
అగ్ని ప్రమాదంతో 18 గంటలు నిలిచిన రాకపోకలు
లండన్: అగ్ని ప్రమాదం కారణంగా దాదాపు 18 గంటలపాటు మూతబడిన లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు తిరిగి మొదలయ్యాయి. శనివారం ఉదయం నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలను పునరుద్ధరించినట్లు హీత్రూ విమానాశ్రయం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, విమానాల రాకపోకలకు కలిగిన అంతరాయం ప్రభావం మరికొన్ని రోజులపాటు కొనసాగుతుందని పేర్కొంది.
‘టెర్మినల్స్ వద్ద అదనంగా వందల సంఖ్యలో సిబ్బందిని సిద్ధంగా ఉంచాం. శనివారం అదనంగా మరో పది వేల మంది ప్రయాణికులను పంపించేందుకు విమానాల షెడ్యూల్‌ను తయారు చేశాం’అని హీత్రూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ థామస్ వోల్డ్‌బై ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ప్రమాద ఘటనకు ఎయిర్‌పోర్టు కారణం కాదనే విషయం గుర్తుంచుకోవాలి. అంతేకాదు, రోజులపాటు మూసివేయలేదు, హీత్రూ కేవలం కొన్ని గంటలు మూతబడిందంతే. బ్యాకప్ వ్యవస్థను కూడా అత్యవసరాల్లో మాత్రమే ఉపయోగపడేలా డిజైన్ చేశారు. అది కూడా మొత్తం విమానాశ్రయాన్ని నడిపేందుకు సరిపోదు. హీత్రూకు ఒక చిన్న నగరానికి సరిపడా విద్యుత్ అవసరమవుతుంది. ఇతర విమానాశ్రయాల్లోనూ గతంలో ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి’అని ఆయన వివరించారు.
అయితే, ఎయిర్‌పోర్టుకు బయలుదేరే ముందు సంబంధిత ఎయిర్‌లైన్స్ నుంచి వివరాలను చెక్ చేసుకోవాలని ప్రయాణికులను కోరారు. శనివారం హీత్రూ నుంచి రాకపోకలు సాగించాల్సిన తమ 600 విమాన సర్వీసులకు గాను 85 శాతం మేర పునరుద్ధరించినట్లు బ్రిటిష్ ఎయిర్‌వేస్ తెలిపింది. అనూహ్యంగా చోటుచేసుకున్న ఘటన తర్వాత తిరిగి పూర్తిస్థాయిలో సేవలను పునరుద్ధరించడం ఎంతో క్లిష్టమైన వ్యవహారమని పేర్కొంది. హీత్రూకు 2 మైళ్ల దూరంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదంతో విమానాశ్రయంలో కరెంటు సరఫరా నిలిచిపోయింది.
దీని కారణంగా 1,300కు పైగా విమానాలు రద్దు కాగా ఆ ప్రభావం 2 లక్షల మంది ప్రయాణికులపై పడింది. శుక్రవారం రాత్రికి స్వల్ప సంఖ్యలో విమానాల రాకపోకలను పునరుద్ధరించగలిగారు. అయితే, తమకు కలిగిన తీవ్ర అసౌకర్యంపై హీత్రూ విమానాశ్రయం అధికారులపై ప్రయాణికులు మండిపడుతున్నారు. అగ్ని ప్రమాదం వెనుక కుట్ర కోణం లేదంటున్న పోలీసులు..సబ్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విద్యుత్ పరికరాలపైనే దృష్టి పెట్టినట్లు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయాల్లో ఒకటైన హీత్రూ నుంచి గతేడాది 8.39 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు.
ఎయిరిండియా సేవలు ప్రారంభం
న్యూఢిల్లీ: లండన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్టుకు విమానాల రాకపోకలను ప్రారంభించినట్లు ఎయిరిండియా శనివారం తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఎయిరిండియాతోపాటు వర్జిన్ అట్లాంటిక్, బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానాలు శనివారం షెడ్యూల్ ప్రకారం నడిచాయి. శుక్రవారం హీత్రూ మూతబడటంతో దేశంలోని వివిధ నగరాల నుంచి పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు కావడం తెల్సిందే. ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఎయిరిండియా నిత్యం ఆరు విమానాలను హీత్రూకు నడుపుతోంది. బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన మొత్తం 8 విమానాలు హీత్రూ ఢిల్లీ, ముంబైల మధ్య రాకపోకలు సాగిస్తుంటాయి. వర్జిన్ అట్లాంటిక్ కూడా ఢిల్లీ, ముంబై, బెంగళూరుల నుంచి హీత్రూకు ఐదు సర్విసులను నడుపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment