సాక్షి, కృష్ణా : పవన్ రాజకీయాలను మారుస్తానంటారని, రాజకీయ పార్టీ అధినేతగా సమాచారం తెలుసుకుని మాట్లాడాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ అన్నారు. ఎవరో చెప్పిన మాటలు విని గోబెల్స్ ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. గన్నవరం మండలంలో గురువారం వల్లభనేని వంశీ ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘నారా భువనేశ్వరిని నేను ఎప్పుడూ ఒక్కమాట అనలేదు. నేను అన్నట్లు విన్నారా... చూశారా... వీడియో ఉందా?. లోకేష్ నన్ను, నా కుంటుంబ సభ్యులపై ఐటీడీపీతో సోషల్ మీడియాలో వార్తలు రాయించాడు. ఇలాంటి సంస్కృతి మంచిది కాదని లోకేష్‌కు చెప్పా. నేను అసెంబ్లీలో భువనేశ్వరి గురించి మాట్లాడారని పవన్ అంటున్నారు.
ఆరోజు నేను అసలు అసెంబ్లీలోనే లేను. ఐఎస్‌బీ మొహాలీలో కోర్సు కోసం పంజాబ్‌లో ఉన్నా. పవన్ మాటలు హాస్యాస్పదం. ఎవరో చెప్పిన మాటలు విని పవన్ మాట్లాడటం సరికాదు. నేను అనని మాట నాకు ఆపాదించారు. నేను ఎవరినీ ఏమీ అనకపోయినా క్షమాపణ చెప్పాను. కానీ కొందరు లోకేష్ దగ్గరకు వెళ్లి మీ అమ్మను అన్నారంటూ తప్పుడు సమాచారం ఇచ్చారు’’ అని వంశీ తెలిపారు.
చంద్రబాబు, టీడీపీ నేతలపై వంశీ సెటైర్లు
‘‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం పార్లమెంట్‌లో పెట్టింది. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందాక రాష్ట్రాలు అంగీకరించాల్సిందే. చంద్రబాబు, టీడీపీ నేతలు ఇప్పుడే కళ్లు తెరిచినట్లు మాట్లాడుతున్నారు. పార్లమెంట్‌లో, అసెంబ్లీలో మద్దతిచ్చింది వీళ్లే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు.
ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఏమీ లేదు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పని కూడా గుర్తుకురాదు. చంద్రబాబు విద్వేషంతో అబద్ధపు ప్రచారం చేస్తున్నాడు. గత మూడు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేశా. తొలిసారి వైసీపీ తరపున పోటీచేస్తున్నా. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఎన్నికల్లో చంద్రబాబు ఏం చెబితే అదే ప్రజలకు చెప్పేవాళ్లం. అధికారంలోకి వచ్చాక ఏం చేయలేకపోయేవాళ్లం.
చంద్రబాబు రుణమాఫీ చేస్తానన్నాడు... చేయలేదు. బ్యాంకుల్లో బంగారం విడిపిస్తానన్నాడు... చేయలేదు. బాబు వస్తే జాబు అన్నాడు... ఎవరికీ జాబు రాలేదు’’అని వంశీ మండిపడ్డారు. ఇక.. మానవ వనరుల అభివృద్ధితోనే సమాజం అభివృద్ధి అని సీఎం జగన్ నమ్మారు. దేశ రాజకీయాల్లో మేనిఫెస్టోను తూ.చా తప్పకుండా అమలు చేసిన ఒకే ఒక్కరు సీఎం జగన్ అని వంశీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment