పట్నంబజారు (గుంటూరు) : ‘అమ్మ ఒడి’ పథకం ఇంటర్మీడియెట్ విద్యార్థులకు వర్తింపజేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గుంటూరులో విద్యార్థిలోకం ముక్తకంఠంతో కృతజ్ఞతలు తెలిపింది. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో మంగళవారం పెద్ద సంఖ్యలో విద్యార్థులు స్వచ్ఛందంగా రోడ్డెక్కి ‘ధన్యవాదాలు సీఎం సార్’ అంటూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ‘మా మంచి ముఖ్యమంత్రి’ అంటూ నగర వీధుల్లో కదం తొక్కారు. లక్ష్మీపురంలో భారీ ర్యాలీ నిర్వహించి సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు మాట్లాడుతూ తెలుగుదేశం హయాంలో విద్యావ్యవస్థ కార్పొరేట్ కోరల్లో చిక్కుకోవడంతో విద్యార్థులు విలవిల్లాడారన్నారు. ఈ దశలో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జగన్ ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఉన్నత ఆశయంతో అమ్మ ఒడి పథకానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఈ పధకం తొలుత పాఠశాలలకే పరిమితమని ప్రకటించినా.. తర్వాత విశాల దృక్పథంతో ఇంటర్‌కు కూడా వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. అందుకు గాను యావత్ విద్యార్థి లోకం తరుపున సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. పానుగంటి చైతన్య మాట్లాడుతూ, టీడీపీ పాలనలో అందని ద్రాక్షగా మారిన విద్యను అందరికీ అందుబాటులోకి తేవడమే వైఎస్సార్ సీపీ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. ముఖ్యమంత్రి నవరత్నాల పథకంలో విద్యా రంగానికి ఇచ్చిన ప్రాధాన్యతే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్ధి విభాగం నేతలు విఠల్, రవి, బాజి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment