాన సర్వీస్ మంగళవారం మినహా వారంలో ఆరు రోజులపాటు ఉంటుంది. ఈ విమానం ప్రతిరోజు వారణాసి నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరి హైదరాబాద్ మీదుగా మధ్యాహ్నం 1.50కు గన్నవరం చేరుకుంటుంది. ఇక్కడ మధ్యాహ్నం 2.40 గంటలకు బయలుదేరి హైదరాబాద్ మీదుగా సాయంత్రం 6.55కు వారణాసి చేరుకుంటుంది. ఈ సర్వీస్ నిమిత్తం స్పైస్‌జెట్ సంస్థ 189 సీటింగ్ కెపాసిటీ కలిగిన 737–800 బోయింగ్ విమానాన్ని నడపనుంది. ప్రస్తుతం ఇక్కడికి రాకపోకలు సాగిస్తున్న విమానాల్లో ఇదే అతిపెద్ద విమానం కావడం విశేషం.