రాజమండ్రి సిటీ, న్యూస్‌లైన్ : చీకటి పడితే చాలు.. రాజమండ్రిలోని గోదావరి రైల్వే స్టేషన్ గంజాయి, వైట్ లెడ్ లాంటి మాదకద్రవ్యాల అంగడిగా మారిపోతోంది. భవిష్యత్తుకు పునాది వేసుకోవలసిన యువత.. మత్తుకు బానిసలవుతున్నారు. రైల్వేస్టేషన్‌లో జరిగే ఈ అక్రమాన్ని అరికట్టాల్చిన పోలీసు యంత్రాంగం పట్టించుకోవడం లేదు. రాత్రి సమయంలో గోదావరి రైల్వే స్టేషన్‌లో ఆగే రైళ్లు ఒకటో, రెండో. ఆ కారణంగా చీకటి పడ్డాక స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ కారణంగానే మాదకద్రవ్యాలను అమ్మేవారు ఈ రైల్వే స్టేషన్‌ను అడ్డాగా ఎంచుకున్నారు.
నిత్యకృత్యమైన ఈ వ్యాపారాన్ని నిరోధించేందుకు అటు రైల్వే పోలీసులు గానీ, ఇటు మూడవ పట్టణ పోలీసులు గానీ కనీసంగా కూడా ప్రయత్నించడం లేదు. పలువురు విద్యార్థులు.. ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదివే వారు మత్తుకు అలవాటు పడి, రాత్రయ్యే సరికి గోదావరి రైల్వేస్టేషన్‌కు చేరుకుంటున్నారు. గంజాయి సేవించిన మత్తులో.. ద్విచక్ర వాహనాలను మితిమీరిన వేగంతో నడిపి ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు అనేకం. విద్యార్థుల నడవడికను గమనించాలన్న కనీస స్పృహ లేని తల్లిదండ్రులు కూడా వారి పతనానికి దోహదం చేస్తున్నట్టే లెక్క.
మద్యం తాగితే వాసన వస్తుందని, తల్లిదండ్రులకు తెలిసిపోతుందని, అందుకే తాము గంజాయి సేవిస్తున్నామని పలువురు యువకులు చెప్పడం గమనార్హం. అటు రైల్వే పోలీసులు,ఇటు పట్టణ పోలీసులు సంయుక్తంగా నిఘా పెట్టి రాత్రి సమయాల్లో దాడులు జరిపితే మాదకద్రవ్యాల విక్రయాలను అరికట్టవచ్చని పలువురు అంటున్నారు.
కాగా గోదావరి రైల్వేస్టేషన్‌లో మాదకద్రవ్యాల విక్రయంపై వివరణ కోరగా.. గంజాయి అమ్మకం విషయం తమ దృష్టికి వచ్చిందని ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ బి.రాజు చెప్పారు. నిఘా పెట్టినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికే రెండు, మూడు కేసులు నమోదు చేశామని, గంజాయి వ్యాపారులపై మరింత దృష్టి సారించి రైల్వే పరిధిలో ఏ విధమైన మాదకద్రవ్యాల అమ్మకాలు లేకుండా అరికడతామని చెప్పారు.
కాగా రైల్వేస్టేషన్‌లో గంజాయి అమ్మకాలను అరికడతామని మూడవ పట్టణ ఇన్‌స్పెక్టర్ ఎం.రమేష్ చెప్పారు. రాత్రి సమయాల్లో రైల్వే స్టేషన్ వద్ద పోలీసుల నిఘా పెంచుతామన్నారు. మత్తు పదార్థాలు అమ్మేవారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లి చర్యలు చేపడతామని చెప్పారు.
‘గోదావరి’లో గంజాయి వెల్లువ
Published Tue, Apr 1 2014 12:43 AM | Last Updated on Fri, May 25 2018 2:57 PM
Advertisement
Advertisement