
సాక్షి, ప్రకాశం : సానుభూతి పొందడానికి దళిత వ్యక్తిని ఎన్నికల్లో పోటీలో ఉంచి చంద్రబాబు దళితులను కించపరుస్తున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు దళితులతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న 21 మంది ఎమ్మెల్యే సీట్లతో రాజ్య సభ సీటు గెలిచే అవకాశం లేకున్న చంద్రబాబు దళిత వ్యక్తి వర్ల రామయ్యను పోటీలో పెట్టడం సానుభూతికోసమేనన్నారు.
మంగళవారం మార్కాపురంలో విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. 2016లో దళిత వ్యక్తి టీ పుష్పరాజ్‌ను రాజ్యసభకు పంపుతానని చెప్పి చివరి నిమిషంలో టీజీ వెంకటేష్‌ను రాజ్యసభకు పంపిన చరిత్ర చంద్రబాబుదని దుయ్యబట్టారు. 2018లో దళిత వ్యక్తి వర్ల రామయ్యకు సీటు ఇస్తానని చెప్పి రెండు గెలిచే సీట్లు ఉన్న సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్‌ను రాజ్యసభకు పంపించి రామయ్యను మోసం చేశారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందరికీ సమన్యాయం చేస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment