సాక్షి, అమరావతి: భారీ వరద వచ్చినా చెక్కు చెదరకుండా ఉండేలా పింఛా ప్రాజెక్టును ప్రభుత్వం పునరుద్ధరించనుంది. గతేడాది నవంబర్‌లో వచ్చిన ఆకస్మిక వరదలకు దెబ్బతిన్న ఈ ప్రాజెక్టును రూ.68.32 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పునరుద్ధరించనుంది. ఇందుకోసం లంప్సమ్ – ఓపెన్ విధానంలో రెండేళ్లలో పూర్తి చేయాలనే షరతుతో ఈ నెల 5న జలవనరుల శాఖ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ నెల 26న ఆర్థిక బిడ్‌ను తెరిచి, రివర్స్ టెండరింగ్ ద్వారా తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించనున్నారు. అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లి మండలం ముడుంపాడు వద్ద పింఛా నదిపై 1954లో ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మించింది. కుడి కాలువ కింద 2211.31 ఎకరాలు, ఎడమ కాలువ కింద 1562.10 ఎకరాలు మొత్తం 3,773.41 ఎకరాలకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీ (పిల్ల కాలువలు)లను అభివృద్ధి చేసింది. అప్పట్లో పింఛాకు గరిష్టంగా 58 వేల క్యూసెక్కుల వరద వస్తుందనే అంచనాతో ప్రాజెక్టు నిర్మించారు.
గతేడాది నవంబర్ 14 నుంచి నల్లమల అడవుల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో పింఛా నది ఉప్పొంగింది. దాంతో గతేడాది నవంబర్ 18న లక్ష క్యూసెక్కులకుపైగా వరద వచ్చింది. వరద ధాటికి పింఛా ప్రాజెక్టు రింగ్ బండ్, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో పింఛాకు ఎంత వరద వచ్చినా చెక్కుచెదరకుండా ఉండేలా పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. పింఛాకు గరిష్టంగా వచ్చే వరదపై మళ్లీ అధ్యయనం చేసిన అధికారులు.. రూ.84.33 కోట్లతో పనులు చేపట్టడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వాటిని ప్రభుత్వం ఆమోదించింది. దాంతో పనరుద్ధరణ పనులకు 68.32 కోట్ల అంచనా వ్యయంతో అధికారులు టెండర్లు పిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment