
విజయవాడ: గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కుట్రను బట్టబయలు చేశాడు ముదునూరి సత్యవర్థన్. గన్నవరం టిడిపి ఆఫీస్ దాడి కేసులో ఫిర్యాదు దారుడిగా ఉన్న సత్యవర్ధన్.. తనకు ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదని జడ్జి ముందు తేల్చిచెప్పాడు. కేసు విరమించుకుంటున్నట్లు జడ్జికి తెలిపాడు సత్యవర్థన్. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు మేజిస్ట్రేట్ ముందు తనను పోలీసులు ఎలా ఒత్తిడి పెట్టారో స్పష్టం చేశాడు. తనకు పోలీసుల నుంచి రక్షణ కల్పించాలని జడ్జిని వేడుకున్నాడు సత్యవర్థన్.
కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, స్వయంగా అఫిడవిట్ సమర్పించాడు. తనను సాక్షిగా పిలిచి సంతకం చేయించుకున్నారని సత్యవర్థన్ తెలిపాడు. తనను ఎవరూ కులం పేరుతో దూషించలేదని పేర్కొన్నాడు. గన్నవరం టీడీపీ ఆఫీస్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసిన తనపై పోలీసులే ఒత్తిడి తెచ్చి కేసును నమోదు చేయించారన్నాడు. టీడీపీ నేతలు , పోలీసులు కుట్ర చేసి కేసు నమోదు చేశారన్నాడు,. ఆ రోజు తాను అక్కడేలేనని పేర్కొన్నాడు సత్యవర్థన్. సత్యవర్ధన్ స్టేట్‌మెంట్‌ను స్వయంగా రికార్డు చేశారు జడ్జి. సత్యవర్ధన్‌కు అతని కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు.