బోయలపల్లె ఉన్నత పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతున్న విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్
సాక్షి, యర్రగొండపాలెం (ప్రకాశం): గతంలో ప్రజల వైపు కన్నెత్తి చూడని పాలకులను చూశాం.. గెలిచి పార్టీ ఫిరాయించిన నాయకులను చూశాం... ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేసే ప్రజా పాలన ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలు చూడబోతున్నారు అని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ చెప్పారు. బుధవారం యర్రగొండపాలెం మండలం సర్వాయపాలెంలో చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు గతంలో ఎన్నడు లేని విధంగా గొప్ప తీర్పు ఇచ్చారని, ప్రజలు మహత్తర ఆలోచన చేసి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకున్నారని అన్నారు. పూర్తిగా వెనకబడిన ప్రాంతాలు అన్ని రంగాల్లో పురోగతి సాధించాలన్న ఉద్దేశంతోనే జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రాంతానికి మంత్రి పదవిని ఇచ్చారని పేర్కొన్నారు.
అది తన వ్యక్తిగతం చూసికాదని ప్రజలు గుర్తించాలని, వెనుకబడిన యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేకు విద్యాశాఖ మంత్రిగా ఇవ్వడం ఈ ప్రాంత ప్రజలకు జగన్ ఇచ్చిన గొప్ప బహుమతి అని ఆయన అన్నారు. గత ఐదేళ్ల కాలంలో ఏకపక్ష పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని, చంద్రబాబునాయుడు లాంటి ముఖ్యమంత్రిని గతంలో ఎన్నడు చూడలేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీరాదు, ఆ పార్టీ గెలిచేది లేదని టీడీపీ వర్గీయులు ప్రగల్బాలు పలికారని, కానీ దేవుని కృపతో అత్యధిక మెజార్టీతో గెలిపించి రాష్ట్ర ప్రజలు తమ పార్టీని ఆశీర్వదించారని మంత్రి చెప్పారు.
ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ప్రజలకు వినమ్రతతో శిరస్సు వంచి సేవలు అందిస్తామన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్రాభివృద్ధి చేయాలన్న తపన ఉందని, ఈ పాటికే ప్రజలు ఆయన తపనను గుర్తించారని చెప్పారు. ఆయన నాయకత్వంలో వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వ కాలంలో వెలిగొండ ప్రాజెక్టు సాధన కోసం ప్రజలు అనేక విన్నపాలు చేసినప్పటికీ పట్టించుకోలేదని, ఆ ప్రాజెక్టు పూర్తయితేనే పశ్చిమ ప్రకాశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
విద్యాభివృద్ధే ప్రధాన ధ్యేయం...
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందని మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. సర్వాయపాలేనికి వెళ్తున్న ఆయనకు మార్గమధ్యంలోని బోయలపల్లె ఉన్నత పాఠశాల విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మంత్రి కాసేపు మాట్లాడుతూ పేద పిల్లలు బడికి వెళ్లి చదువుకోవాలని, వారు మహోన్నత శిఖరాలు అధిష్టించి దేశ, రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలనే ఉద్దేశంతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా పిల్లలను బడికి పంపించిన ప్రతి తల్లికి సంవత్సరానికి రూ.15 వేలు అందిస్తామని, ఇది పేదల కుటుంబాలకు ఆర్థిక వెసలుబాటు కల్పిస్తుందని తెలిపారు.
తమ ప్రభుత్వం విద్యాభివృద్ధే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుందని, ఈ మేరకు పాఠశాలలను ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లి అభివృద్ధి పరచాలన్న ఉద్దేశంతో ఉందని ఆయన అన్నారు. ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడానికి కార్యచరణ రూపొందిస్తున్నామని, నీటి వసతి, అదనపు తరగతి గదుల నిర్మాణం, ప్రహరీలు లాంటివి అభివృది చేస్తామని మంత్రి చెప్పారు. పిల్లలు ఇంటి వద్ద ఉన్న తోటి పిల్లలను బడికి పిలుచుకుని రావాలని సూచించారు. ఈ సందర్భంగా ఎంఈఓ పి.ఆంజనేయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇందిరా ప్రసాద్‌లు మంత్రికి శాలువాకప్పి సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment