Heathrow airport
-
సిద్ధార్థ్ ప్రేయసికి చేదు అనుభవం.. ఏకంగా ఆరుగంటలకు పైగా!
ఇటీవలే హీరామండి ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్‌తో అభిమానులను మెప్పించిన బ్యూటీ ఆదితి రావు హైదరీ. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరెకెక్కించిన ఈ సిరీస్‌కు విశేషమైన స్పందన వస్తోంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఈనెల 23న ముంబయిలో జరిగిన సోనాక్షి సిన్హా పెళ్లికి హాజరయ్యాడు. తనకు కాబోయే భర్త సిద్దార్థ్‌తో కలిసి రిసెప్షన్లో పాల్గొన్నారు.అయితే తాజాగా ఆదితి రావు హైదరీకి ఇంగ్లాండ్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఆ దేశంలోని హీత్రో ఎయిర్‌పోర్ట్‌లో లగేజీ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని తెలిపింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. తన లగేజీ కోసం ఆరు గంటలకు పైగా విమానాశ్రయంలో వేచి ఉండాల్సి వచ్చిందని వెల్లడించింది. ఇదొక 'చెత్త ఎయిర్పోర్ట్ అని కామెంట్ చేసింది. అక్కడి ఎయిర్పోర్ట్ సిబ్బంది తనకు సాయం చేయకుండా.. లగేజీ కోసం ఎయిర్‌లైన్ సంస్థను సంప్రదించమని సలహా ఇచ్చారని వివరించింది. దాదాపు ఆరు గంటల తర్వాత కూడా తన లగేజీ అందలేదని అదితి వెల్లడించింది.కాగా.. ఆదితి రావు హైదరీ ఢిల్లీ- 6 మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. సోనమ్ కపూర్, అభిషేక్ బచ్చన్ నటించిన ఈ చిత్రంలో సహాయక పాత్రలో కనిపించింది. ఆ తరువాత లండన్, పారిస్, న్యూయార్క్, మర్డర్ 3, వజీర్, పద్మావత్ లాంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఆదితి లయనెస్, గాంధీ టాక్స్ చిత్రాలలో కనిపించనుంది. అయితే వీటిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు ఈ ఏడాది హీరో సిద్ధార్థ్‌తో ఆదితిరావు ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. -
లండన్ ఎయిర్‌పోర్టులో ప్రమాదం.. రెండు విమానాల ఢీ..
లండన్: అప్పుడప్పుడు అనుకోకుండా జరిగే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద ప్రమాదాలకు కారణమవుతాయి. శనివారం లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో వర్జిన్ అట్లాంటిక్ బోయింగ్ 787 విమానం.. బ్రిటిష్ ఎయిర్వేస్ ఎయిర్‌బస్ A350 విమానాన్ని అనుకోకుండా ఢీ కొట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బ్రిటన్‌లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన హీత్రూలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణీకులకు ఎలాంటి గాయాలు కాలేదని ఏవియేషన్ అధికారులు తెలిపారు. Just witnessed a plane crash at Heathrow! A tug pushing back a Virgin 787, crashed the wing into a BA A350 #Heathrow #BritishAirways #VirginAtlantic pic.twitter.com/9VmiP6uwQr — Alex Whittles (@PurpleFrogAlex) April 6, 2024 ఈ ప్రమాదం జరిగిన వెంటనే బృందం అప్రమత్తమైంది. ఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్లు కూడా చేరుకున్నాయి. ఇంజినీరింగ్ బృందాలు విమానాలను పర్యవేక్షిస్తున్నాయి. ప్రస్తుతం ఆ వాటిని సర్వీసు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ప్రభావం కస్టమర్ల మీద పడకుండా ఉండటానికి ప్రత్యామ్నాయ విమానం అందించినట్లు బ్రిటిష్ ఎయిర్వేస్ ఒక ప్రకటనలో తెలిపింది. Accident at #heathrow involving a #virginatlantic #boeing787 and a #britishairways #A350 #bigjettv @BigJetTVLIVE pic.twitter.com/Hm5Vh6ehrc — specialise cyclists (@slaytor_roger) April 6, 2024 -
ఎయిర్‌పోర్ట్‌లో యురేనియం కలకలం
లండన్: లండన్‌లోని అత్యంత రద్దీగా ఉండే హీత్రో అంతర్జాతీయ విమానాశ్రయంలో యురేనియం ఉన్న పార్సిల్ కలకలం సృష్టించింది. రెండు వారాల క్రితం అంటే గత ఏడాది డిసెంబర్ 29న జరిగిన ఈ ఘటనలో ఆలస్యంగా వెలుగుచూసింది. పాకిస్తాన్‌లోని కరాచీ నగరం నుంచి ఈ పార్సిల్ బ్రిటన్‌కు చేరినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. తుక్కు ఖనిజాలకు సంబంధించిన కార్గో పార్సిళ్ల మధ్యలో ఈ యురేనియం నింపిన పార్సిల్ ఒకదానిని ఎయిర్పోర్ట్ కార్గో సిబ్బంది స్కానింగ్ తనిఖీల సమయంలో గుర్తించారు. ఒక ఖనిజం కడ్డీల అడుగున దీనిని దాచి ఉంచినట్లు అధికారులు తెలిపారు. వెంటనే దీనిని బోర్డర్ ఆఫీసర్లకు అప్పగించగా దూరంగా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దేశ ఉగ్రవ్యతిరేక దళాలకు ఇచ్చేశారు. దీనిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. కరాచీ నుంచి ఒమన్‌లోని మస్కట్‌కు అక్కడి నుంచి ఒమన్ ఎయిర్‌లైన్స్ ద్వారా లండన్‌కు వచ్చినట్లు తేల్చారు. ఇరాన్ జాతీయులకు అందజేసేందుకే దానిని బ్రిటన్‌కు తరలించారని బ్రిటిష్ మీడియాలో వార్తలొచ్చాయి. పాక్, ఒమన్లలో తనిఖీలను దాటించేసి బ్రిటన్‌కు యురేనియంను తరలించడం ఆందోళనకర విషయమని బ్రిటన్ సైన్యంలో రసాయనిక ఆయుధాల విభాగం మాజీ అధిపతి హ్యామిస్ బ్రెటన్ గార్డన్ వ్యాఖ్యానించారు. శిలల నుంచి సేకరించే రేడియోధార్మిక యురేనియంను అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, రియాక్టర్లలో ఇంధనంగా వినియోగిస్తారు. జలాంతర్గామి, అణ్వాయుధాల్లోనూ వాడతారు. లండన్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన పార్సిల్‌తో మాకు ఎలాంటి ప్రమేయం లేదని పాకిస్తాన్ తేల్చి చెప్పింది. మీడియాలో వచ్చే వార్తలన్నీ ఊహాత్మకమని పాకిస్తాన్ విదేశాంగ శాఖ స్పష్టంచేసింది. -
ఫస్ట్‌క్లాస్ టికెటెలా కొన్నాడో?
ముంబై: లండన్ హిత్రూ విమానాశ్రయంలో తనకు జాతి వివక్ష అనుభవం ఎదురైందని ప్రముఖ బాలీవుడ్ నటుడు సతీశ్ షా చెప్పారు. ఫస్ట్‌క్లాస్‌లో ప్రయాణానికి టికెటెలా కొన్నాడంటూ ఇద్దరు ఎయిర్‌పోర్టు సిబ్బంది తనను ఉద్దేశించి మాట్లాడుకున్నారని తెలిపారు. భారతీయుడిని కాబట్టి కొన్నానంటూ నవ్వుతూ బదులిచ్చానని వెల్లడించారు. సతీశ్ ట్వీట్ వైరల్‌గా మారింది. 12,000 లైక్‌లు రాగా 1,300 మంది రీట్వీట్ చేశారు. భారతీయుడిని కాబట్టి ఖరీదైన టికెట్ కొన్నానంటూ సతీశ్ షా జవాబు చెప్పడం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. బ్రిటిషర్లు భారత్‌ను 200 ఏళ్లపాటు పాలించకపోతే ఇప్పుడు భారతీయులకు ఇంగ్లాండ్ ఒక కాలనీగా మారి ఉండేదని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు. సతీశ్ షా ను హిత్రూ విమానాశ్రయం ట్విట్టర్లో క్షమాప ణ కోరింది. ఆ సంఘటనకు సంబంధించిన ఇతర వివరాలు ఉంటే ఇవ్వాలని విన్నవించింది. -
నేను సేఫ్‌గా చేరుకున్నా: హీరోయిన్
భారత్‌లో కరోనా తీవ్రత అధికమవుతుండటంతో జనాలు భయాందోళన చెందుతున్నారు. తారల సంగతి సరేసరి... షూటింగ్స్‌కు నో చెప్పి ఇంట్లో నుంచి బయట కాలు మోపడం లేదు. ఇక దక్షిణాది కన్నా బాలీవుడ్లో, హాలీవుడ్లో పేరు ప్రఖ్యాతలు గడిస్తున్న హీరోయిన్ రాధికా ఆప్టే తాజాగా ఇండియాకు వచ్చింది. వచ్చిన పని ముగియగానే తిరుగు ప్రయాణమై లండన్‌లోని హీత్రో ఎయిర్‌పోర్టులో దిగింది.. అసలే కరోనా భయంతో ఎయిర్‌పోర్టులో భద్రత కట్టుదిట్టం చేయడమే కాక రకరకాల పరీక్షల పేరిట ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో రాధికాకు విమానాశ్రయంలో ఎన్ని ఇబ్బందులు తలెత్తాయో, ఎంత అసౌకర్యానికి లోనైందోనని ఆమె అభిమానులు, బంధువులు కాస్త కలవరపాటుకు లోనయ్యారు. దీనిపై రాధికా స్పందిస్తూ తనకు ఎలాంటి ఇబ్బంది ఎదురవలేదని, ఎవరూ కంగారు పడాల్సిన పని లేదని స్పష్టం చేసింది. (బొద్దుగా ఉన్నానని వద్దన్నారు!) ‘స్నేహితులు, బంధువుల నుంచి నాకు ఎన్నో మెస్సేజ్‌లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. మీరు కురిపించిన ప్రేమకు కృతజ్ఞతలు. నేను లండన్‌లో క్షేమంగా దిగాను. అక్కడ నాకు ఎలాంటి అసౌకర్యం కలగలేదు. ఇమ్మిగ్రేషన్ అధికారులు అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. విమానాశ్రయం అంతా నిర్మానుష్యంగా ఉంది’ అని చెప్పుకొచ్చింది. నిజానికి లండన్ నుంచి భారత్‌కు వెళ్లే ఫ్లైట్‌లో అసలు జనాలే లేరని, కానీ అక్కడి నుంచి లండన్‌కు తిరిగొచ్చే విమానం మాత్రం జనాలతో కిక్కిరిసిపోయిందని తెలిపిందీ మరాఠీ భామ. కరోనా ఎఫెక్ట్‌తో తన బిజీ షెడ్యూల్‌కు విరామం ఇచ్చి సామాజిక దూరాన్ని పాటించేందుకు సిద్ధమైనట్లు తన లేటెస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలుస్తోంది. (నా సక్సెస్ భిన్నం బాస్) View this post on Instagram #Golden #lastdayofwork #socialdistancingstartstomorrow A post shared by Radhika (@radhikaofficial) on Mar 17, 2020 at 8:05am PDT -
వీడు మామూలోడు కాడు : వైరల్
లండన్ : అన్నం పెట్టిన ఇంటికే కన్నం పెట్టాడు. తెలివిగా దోచుకున్నానని సంబరపడి అడ్డంగా దొరికిపోయాడు. విలాసవంతమైన జీవితం గడపాలన్న ఓ పనివాడి దుర్బుద్ధి అతడిని జైలు పాలు చేసింది. వివరాల్లోకి వెళితే.. లండన్‌కు చెందిన రస్సెల్ లిబ్రండ అక్కడి హాత్రో విమానాశ్రయంలోని ‘‘బ్రేజన్ బూట్స్’’ దుకాణంలో పనిచేసేవాడు. కానీ, కొన్ని నెలల క్రితం పనిమానేసి అక్కడినుంచి వెళ్లిపోయాడు. అతడు వెళ్లిపోయిన తర్వాత షాపు యాజమాన్యం నగదు లావాదేవీల్లో పెద్ద మొత్తం తేడాను గమనించారు. ఇందుకు గల కారణం తెలుసుకోవటానికి సీసీ కెమెరాలను పరిశీలించి చూడగా నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి. అక్కడ పని మానేసి వెళ్లిపోయిన లిబ్రండ డబ్బు దొంగలించటం వారికంట పడింది. డబ్బుల కౌంటర్ దగ్గర ఉండే లిబ్రండ కస్టమర్లు ఇచ్చిన నగదును(ముఖ్యంగా పెద్దనోట్లను) మడతపెట్టి అటు ఇటు చూసి టక్కున జేబులో పెట్టుకునే వాడు. తన తలపైనే సీసీ కెమెరా ఉందన్న సంగతి తెలియక విచ్చలవిడిగా డబ్బు దొంగలించాడు. ఇలా ఒక వారంలో 700 పౌండ్ స్టెర్లింగులు మాయం చేశాడు. ఒకటి రెండు సార్లు కాదు ఏకంగా 130 సార్లు మొత్తం 16000(రూ. 