దుబాయ్ ఎయిర్ పోర్ట్ ఘనత
దుబాయ్: దుబాయ్ విమానాశ్రయం అరుదైన ఘనత సాధించింది. 2014లో ప్రపంచంలో అత్యంత రద్దీ కలిగిన ఎయిర్ పోర్టుగా నిలిచింది. లండన్ లోని హీత్రూ విమానాశ్రయాన్ని వెనక్కు నెట్టి ఈ ఘనత సాధించింది. గతేడాది 7 కోట్ల 4 లక్షల మందిపైగా ప్రయాణికులు దుబాయ్ విమానాశ్రయం మీదుగా రాకపోకలు సాగించారు. 2013తో పోలిస్తే ఈ సంఖ్య 6.1 శాతం అధికం.
హీత్రూ ఎయిర్ పోర్టు నుంచి 6.8 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. అయితే దుబాయ్ విమానాశ్రయం స్థాయిలో వృద్ధి నమోదు చేయలేకపోయింది. ఈ ఏడాది ప్రయాణికుల సంఖ్య 7 కోట్ల 90 లక్షలకు పెరిగే అవకాశముందని దుబాయ్ అంచనా వేస్తోంది.
కాగా, 32 బిలియన్ డాలర్ల వ్యయంతో కొత్త విమానాశ్రయం నిర్మించేందుకు దుబాయ్ సన్నాహాలు చేస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఏడాది 24 కోట్ల మంది ప్రయాణికులు దీని గుండా రాకపోకలు సాగిస్తారని అంచనా వేస్తున్నారు.