- ఇద్దరు మహిళల అరెస్టు
బాసర
నిజామాబాద్ జిల్లా నవీపేట్ నుంచి మహారాష్ట్రకు రైల్లో గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను రైల్వే పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. రూ.3 లక్షల విలువైన 88 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రైల్వే ఎస్సై డి.సాయినాథ్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని అమరావతి పట్టణంలో ఉన్న హలీంనగర్‌కు చెందిన సహారబీ, అక్బర్‌నగర్‌కు చెందిన అమీనాబీలకు నిజామాబాద్ పట్టణానికి చెందిన ముఠా సభ్యులు గంజాయిని ఆటోలో తీసుకొచ్చి బాసర సమీపంలోని ఫకీరాబాద్ వద్ద అందజేశారు.
మహారాష్ట్రలోని నాందేడ్‌కు వెళ్లాల్సిన మహిళలు పండరీపూర్-నిజామాబాద్ రైల్లో నవీపేట్ రైల్వేస్టేషన్‌లో కాచిగూడ మన్మథ్ ప్యాసింజర్ రైల్లో మహారాష్ట్రకు పయనమయ్యూరు. నిజామాబాద్ నుంచి తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు బాసర రైల్వే స్టేషన్ వద్ద బ్యాగులు ఎవరివని ప్రశ్నించారు. వారు మరో బోగీలో ఉన్నారని చెప్పడంతో పోలీసులు సహారబీ, అమీనాబీలను అదుపులోకి తీసుకున్నారు. ముథోల్ డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మణ్, ఆర్‌ఐ రాకేశ్ సమక్షంలో పంచనామా నిర్వహించారు. బ్యాగులో 40 ప్యాకెట్లలో గంజాయి ఉంది. నిందితులను సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.