
విస్తరణ దిశగా ట్రూజెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రాంతీయ విమానయాన సంస్థ ట్రూజెట్ విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేసింది. వచ్చే ఆరు నెలల్లో మరో నాలుగు విమానాలను సమకూర్చుకోనున్నట్లు ప్రకటించింది. ఇప్పుడున్న రెండు విమానాలకు తోడు శుక్రవారం మూడో విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చింది. వచ్చే ఆగస్టు నాటికి మొత్తం విమానాల సంఖ్య 7కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ట్రూజెట్ మేనేజింగ్ డెరైక్టర్ ఉమేష్ వంకాయలపాటి తెలిపారు.
ప్రస్తుతం ఏడు పట్టణాలకు సర్వీసులను నడుపుతున్నామని, జనవరి 15 నుంచి పుణే, పాండిచ్చేరిలకు ప్రారంభించనున్నట్లు తెలిపారు. మార్చినాటికి మరో రెండు, ఆ తర్వాత సెప్టెంబర్ నాటికి మరో రెండు విమానాలు వస్తే పశ్చిమ, ఉత్తర భారతదేశ పట్టణాలకు విస్తరించనున్నట్లు తెలిపారు. ట్రూజెట్ సేవలు ప్రారంభించిన ఐదు నెలల్లోనే లక్ష మంది ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా రికార్డు సృష్టించింది.
ఈ నేపథ్యంలో తీసిన లక్కీ డ్రాలో హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణించిన వ్యక్తి లక్ష రూపాయల నగదు బహుమతిని గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 85 నుంచి 90 శాతం లోడ్ ఫ్యాక్టర్‌తో తమ సర్వీసులు నడుస్తున్నట్లు తెలిపారు. విస్తరణ కార్యకలాపాలకు అదనపు నిధుల సేకరణ అవసరం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.