గన్నవరం నుంచి నూతన విమాన సర్వీసులు
విమానాశ్రయం(గన్నవరం): ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో గన్నవరం విమానాశ్రయానికి కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. టర్బో మెగా ఎయిర్‌వేస్‌కు చెందిన ట్రూజెట్‌తోపాటు స్పైస్‌జెట్ సంస్థలు కొత్తగా అదనపు విమాన సర్వీసులు నడిపేందుకు ముందుకువచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై, కడప, తిరుపతికి విమాన సర్వీసులు నడుపుతున్న ట్రూజెట్ సంస్థ ఈ నెల 20వ తేదీ నుంచి హైదరాబాద్‌కు రెండవ విమాన సర్వీసును నడపనుంది. ఈ విమానం ప్రతిరోజు మధ్యాహ్నం 12.40కు గన్నవరం నుంచి బయలుదేరి 1.40కు హైదరాబాద్‌కు చేరుకుంటుంది.
ఫిబ్రవరి 19 నుంచి వారణాసికి సర్వీస్
స్పైస్‌జెట్ విమాన సంస్థ ఫిబ్రవరి 19వ తేదీ నుంచి వారణాసి నుంచి హైదరాబాద్ మీదుగా ఇక్కడికి నూతన సర్వీస్‌ను ప్రారంభించనుంది. ఈ విమాన సర్వీస్ మంగళవారం మినహా వారంలో ఆరు రోజులపాటు ఉంటుంది. ఈ విమానం ప్రతిరోజు వారణాసి నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరి హైదరాబాద్ మీదుగా మధ్యాహ్నం 1.50కు గన్నవరం చేరుకుంటుంది. ఇక్కడ మధ్యాహ్నం 2.40 గంటలకు బయలుదేరి హైదరాబాద్ మీదుగా సాయంత్రం 6.55కు వారణాసి చేరుకుంటుంది. ఈ సర్వీస్ నిమిత్తం స్పైస్‌జెట్ సంస్థ 189 సీటింగ్ కెపాసిటీ కలిగిన 737–800 బోయింగ్ విమానాన్ని నడపనుంది. ప్రస్తుతం ఇక్కడికి రాకపోకలు సాగిస్తున్న విమానాల్లో ఇదే అతిపెద్ద విమానం కావడం విశేషం.