13లక్షలు) పౌండ్ స్టెర్లింగులు దొంగలించాడు. దీంతో షాపు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లిబ్రండ కోసం అతడి ఇంటికి వెళ్లి చూడగా ఖరీదైన బట్టలు, బంగారు నగలు, కంప్యూటర్లు, ఐ ఫోన్స్, టీవీలు దర్శనమిచ్చాయి. వాడ్రోబ్లోని బ్యాగ్‌లో లిబ్రండ దాచుకున్న 6000 పౌండ్ స్టెర్లింగులు దొరికాయి. దీంతో లిబ్రాండాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కొద్దిరోజుల తర్వాత కోర్టులో హాజరుపరచగా 18నెలల జైలు శిక్షతో పాటు 2000 పౌండ్ స్టెర్లింగులు జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. -
వైరల్ వీడియో: హోరు గాలిలో విమానం
లండన్ : హోరున తుపాను గాలులు. ఆకాశంలో ఎగురుతున్న విమానం కూడా ఊగిసలాడుతుందంటే.. తుపాను గాలుల తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో విమానాన్ని ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించాడు పైలెట్. కానీ కుదరలేదు. మరోవైపు తుపాను గాలులు విమానాన్ని కుదిపేస్తున్నాయి. పరిస్థితి చూసి ముందు భయపడిన పైలెట్ వెంటనే అప్రమత్తమై తన శాయశక్తుల ప్రయత్నించి.. ఎటువంటి ప్రమాదం లేకుండా విమానాన్ని మరో విమానాశ్రయంలో సేఫ్‌గా ల్యాండ్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పైలెట్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు నెటిజన్లు. లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో జరిగింది ఈ సంఘటన. బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన ఓ విమానం హైదరాబాద్ నుంచి లండన్ బయలుదేరింది. ప్రస్తుతం లండన్‌లో ఎరిక్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. హీత్రో విమానాశ్రయానికి చేరుకున్న విమానం మరో రెండు సెకన్లలో ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ తుపాను గాలులు విమానాన్ని కుదిపేశాయి. పైలట్ విమానాన్ని ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించాడు.. కానీ కుదరలేదు. దాంతో విమానం రన్‌వేను తాకిన సెకన్ల వ్యవధిలోనే మళ్లీ టేకాఫ్ అయ్యింది. వెంటనే అప్రమత్తమైన పైలెట్ ఎటువంటి ప్రమాదం జరగకుండా విమానాన్ని వేరే విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. We are live now on our Elite Channel from #Heathrow and witnessed this insane #TOGA ! Well done pilot! @British_Airways #BA276 #StormErik pic.twitter.com/WMEvJ4P387 — BIG JET TV (@BigJetTVLIVE) February 8, 2019 బిగ్ జెట్ టీవీ తన ట్విటర్లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. విమానం ల్యాండింగ్ సమయంలో చాకచక్యంగా వ్యవహరించిన పైలట్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు నెటిజన్లు. ఇప్పటి వరకు ఈ వీడియోను 3.32 మిలియన్ల మంది చూశారు. అయితే.. ఈ సంఘటన జరిగిన సమయంలో విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనే విషయం మాత్రం తెలియరాలేదు. -
పిట్ట దెబ్బకు విమానం నిలిపివేత..
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ నుంచి నెవార్క్ మీదుగా లండన్ వెళ్లాల్సిన ఏయిర్ ఇండియా ఫ్లైట్‌కు పక్షి అడ్డురావడంతో విమానాన్ని నిలిపివేశారు. ఈ హఠాత్పరిణామం బుధవారం హిత్రో విమానాశ్రయ సమీపంలో చోటుచేసుకుంది. ఏయిర్ఇండియాకు చెందిన ఏ1-171 విమానం 230 మంది ప్రయాణికులు, 50 మంది సిబ్బందితో లండన్ వెళ్తుండగా పక్షి అడ్డురావడంతో సాంకేతిక లోపం తలెత్తింది. ఇది గమనించిన పైలెట్లు విమానాన్ని హిత్రో విమానాశ్రయంలో నిలిపివేశారు. పక్షి ముక్కుతో విమానంపై దాడి చేయడంతో రాడార్ ఆంటీనా దెబ్బతిన్నదని పైలెట్లు తెలిపారు. ప్రయాణీకులందరికి మరో విమానంలో వెళ్లెలా సదుపాయం కల్పించారు. ఈ విమానంలో రిటర్న్ రావల్సిన ప్రయాణీకులకు లండన్- ముంబై విమానం ఏర్పాటు చేశామని ఏయిర్ ఇండియా తెలిపింది. విమానంలో తల్లెత్తిన సమస్యను పరిష్కరించిన తర్వాత సర్వీస్‌ను పునరుద్దరిస్తామని ఆ సంస్థ ప్రకటించింది. -
ఎలుక కారణంగా ఎగరని విమానం
లండన్: విమానం లోపల ఎలుకను గుర్తించడంతో ఇక్కడి హీత్రో విమానాశ్రయం నంచి అమెరికాకు వెళ్తోన్న బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం ఒకటి నాలుగు గంటలు ఆలస్యంగా బయల్దేరింది. విమానం వైరింగ్‌ను ఎలుక కొరికే ప్రమాదం ఉన్నందున దాన్ని బయటికి పంపించిన తరువాతే విమానం టేకాఫ్‌కు అనుమతి ఇచ్చారు. లోపల ఎలుక ఉండగా విమానం బయల్దేరదని, మరో విమానాన్ని సిద్ధం చేస్తామని సిబ్బంది ప్రకటించినా అది సాధ్యం కాలేదు. దీంతో ప్రయాణికులు నాలుగు గంటలు విమానాశ్రయంలోనే వేచి ఉండాల్సి వచ్చింది. చివరకు ఎలుకను బయటికి పంపించడంతో ఆ విమానం బయల్దేరింది. ఈ చిత్రమైన సంఘటన బుధవారం జరిగిందని బీబీసీ పేర్కొంది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి బ్రిటిష్ ఎయిర్వేస్ క్షమాపణ చెప్పింది. ఈ సంఘటనపై స్పందించేందుకు హీత్రో విమానాశ్రయం నిరాకరించింది. -
14.8 లీటర్ల అమ్మపాలు.. నేలపాలు!
పిల్లలకు అమ్మపాలను మించిన అమృతం లేదు. అలాంటి అమృతతుల్యమైన పాలను లండన్‌లోని హీత్రూ విమానాశ్రయ అధికారులు వృథాగా పారబోయడంపై ఓ మాతృమూర్తి ఆవేదన వ్యక్తం చేసింది. 8 నెలల తన చంటిబిడ్డ కోసం తీసుకెళుతున్న 14.8 లీటర్ల అమ్మపాలను నిబంధనలు అనుమతించవంటూ విమానాశ్రయ సిబ్బంది అడ్డుకున్నారు. ఆ పాలను పారబోసిన తర్వాతే ఆమెను విమానం ఎక్కేందుకు అనుమతించారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధిత మహిళ అమెరికాకు చెందిన జెస్సికా కోక్లే మార్టినెజ్ ఫేస్బుక్లో ఓ పోస్టు పెట్టింది. హీత్రూ విమానాశ్రయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఈ పోస్టులో ఆమె వివరించింది. తన 8 నెలల బిడ్డ కోసం అమ్మపాలు తీసుకొని వెళ్లకుండా అడ్డుకొని.. ఎయిర్‌పోర్టు సిబ్బంది తనను అవమానించారని, 8 నెలల తన పసిబిడ్డ రెండు వారాల ఆహారాన్ని దూరం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. హీత్రూ విమానాశ్రయం మాత్రం లండన్‌లోని నిబంధనల ప్రకారం ద్రవపదార్థాలు విమానంలో తీసుకువెళ్లడానికి అనుమతి లేదని, అత్యవసరమైన ద్రవపదార్థాలు మాత్రమే 100 ఎంఎల్‌కు మించకుండా తీసుకెళ్లేందుకు అనుమతి ఉందని చెబుతున్నారు. బిడ్డ వెంట ఉంటేనే తల్లిపాలు తీసుకువెళ్లేందుకు అనుమతి ఇస్తారని వివరణ ఇచ్చారు. అయితే, తాను ప్రయాణిస్తున్న సమయంలో తన చంటిబిడ్డ వెంటలేదని, అయినా అమ్మపాల విషయంలోనూ ఇంత కఠినంగా వ్యవహరించడం సమంజసం కాదని, ఉద్యోగం చేస్తూ పిల్లల ఆలనాపాలనా చూసే తనలాంటి తల్లులకు ఈ విషయంలో మినహాయింపు ఇవ్వాలని ఆమె కోరుతున్నది. -
