రైలు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న అభాగ్యులు
ఆచూకీ లభించక అనాథ శవాల్లా... అంత్యక్రియలు
మూడేళ్లలో 46 మృతదేహాలను గుర్తించలేకపోయిన పోలీసులు
తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగల్చుతున్న వైనం
విజయనగరం
రైలులో ప్రయాణిస్తూ ఎంతోమంది దురదృష్టవశాత్తూ కిందపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో ఇతర రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. రైలు నుంచి జారిపడి మృతిచెందిన వారి ముఖాలు కొందరివి పూర్తిగా ఛిద్రమవ్వడం, వారి జేబుల్లో కనీసం వారికి సంబంధించిన వివరాలు లేకపోవడంతో మృతదేహాలను గుర్తించలేకపోతున్నారు. ఫలితంగా అనాథ శవాల్లా అంతిమసంస్కారం చేసేస్తున్నారు. ఈయన కోసం ఎదురుచూసే వారి తల్లిదండ్రులకు గర్భశోకమే మిగులుతోంది.
మూడేళ్లలో గుర్తించలేని మృతదేహాలు 46
గడచిన మూడేళ్లలో రైలు ప్రమాదాల్లో మరణించిన 46మందిని గుర్తించలేకపోయారు. వీరు ఎక్కడున్నారో వారి తల్లిదండ్రులకు తెలియదు. ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉంటారనే వారి తల్లిదండ్రులు భావిస్తుంటారు తప్ప ఇలా రైలు నుంచి
జారిపడి మృతిచెందారని తెలియడంలేదు. సాధారణంగా మృతి చెందినవారి జేబుల్లో ఏవైనా ఆధారాలు లభ్యమైతే రైల్వే పోలీసులు సంబంధిత వ్యక్తులకు సమాచారం అందిస్తారు. అలా ఏమీ లభ్యం కానట్టయితే మృ తుల వద్దనున్న టిక్కెట్లు, ముఖాల ద్వారా ఆయా రైల్వే పోలీసులకు ఫొటోలను పంపిస్తారు. వారి ద్వారా ఆచూకీ తెలుసుకునేందుకు యత్నిస్తారు. కొన్నాళ్లపాటు ఎదురుచూసి ఎవరూ రానట్టయితే అంతిమసంస్కారం చేసేస్తారు.
మృతుల్లో ఎక్కువమంది పరాయిరాష్ట్రం వారే...
రైలునుంచి జారిపడి మృతిచెందిన వారిలో ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉంటున్నారు. ఒరిస్సా, బీహార్, చత్తీస్‌గఢ్, బెంగళూరు, హర్యానా ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువగా రైలు నుంచి జారిపడి మృత్యువాత పడుతున్నారు. అలాంటి వారి సమాచారం తెలుసుకోవడం పోలీసులకు పెద్ద సవాల్‌గానే మారుతోంది.
‘సూసైడ్’ పాయింట్‌గా నెల్లిమర్ల రైల్వే ట్రాక్
నెల్లిమర్ల: ఆ దారిలో వెళ్లాలంటే స్థానికులకు హడల్. పట్టపగలే ఆ దారిగుండా వెళ్లాలన్నా చచ్చేంత భయం. మూడేళ్ళలో అక్కడ సుమారు 50మంది మృత్యువాత పడ్డారు. కొంతమంది జీవితంపై విరక్తితో చనిపోతే మరి కొంతమంది ప్రమాదవశాత్తూ మృత్యు ఒడికి చేరుతున్నారు. కొంతమందికి తలలు తెగిపడగా.. మరి కొందరికి కాళ్ళు, చేతులు తెగిపడ్డాయి. ఇదీ నెల్లిమర్ల పట్టణంలోని ఆర్వోబీ సమీపంలోని రైల్వేట్రాక్ వద్ద భయానక పరిస్థితి.
పట్టణంనుంచి ప్రభుత్వ కార్యాలయాలకు, మిమ్స్ ఆసుపత్రికి వెళ్లేదారిలో రైల్వేట్రాక్‌పై గతంలో గేటు ఉండేది. 2013లో ఇక్కడ ఆర్వోబీ ప్రారంభమైన తరువాత గేటు తీసేశారు. అప్పటినుంచి వరుస సంఘటనలు సంభవిస్తున్నాయి. 2013లో విజయనగరం పట్టణానికి చెందిన ఓ తండ్రితో పాటు ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని చనిపోయారు. అలాగే పట్టణానికి ఆనుకుని ఉండటంతో తరచూ ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మూడేళ్ళలో ఇక్కడ మొత్తం 50మంది ప్రాణాలు పోయాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటిలో చాలావరకు ఆత్మహత్యలే కావడం గమనార్హం.
కొంతమంది అందరూ చూస్తుండగానే రైలు కిందపడి మృత్యువాత పడుతున్నారు. గతేడాది జరజాపుపేటకు చెందిన ఓ మహిళ అందరూ చూస్తుండగానే కొద్ది దూరంనుంచి కొంతమంది కేకలు వేస్తుండగనే రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది. గతేడాది ఓ విద్యార్థి ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవలే థామస్‌పేటకు చెందిన ఓ అమ్మాయి రైలు కిందపడి చనిపోయింది. ఈ ఏడాది జనవరినుంచి ఇప్పటివరకు ఈ ప్రాంతంలో పదిమంది వరకు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికైనా అక్కడ నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువ..
రైలు ప్రమాదాల్లో మృతిచెందిన వారిని గుర్తించలేకపోయినవారిలో ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉంటున్నారు. రైలు తలుపుల పక్కన చల్లని గాలికోసం కూర్చుని నిద్రలోకి జారి ప్రమాదవశాత్తు పడి మృతిచెందుతున్నారు. గుర్తించని మృతదేహాల ఫొటోలను డీసీఆర్‌బీకి పంపిస్తాం. వారు అన్నీ పరిశీలిస్తారు. ఇతర రాష్ట్రాలకు చెందిన రైల్వే పోలీసు స్టేషన్‌కు సమాచారం అందిస్తాం
- ఎస్.ఖగేశ్వరరావు, ఎస్‌ఐ రైల్వే పోలీసు స్టేషన్