The railway police
-
సికింద్రాబాద్‌లో ఆరుగురు దొంగల అరెస్ట్
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో వెయిటింగ్ లిస్ట్‌ను కన్ఫమ్ చేపిస్తామంటూ ప్రయాణికుల దృష్టి మరల్చి లగేజీని దొంగిలిస్తోన్న ఆరుగురిని గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.22వేల నగదు, 1400 రియాళ్లు(విదేశీ కరెన్సీ), 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
88కిలోల గంజాయి స్వాధీనం
- ఇద్దరు మహిళల అరెస్టు బాసర నిజామాబాద్ జిల్లా నవీపేట్ నుంచి మహారాష్ట్రకు రైల్లో గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను రైల్వే పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. రూ.3 లక్షల విలువైన 88 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రైల్వే ఎస్సై డి.సాయినాథ్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని అమరావతి పట్టణంలో ఉన్న హలీంనగర్కు చెందిన సహారబీ, అక్బర్‌నగర్‌కు చెందిన అమీనాబీలకు నిజామాబాద్ పట్టణానికి చెందిన ముఠా సభ్యులు గంజాయిని ఆటోలో తీసుకొచ్చి బాసర సమీపంలోని ఫకీరాబాద్ వద్ద అందజేశారు. మహారాష్ట్రలోని నాందేడ్‌కు వెళ్లాల్సిన మహిళలు పండరీపూర్-నిజామాబాద్ రైల్లో నవీపేట్ రైల్వేస్టేషన్లో కాచిగూడ మన్మథ్ ప్యాసింజర్ రైల్లో మహారాష్ట్రకు పయనమయ్యూరు. నిజామాబాద్ నుంచి తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు బాసర రైల్వే స్టేషన్ వద్ద బ్యాగులు ఎవరివని ప్రశ్నించారు. వారు మరో బోగీలో ఉన్నారని చెప్పడంతో పోలీసులు సహారబీ, అమీనాబీలను అదుపులోకి తీసుకున్నారు. ముథోల్ డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మణ్, ఆర్ఐ రాకేశ్ సమక్షంలో పంచనామా నిర్వహించారు. బ్యాగులో 40 ప్యాకెట్లలో గంజాయి ఉంది. నిందితులను సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
ఎక్కడో పుట్టి...
రైలు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న అభాగ్యులు ఆచూకీ లభించక అనాథ శవాల్లా... అంత్యక్రియలు మూడేళ్లలో 46 మృతదేహాలను గుర్తించలేకపోయిన పోలీసులు తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగల్చుతున్న వైనం విజయనగరం రైలులో ప్రయాణిస్తూ ఎంతోమంది దురదృష్టవశాత్తూ కిందపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో ఇతర రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. రైలు నుంచి జారిపడి మృతిచెందిన వారి ముఖాలు కొందరివి పూర్తిగా ఛిద్రమవ్వడం, వారి జేబుల్లో కనీసం వారికి సంబంధించిన వివరాలు లేకపోవడంతో మృతదేహాలను గుర్తించలేకపోతున్నారు. ఫలితంగా అనాథ శవాల్లా అంతిమసంస్కారం చేసేస్తున్నారు. ఈయన కోసం ఎదురుచూసే వారి తల్లిదండ్రులకు గర్భశోకమే మిగులుతోంది. మూడేళ్లలో గుర్తించలేని మృతదేహాలు 46 గడచిన మూడేళ్లలో రైలు ప్రమాదాల్లో మరణించిన 46మందిని గుర్తించలేకపోయారు. వీరు ఎక్కడున్నారో వారి తల్లిదండ్రులకు తెలియదు. ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉంటారనే వారి తల్లిదండ్రులు భావిస్తుంటారు తప్ప ఇలా రైలు నుంచి జారిపడి మృతిచెందారని తెలియడంలేదు. సాధారణంగా మృతి చెందినవారి జేబుల్లో ఏవైనా ఆధారాలు లభ్యమైతే రైల్వే పోలీసులు సంబంధిత వ్యక్తులకు సమాచారం అందిస్తారు. అలా ఏమీ లభ్యం కానట్టయితే మృ తుల వద్దనున్న టిక్కెట్లు, ముఖాల ద్వారా ఆయా రైల్వే పోలీసులకు ఫొటోలను పంపిస్తారు. వారి ద్వారా ఆచూకీ తెలుసుకునేందుకు యత్నిస్తారు. కొన్నాళ్లపాటు ఎదురుచూసి ఎవరూ రానట్టయితే అంతిమసంస్కారం చేసేస్తారు. మృతుల్లో ఎక్కువమంది పరాయిరాష్ట్రం వారే... రైలునుంచి జారిపడి మృతిచెందిన వారిలో ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉంటున్నారు. ఒరిస్సా, బీహార్, చత్తీస్‌గఢ్, బెంగళూరు, హర్యానా ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువగా రైలు నుంచి జారిపడి మృత్యువాత పడుతున్నారు. అలాంటి వారి సమాచారం తెలుసుకోవడం పోలీసులకు పెద్ద సవాల్‌గానే మారుతోంది. ‘సూసైడ్’ పాయింట్‌గా నెల్లిమర్ల రైల్వే ట్రాక్ నెల్లిమర్ల: ఆ దారిలో వెళ్లాలంటే స్థానికులకు హడల్. పట్టపగలే ఆ దారిగుండా వెళ్లాలన్నా చచ్చేంత భయం. మూడేళ్ళలో అక్కడ సుమారు 50మంది మృత్యువాత పడ్డారు. కొంతమంది జీవితంపై విరక్తితో చనిపోతే మరి కొంతమంది ప్రమాదవశాత్తూ మృత్యు ఒడికి చేరుతున్నారు. కొంతమందికి తలలు తెగిపడగా.. మరి కొందరికి కాళ్ళు, చేతులు తెగిపడ్డాయి. ఇదీ నెల్లిమర్ల పట్టణంలోని ఆర్వోబీ సమీపంలోని రైల్వేట్రాక్ వద్ద భయానక పరిస్థితి. పట్టణంనుంచి ప్రభుత్వ కార్యాలయాలకు, మిమ్స్ ఆసుపత్రికి వెళ్లేదారిలో రైల్వేట్రాక్‌పై గతంలో గేటు ఉండేది. 2013లో ఇక్కడ ఆర్వోబీ ప్రారంభమైన తరువాత గేటు తీసేశారు. అప్పటినుంచి వరుస సంఘటనలు సంభవిస్తున్నాయి. 2013లో విజయనగరం పట్టణానికి చెందిన ఓ తండ్రితో పాటు ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని చనిపోయారు. అలాగే పట్టణానికి ఆనుకుని ఉండటంతో తరచూ ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మూడేళ్ళలో ఇక్కడ మొత్తం 50మంది ప్రాణాలు పోయాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటిలో చాలావరకు ఆత్మహత్యలే కావడం గమనార్హం. కొంతమంది అందరూ చూస్తుండగానే రైలు కిందపడి మృత్యువాత పడుతున్నారు. గతేడాది జరజాపుపేటకు చెందిన ఓ మహిళ అందరూ చూస్తుండగానే కొద్ది దూరంనుంచి కొంతమంది కేకలు వేస్తుండగనే రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది. గతేడాది ఓ విద్యార్థి ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవలే థామస్‌పేటకు చెందిన ఓ అమ్మాయి రైలు కిందపడి చనిపోయింది. ఈ ఏడాది జనవరినుంచి ఇప్పటివరకు ఈ ప్రాంతంలో పదిమంది వరకు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికైనా అక్కడ నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువ.. రైలు ప్రమాదాల్లో మృతిచెందిన వారిని గుర్తించలేకపోయినవారిలో ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉంటున్నారు. రైలు తలుపుల పక్కన చల్లని గాలికోసం కూర్చుని నిద్రలోకి జారి ప్రమాదవశాత్తు పడి మృతిచెందుతున్నారు. గుర్తించని మృతదేహాల ఫొటోలను డీసీఆర్బీకి పంపిస్తాం. వారు అన్నీ పరిశీలిస్తారు. ఇతర రాష్ట్రాలకు చెందిన రైల్వే పోలీసు స్టేషన్‌కు సమాచారం అందిస్తాం - ఎస్.ఖగేశ్వరరావు, ఎస్ఐ రైల్వే పోలీసు స్టేషన్ -
ప్రాణం మీదికి తెచ్చిన టిక్కెట్ లేని ప్రయాణం
ఓ వ్యక్తి రైలు ఎక్కుతూ కింది జారిపడి తీవ్రంగా గాయపడిన సంఘటన రంగారెడ్డి జిల్లా ధారూర్ రైల్వే స్టేషన్లో ఆదివారం సాయంత్రం జరిగింది. తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న రైలులో కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి టిక్కెట్ లేకుండా రైలు ఎక్కాడు. టీసీ వచ్చి వచ్చే స్టేషన్ లో టికెట్ తీసుకోవాలని సూచించాడు. దీంతో ధారూర్ రైల్వేష్టేషన్ లో టికెట్ కోసం దిగాడు. రైలు కదలటంతో టికెట్ కొనకుండానే.. రైలు ఎక్కబోయి కింద పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రయాణీకుడికి 45 సంవత్సరాల వయస్సు ఉంటుంది. అతనిది కర్ణాటకగా రైల్వే పోలీసులు భావిస్తున్నారు. -
ప్రాణాలతో పరాచికం
సాక్షి, ముంబై: లోకల్‌తోపాటు దూరప్రాంతాల రైళ్లలో ప్రాణాంతక విన్యాసాలు చేయడం కొందరు యువతకు నిత్యకృత్యంగా మారడంపై గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జీఆర్పీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోగీలపై ప్రయాణించడం, ప్రవేశద్వారానికి వేలాడుతూ విన్యాసాలు చేయడం, తిరిగే ఫ్యాన్లలో వేళ్లు పెట్టడం వంటివి లోకల్‌రైళ్లలో సర్వసాధారణంగా మారాయి. బోగీలపై ప్రయాణించిన వారిలో పలువురు మరణించడం, గాయపడడం తెలిసిందే. ఇలాంటి దుస్సాహసాలు చేయవద్దని రైల్వే అధికారులు ప్రతినిత్యం అనౌన్స్మెంట్ల ద్వారా విజ్ఞప్తులు చేస్తున్నా ఆకతాయిలు పట్టించుకోవడం లేదు. వీరి చేష్టలు సహ ప్రయాణికులకు భయం పుట్టిస్తున్నాయి. ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేస్తున్న వారిలో అత్యధికులు యువకులేనని జీఆర్పీ పోలీసులు చెబుతున్నారు. ప్రమాదకర విన్యాసాల నిరోధానికి ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టామని ప్రకటించారు. బోగీల్లో ప్రాంణాంతక విన్యాసాలు చేస్తూ గత నెల 500 మంది జీఆర్పీకి చిక్కారు. కౌన్సెలింగ్ వల్ల పెద్దగా ఫలితాలు రాకపోవడంతో పోలీసులు మరో తరహా ప్రయత్నం మొదలుపెట్టారు. తప్పు చేసిన యువకుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్ మధ్య కాలంలో ప్రాంణాంతక విన్యాసాలు చేసిన 618 మందిని పశ్చిమరైల్వే ఆర్పీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. ఇదే కాలంలో సెంట్రల్ రైల్వేలోని బండ్లలో ప్రాణాంతక విన్యాసాలు చేసిన 1,208 మందిని పట్టుకున్నారు. విన్యాసాలు వికటించి చాలా మంది యువకులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఆర్పీఎఫ్ సీనియర్ అధికారి ఒకరు అన్నారు. ఈ పనులు చేస్తున్న వారిలో అత్యధికులు 14 ఏళ్ల నుంచి 22 ఏళ్ల వయస్సు గల వారేనని తేలింది. ముంబై సెంట్రల్ సీనియర్ రైల్వే పోలీస్ రాజేంద్ర త్రివేది ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైళ్లలో విన్యాసాలు చేస్తున్న వారిపై నిఘా ఉంచాల్సిందిగా తమ సిబ్బందిని ఆదేశించామన్నారు. ‘వీరిని పట్టుకోవడం వల్ల ప్రయోజనం కనిపించడం లేదు. తిరిగి ప్రాణాంతక విన్యాసాలు చేస్తూనే ఉన్నారు. అందుకే వీళ్ల తల్లిదండ్రులను రైల్వే స్టేషన్లకే పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. విన్యాసాలు చేయడం ద్వారా యువకులు ఏ విధంగా మరణించడం..తీవ్ర గాయాలపాలైన వీడియోలను తల్లిదండ్రులకు చూపించి అవగాహన కల్పిస్తున్నాం. ఫలితంగా సదరు తల్లిదండ్రులు పిల్లలను మందలించే అవకాశం ఉంటుంది. దీంతో యువకులు కూడా తిరిగి విన్యాసాలు చేయకుండా ఉంటారు’ అని త్రివేది వివరించారు. ప్రాణాంతక విన్యాసాలు చేస్తున్న వారిని పట్టుకోవడం కోసం తరచూ తనిఖీలు నిర్వహిస్తూనే ఉంటామని చెప్పారు. -
‘గోదావరి’లో గంజాయి వెల్లువ
రాజమండ్రి సిటీ, న్యూస్‌లైన్ : చీకటి పడితే చాలు.. రాజమండ్రిలోని గోదావరి రైల్వే స్టేషన్ గంజాయి, వైట్ లెడ్ లాంటి మాదకద్రవ్యాల అంగడిగా మారిపోతోంది. భవిష్యత్తుకు పునాది వేసుకోవలసిన యువత.. మత్తుకు బానిసలవుతున్నారు. రైల్వేస్టేషన్లో జరిగే ఈ అక్రమాన్ని అరికట్టాల్చిన పోలీసు యంత్రాంగం పట్టించుకోవడం లేదు. రాత్రి సమయంలో గోదావరి రైల్వే స్టేషన్లో ఆగే రైళ్లు ఒకటో, రెండో. ఆ కారణంగా చీకటి పడ్డాక స్టేషన్లో ప్రయాణికుల రద్దీ అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ కారణంగానే మాదకద్రవ్యాలను అమ్మేవారు ఈ రైల్వే స్టేషన్‌ను అడ్డాగా ఎంచుకున్నారు. నిత్యకృత్యమైన ఈ వ్యాపారాన్ని నిరోధించేందుకు అటు రైల్వే పోలీసులు గానీ, ఇటు మూడవ పట్టణ పోలీసులు గానీ కనీసంగా కూడా ప్రయత్నించడం లేదు. పలువురు విద్యార్థులు.. ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదివే వారు మత్తుకు అలవాటు పడి, రాత్రయ్యే సరికి గోదావరి రైల్వేస్టేషన్‌కు చేరుకుంటున్నారు. గంజాయి సేవించిన మత్తులో.. ద్విచక్ర వాహనాలను మితిమీరిన వేగంతో నడిపి ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు అనేకం. విద్యార్థుల నడవడికను గమనించాలన్న కనీస స్పృహ లేని తల్లిదండ్రులు కూడా వారి పతనానికి దోహదం చేస్తున్నట్టే లెక్క. మద్యం తాగితే వాసన వస్తుందని, తల్లిదండ్రులకు తెలిసిపోతుందని, అందుకే తాము గంజాయి సేవిస్తున్నామని పలువురు యువకులు చెప్పడం గమనార్హం. అటు రైల్వే పోలీసులు,ఇటు పట్టణ పోలీసులు సంయుక్తంగా నిఘా పెట్టి రాత్రి సమయాల్లో దాడులు జరిపితే మాదకద్రవ్యాల విక్రయాలను అరికట్టవచ్చని పలువురు అంటున్నారు. కాగా గోదావరి రైల్వేస్టేషన్లో మాదకద్రవ్యాల విక్రయంపై వివరణ కోరగా.. గంజాయి అమ్మకం విషయం తమ దృష్టికి వచ్చిందని ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ బి.రాజు చెప్పారు. నిఘా పెట్టినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికే రెండు, మూడు కేసులు నమోదు చేశామని, గంజాయి వ్యాపారులపై మరింత దృష్టి సారించి రైల్వే పరిధిలో ఏ విధమైన మాదకద్రవ్యాల అమ్మకాలు లేకుండా అరికడతామని చెప్పారు. కాగా రైల్వేస్టేషన్లో గంజాయి అమ్మకాలను అరికడతామని మూడవ పట్టణ ఇన్స్పెక్టర్ ఎం.రమేష్ చెప్పారు. రాత్రి సమయాల్లో రైల్వే స్టేషన్ వద్ద పోలీసుల నిఘా పెంచుతామన్నారు. మత్తు పదార్థాలు అమ్మేవారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లి చర్యలు చేపడతామని చెప్పారు.