ఎయిర్ పోర్ట్‌లో కత్తితో పొడుచుకున్నాడు
లండన్ : లండన్‌లో నిత్యం రద్దీగా ఉండే హీత్రూ ఎయిర్ పోర్ట్‌లో ఓ వ్యక్తి కత్తితో తనకు తాను పొడుచుకున్నాడు. ఈ ఘటనలో అతడి తలకు తీవ్ర గాయమైంది. ప్రయాణికులు వెంటనే స్పందించి... ఎయిర్ పోర్ట్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతడి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారని పోలీసులు చెప్పారు. ఎయిర్ పోర్ట్‌లో గట్టి భద్రత ఉందని మరో వ్యక్తి అతడిపై దాడి చేసే అవకాశం లేదని ఉన్నతాధికారి వెల్లడించారు. ఐదో టెర్మినల్ వద్ద షాపు బయట సదరు వ్యక్తి తనకు తాను పొడుచుకున్నాడని ప్రత్యక్షసాక్షులు వెల్లడించారని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభమైందని ఎయిర్ పోర్ట్ ఉన్నతాధికారి తెలిపారు. -
కత్తులతో భయపెట్టిన పైలట్
లండన్: జర్మన్వింగ్స్ విమానాన్ని కో-పైలట్ కూల్చేసిన ఘటన మర్చిపోకుండానే మరో పైలట్ ప్రయాణికులను భయపెట్టాడు. లండన్ నుంచి హాంగ్ కాంగ్ కు 260 మంది ప్రయాణికులను తీసుకెళ్లాల్సిన పైలట్ కత్తులతో పట్టుబడి కలకలం రేపాడు. కత్తులు కలిగివున్న పైలట్ ను లండన్ లోని హీత్రూ విమానాశ్రయంలో శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. విమాన సిబ్బందిని తనిఖీ చేస్తుండగా పైలట్ వద్ద కత్తులున్నట్టు గుర్తించారు. అదుపులోకి తీసుకున్న 61 ఏళ్ల పైలట్ ను తర్వాత స్థానిక పోలీసు స్టేషన్ కు తరలించి ప్రశ్నించారు. అనంతరం బెయిల్ పై అతడిని విడిచిపెట్టారు. ఇదంతా పూర్తయ్యే సరికి చాలా సమయం పట్టడంతో తమ జర్నీ పూర్తి చేయడానికి ప్రయాణికులు ఆదివారం వరకు వేచి చూడాల్సి వచ్చిందని స్కాట్లాండ్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. -
దుబాయ్ ఎయిర్ పోర్ట్ ఘనత
దుబాయ్: దుబాయ్ విమానాశ్రయం అరుదైన ఘనత సాధించింది. 2014లో ప్రపంచంలో అత్యంత రద్దీ కలిగిన ఎయిర్ పోర్టుగా నిలిచింది. లండన్ లోని హీత్రూ విమానాశ్రయాన్ని వెనక్కు నెట్టి ఈ ఘనత సాధించింది. గతేడాది 7 కోట్ల 4 లక్షల మందిపైగా ప్రయాణికులు దుబాయ్ విమానాశ్రయం మీదుగా రాకపోకలు సాగించారు. 2013తో పోలిస్తే ఈ సంఖ్య 6.1 శాతం అధికం. హీత్రూ ఎయిర్ పోర్టు నుంచి 6.8 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. అయితే దుబాయ్ విమానాశ్రయం స్థాయిలో వృద్ధి నమోదు చేయలేకపోయింది. ఈ ఏడాది ప్రయాణికుల సంఖ్య 7 కోట్ల 90 లక్షలకు పెరిగే అవకాశముందని దుబాయ్ అంచనా వేస్తోంది. కాగా, 32 బిలియన్ డాలర్ల వ్యయంతో కొత్త విమానాశ్రయం నిర్మించేందుకు దుబాయ్ సన్నాహాలు చేస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఏడాది 24 కోట్ల మంది ప్రయాణికులు దీని గుండా రాకపోకలు సాగిస్తారని అంచనా వేస్తున్నారు.