మృత్యు తీరం.. స్నానానికి వెళ్లి.. | 4 Young Men Missing In Kalingapatnam Beach And Police Found One Dead Body | Sakshi
Sakshi News home page

మృత్యు తీరం.. స్నానానికి వెళ్లి..

Published Mon, Nov 11 2019 8:09 AM | Last Updated on Mon, Nov 11 2019 8:18 AM

4 Young Men Missing In Kalingapatnam Beach And Police Found One Dead Body - Sakshi

మృతదేహాన్ని నీటిలోంచి ఒడ్డుకు తీసుకువస్తున్న పోలీసులు

అంతవరకు అక్కడే కలిసి తిరిగారు. అక్కడే కలిసి తిన్నారు. నవ్వుకున్నారు.. ఆడుకున్నారు.. సందడిగా గడిపారు. ఒక్క క్షణంలో పరిస్థితులు తారుమారైపోయాయి. వారి నవ్వులన్నీ సముద్ర ఘోషలో కలిసిపోయాయి. సందడులు రోదనలుగా మారిపోయాయి. అందంగా కనిపించిన సముద్ర తీరం తన భయంకర రూపాన్ని ప్రదర్శించింది. నది నీటి కలయికతో రూపు కోల్పోయి ఉన్న తీరం నలుగురు యువకులను అమాంతం లోపలకు లాక్కుపోయింది. కళింగపట్నం బీచ్‌లో ఆదివారం స్నానానికి దిగిన నలుగురు యువకులు తిరిగి బయటకు రాలేదు. అందులో ఒకరు ప్రాణాలు కోల్పోయి ఒడ్డు చేరగా.. మిగిలిన ముగ్గురి ఆచూకీ ఇంకా దొరకలేదు. యువకులంతా ఒకే కళాశాలలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నారు. చేతికి అందివచ్చిన బిడ్డలు అర్ధంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబాల్లో తీరని శోకం నెలకొంది.  

సాక్షి, గార(శ్రీకాకుళం రూరల్‌): కార్తీక ఆదివారం సందర్భంగా గార మండలంలోని కళింగపట్నం–మత్స్యలేశం పరిధిలో బీచ్‌కు వచ్చిన ఆరుగురు ఇంటర్‌ యువకుల్లో నలుగురు గల్లంతయ్యారు. శ్రీకాకుళంలోని చైతన్య కళాశాలలో ఇంటర్మీడియెట్‌ రెండో సంవత్సరం చదువుతున్న శిర్ల శివరామిరెడ్డి (ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి), కనుమూరు సంజయ్, యజ్ఞ నారాయణ పండా, అనపర్తి సుధీర్, షేక్‌ అబ్దుల్లా, లింగాల రాజసింహాలు ఆదివారం బీచ్‌కు వెళ్లారు. అక్కడే భోజనం ముగించుకొని కొంతసేపు ఇసుక దిబ్బలపై ఆడుకున్నారు. వారిలో రాజసింహా ఒడ్డునే ఉండగా, ఐదుగురు యువకులు సముద్రంలో దిగారు. ప్రమాదం పసిగట్టలేని వారంతా ఒకరిపై సరదాగా నీరు జల్లుకుంటూ ఆనందంగా గడిపారు. నీటిలో వడి ఎక్కువగా ఉండడంతో లోపలకు వెళ్లిపోవడం వారు గమనించలేకపోయారు. గమనించే సరికే నీరు లోపలకు లాక్కువెళ్లిపోయింది. ప్రమాదాన్ని పసిగట్టిన మెరైన్‌ పోలీసులు షేక్‌ అబ్దుల్లాను కాపాడగలిగారు. శిర్ల శివరామిరెడ్డి (ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి), కనుమూరు సంజయ్, యజ్ఞ నారాయణ పండా, అనపర్తి సుధీర్‌లు మాత్రం నీటిలో మునిగిపోయారు.

వీరిలో కొంత సేపటి తర్వాత సుధీర్‌ మృతదేహం కనిపించగా పోలీసులు ఒడ్డుకు తీసుకువచ్చారు. మిగిలిన ముగ్గురి ఆచూకీ ఇంకా దొరకలేదు. పౌర్ణమి రోజులు కావడంతో రాత్రిపూట సముద్రం ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. రోజంతా సందడి కనిపించిన తీరంలో ఈ ఘటనతో భయానక వాతావరణం నెలకొంది. మెరైన్‌ సీఐ అంబేడ్కర్, ఇన్‌చార్జి ఎస్సై సింహాచలం, స్థానిక మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎస్పీ అమ్మిరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాలింపు చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు అబ్దు ల్లా, రాజసింహతో మాట్లాడి సంఘటన తీరును తెలుసుకున్నారు. డీఎస్పీ మూర్తి,  శ్రీకాకుళం పట్టణ సీఐ లలిత, తహసీల్దార్‌ జెన్ని రామారావు, మెరైన్‌ ఎస్‌ఐ జగన్‌ తదితరులు ఉన్నారు.  

                       ఆఖరి క్షణంలో... సముద్రస్నానంలో గల్లంతైన స్నేహితులు
అంతా మెరిట్‌ స్టూడెంట్లే! 
శ్రీకాకుళం రూరల్‌: ఆ విద్యార్థులంతా టెన్త్‌లో మంచి మార్కులు సాధించిన వారే. ఒక్కొక్కరూ ఒక్కో పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశారు. ఇంటర్‌ ఒకే క్యాంపస్‌లో చదవడంతో మంచి స్నేహితులు అయ్యారు. రెండు రోజులు సెలవులు కావడంతో కుటుంబ సభ్యులకు చెప్పకుండా పిక్‌నిక్‌కు వెళ్లారు. తిరిగి వచ్చేస్తామనే అనుకున్నారు గానీ.. ఇంతలో విధి ఇలా వికృతంగా ఆడుకుంది. కళింగపట్నం బీచ్‌లో గల్లంతైన వారంతా శ్రీకాకుళంలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. గల్లంతైన వారి కుటుంబ నేపథ్యా లు పరిశీలిస్తే ఒక్కొక్కరిది ఒక్కో కథ. గల్లంతైన వారిలో ముగ్గురు వారి తల్లిదండ్రులకు ఏకైక సంతానం కావడం విషాదకరం. బిడ్డల పరిస్థితిపై సమాచారం అందుకున్న ఆ తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. ఎదిగి ఆదుకుంటారనుకున్న బిడ్డలు ఇలా అర్ధంతరంగా వదిలివెళ్లిపోయారని తెలిసి కంటికీమింటికీ ఏకధారగా రోదించారు.  

పచ్చళ్లు అమ్ముకుంటూ..  
గల్లంతైన వారిలో ఒకడైన సుధీర్‌ తండ్రి కృష్ణ పచ్చళ్లు అమ్ముకుంటూ బతుకుతున్నారు. తూర్పుగోదావరి నుంచి శ్రీకాకుళానికి వలస వచ్చిన వీరు పాతబ్రిడ్జి సమీపంలోని హయాతీనగరంలో నివాసముంటూ పచ్చళ్లు తయారు చేస్తుంటారు. సుధీర్‌ ఇంటర్‌ ఎంపీసీ సెకండియర్‌ చదువుతున్నారు. సుధీర్‌ తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం. ఒక్కగానొక్క కొడుకు సముద్రంలో మునిగి చనిపోయాడని తెలిసి ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోదించారు. సుధీర్‌ పదో తరగతి వరకూ శ్రీకాకుళంలోని కేశవరెడ్డి స్కూల్లో చదివాడు.   

ఇంటికి వెళ్దామన్నా రాలేదు.. 
రెండు రోజులు సెలవులు వచ్చాయి. ఇంటికి వెళ్దామని తన తమ్ముడు యోగ్యనారాయణ పండాను బతిమలాడినా రాలేదని యజ్ఞ నారాయణ పండా అక్క ఇంద్రావతి పండా రోదిస్తూ చెప్పింది. వీరిద్దరూ కలిసి శ్రీకాకుళంలోని మహాలక్ష్మీనగర్‌ కాలనీలో తమ బంధువుల ఇంటి వద్ద అద్దెకు ఉంటూ చదువుకుంటున్నారు. తండ్రి పూర్ణచంద్రపండా ఇచ్ఛాపురంలోని నర్మదేశ్వరస్వామి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నారు. తల్లి నమితా పండా గృహిణి. వీరికి ఇద్దరు సంతానం. అందులో రెండో అబ్బాయి నారాయణ పండా. ఇతను పదోతరగతి వరకూ ఇచ్ఛాపురంలోని జ్ఞానభారతి పబ్లిక్‌ స్కూల్లో చదివాడు. ఇంటర్మీడియట్‌ శ్రీచైతన్యలోని బైపీసీ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. బిడ్డ పరిస్థితి తెలిసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అక్క ఇంద్రావతి రోదన ఆపడం ఎవరి తరం కాలేదు.  

దేవుని సేవలు చేస్తున్నా.. 
గల్లంతైన వారిలో ఒకరైన సంజయ్‌ తండ్రి ఐరన్‌ కుమార్‌ నిత్యం దేవుని సేవలోనే ఉంటారు. ఇండియన్‌ ఇమాజినల్‌ మిషన్‌లో ఆయన పనిచేస్తున్నారు. ఈ దంపతులకు కూడా సంజయ్‌ ఒక్కగానొక్క సంతానం. నిత్యం దేవుని సేవలో గడిపే తమకు ఇంత పెద్ద దుఖం వస్తుందని ఊహించలేదని వారు కన్నీరుమున్నీరయ్యారు. ఎదిగి వచ్చిన కొడుకు ఇలా అయిపోవడంతో తల్లడిల్లిపోయారు. వీరు శ్రీకాకుళంలోని ఏపీహెచ్‌బీ కాలనీలో నివాసం ఉంటున్నారు. తల్లి సుశీలా డీఆర్‌డీఏలో అసిస్టెంట్‌ ప్రాజెక్టు మేనేజర్‌గా పనిచేస్తున్నారు. మృతి చెందిన విద్యార్థి  కరుమారి సంజయ్‌ శ్రీచైతన్యలో బైపీసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇతడు కేంద్రీయ విద్యాలయంలో పదోతరగతి పూర్తి చేశాడు.  

బయటకు వెళ్తానని చెప్పి..  
ఫ్రెండ్స్‌తో కలిసి బయటకు వెళ్తానని చెప్పిన కొడుకు మళ్లీ తిరిగిరాకుండా వెళ్లిపోతాడని అనుకోలేదని శివరామిరెడ్డి తల్లిదండ్రులు రామిరెడ్డి, లత భోరున విలపిస్తున్నారు. ఒక్కగానొక్క కొడుకు చిర్ల శివరామరెడ్డి ఇలా సముద్రంలో గల్లంతవుతాడని ఊహిం చలేదని వారు రోదిస్తున్నారు. శ్రీకాకుళంలోని 80 ఫీట్‌రోడ్‌లో వీరు నివాసం ఉంటున్నారు. తండ్రి వృత్తిరీత్యా ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నారు. శ్రీచైతన్య కళాశాల్లో ఇంటర్మీడియట్‌ బైపీసీ చదువుతున్నాడు. పదోతరగతి కుడా శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లోనే చదివాడు.(చదవండి: సముద్ర స్నానానికి వెళ్లి ఐదుగురు గల్లంతు)   

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

సంఘటన స్థలంలో ప్రజలు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement